Siddipet: ప్రమాదం మీద ప్రమాదం - ఈసారి కోతి రూపంలో చిన్నారిని కబలించిన మృత్యువు!
Siddipet: ఇటీవలే పెను ప్రమాదం నుంచి బయటపడ్డ ఓ చిన్నారి మృత్యువు వెంటాడి మరీ కబలించింది. ఓ సమస్యను నుంచి బయటపడ్డానుకునేలోపే మరో సమస్యతో చనిపోయాడు.
Siddipet: ఆ బాబు వయసు మూడేళ్లు. అతడు బుడ్డి బుడ్డి కాళ్లతో అడుగులు వేస్తుంటే, ముచ్చట్లు చెబుతుంటే మరిసిపోయారు ఆ తల్లిదండ్రులు. అయితే ఇటీవలే ఆ బాబు ఆడుకుంటూ వెళ్లి గడప తట్టుకొని కింద పడ్డాడు. పక్కనే ఉన్న కత్తి మెడకు గుచ్చుకోవడంతో తీవ్రంగా గాయపడ్డ బాలుడిని తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. నాలుగు లక్షల రూపాయల వరకు ఖర్చు చేసుకొని... కష్టపడి కుమారుడ్ని కాపాడుకున్నారు. ఆ గాయం పూర్తిగా మానకముందే.. ఈసారి వారికి కోలుకోలేని దెబ్బ తగిలింది. మరో సమస్య వచ్చి ఏకంగా బాబు ప్రాణాలు తీసింది. ఇంటిమీదకు కోతులు వచ్చి వీరంగం చేయగా.. ఓ బండరాయి కిందపడింది. అదే సమయంలో బాలుడు అక్కడే ఉండడంతో.. తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. తమ కళ్లెదుటే కుమారుడు చనిపోవడాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఆ మధ్య హైదరాబాద్ లోని అంబర్ పేట ఏరియాలో కుక్కల దాడిలో చిన్నారి ప్రదీప్ ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం పలు చోట్ల వీధి కుక్కల దాడుల ఘటనలు చూశాం. కొన్ని చోట్ల చిన్నారులతో పాటు పెద్దవారు సైతం కుక్కల దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసి తీవ్రంగా గాయపడ్డారు.
అసలేం జరిగిందంటే..?
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కట్కూరులో విషాధం చోటు చేసుకుంది. కట్కూరుకు చెందిన దేవునూరి శ్రీకాంత్, రజిత దంపతులకు ఇద్దరు కుమారులు. అయితే గ్రామంలో వారికి ఓ ఇల్లు ఉంది. రెండు స్లాబు గదులతో పాటు రేకులతో కూడిన వంటశాల ఉంది. అయితే ఈ రెండింటికి మధ్య గాలి, వెలుతురు కోసం కాస్త ఖాళీ ప్రదేశం ఉంచారు. దానిపై ఓ తడక పెట్టి గాలికి పడిపోకుండా దానిపై ఓ బండ రాయిని పెట్టారు. సోమవారం రోజు కోతులు అక్కడికి వచ్చాయి. బయట నుంచి ఇంట్లోకి కోతులు పైనుంచి ప్రవేశించాయి. దీంతో లోపల ఉన్న రజిత కోతులను తరిమేందుకు బయటకు వచ్చింది. ఆమె వెంటే తమ మూడేళ్ల బాలుడు అభినవ్ కూడా వెళ్లాడు. అయితే వచ్చిన మార్గం నుంచే వెళ్లిపోయేందుకు కోతులు తడకపైకి ఎగిరాయి. ఈ క్రమంలోనే పైన ఉన్న బండరాయి కింద పడింది. అయితే ఆ బండరాయి బాలుడి మీద పడంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తీవ్రగాయాలపాలైన బాలుడు అభినవ్ అక్కడికక్కడే మృతి చెందాడు. తన ముందే కుమారుడు చనిపోవడాన్ని చూసిన తల్లి జీర్ణించుకోలేకపోతుంది. కన్నీరుమున్నీరుగా విలపించింది.
అయితే నెల రోజుల క్రితమే అభినవ్ కు మరో పెద్ద గాయం అయింది. ఇంట్లో ఆడుకుంటూ వెళ్లిన బాలుడు అభినవ్.. గడప దాటుతుండగా కాలు జారి పడ్డాడు. అదే సమయంలో అక్కడే ఉన్న కత్తి గొంతులోకి దిగింది. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు బాలుడిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. నాలుగు లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేసి బాబును కాపాడుకున్నారు. ఆ గాయం ఇంకా పూర్తిగా మానకముందే.. మరోసారి బండరాయి మీద పడడం.. బాలుడు చనిపోవడంతో తల్లిదండ్రులతో పాటు బంధువులు ఈ నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.