Shrirampur Police: పుష్ప సినిమా స్టైల్లో గంజాయి స్మగ్లింగ్- ఎలా చేశారో తెలిస్తే షాక్
Shrirampur Police: జనాల మీద సినిమాల ప్రభావం గట్టిగానే ఉందని ఓ సినిమాలో మహేష్ బాబు అంటారు. జనాల మీద ఎంత ఉందో తెలీదు కానీ, స్మగ్లర్ల మీద మాత్రం చాలా ఉంది.
Shrirampur Police: జనాల మీద సినిమాల ప్రభావం గట్టిగానే ఉందని ఓ సినిమాలో మహేష్ బాబు అంటారు. జనాల మీద ఎంత ఉందో తెలీదు కానీ, స్మగ్లర్ల మీద మాత్రం చాలా ఉంది. జీవితంలో సినిమాల ప్రభావం చాలానే ఉంది. పుష్ప సినిమా విడుదల అయ్యాక స్మగ్లింగ్ ఇలా కూడా చేయొచ్చా అనుకునే రీతిలో స్మగ్లర్లు కొత్త కొత్త ఆలోచనలతో చెలరేగిపోతున్నారు. పుష్ప సినిమాలో పాల ట్యాంకర్‌లో, పండ్ల మాటున స్మగ్లింగ్ ఎలా చేయోచ్చో చూపించారు. అదే బాటను ఒడిశా గంజాయి స్మగ్లర్లు నిజ జీవితంలో అప్లై చేశారు. పుష్ప సినిమా తరహాలో కొందరు స్మగ్లర్లు సరికొత్తగా ఆలోచించడం మొదలు పెట్టారు.
ఫారెస్ట్ అధికారులకు అంతు చిక్కని రీతిలో గంజాయి రవాణా చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్త తరహా ప్లాన్లతో స్మగ్లింగ్‌కు పాల్పడతున్నారు. ఈ సారి గంజాయిని పెద్ద మొత్తంలో ట్రాక్టర్‌లో ఉంచి పైన సిమెంట్ ఇటుకలు పేర్చి స్మగ్లింగ్ చేయాలని చూశారు. అయితే వారి అనుకున్నది ఒకటి, అయిందొకటి అన్న చందంగా వారి ప్లాన్ అనుకోని విధంగా ప్లాప్ అయ్యింది. అనుకోకుండా ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో స్మగ్లర్లు తప్పించుకునే మార్గంలేక ట్రాక్టర్‌ను అక్కడే వదిలేసి పారిపోయారు. అయితే దొంగ ఎప్పటికైనా పోలీసులకు దొరకాల్సిందే కదా! చివరకు తెలంగాణ పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు.
వివరాలు.. నిషేధిత గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు నిందితులను శ్రీరాంపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామగుండం సీపీ రెమా రాజేశ్వరి తెలిపారు. ఒడిశా నుంచి ఒక ముఠా మంచిర్యాల మీదగా మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్నట్లు చెప్పారు. ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లాకు చెందిన జగబందు క్రిసాని, చిత్ర సేన్ క్రిసాని నెంబర్ ప్లేట్ లేని ట్రాక్టర్‌లో ఇటుకల మధ్య 465 కిలోలు, సుమారు 93 లక్షలు విలువ చేసే గంజాయిని తరలించేందుకు యత్నించారు.
గంజాయిని ఇటుకల మధ్యలో పెట్టి మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా మీదగా అక్రమంగా తరలిస్తుండగా ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో గంజాయిని తప్పించే మార్గం లేక నిందితులు సంఘటన స్థలం నుంచి నిందితులు పరారయ్యారు. ట్రాక్టర్ బోల్తాపై పోలీసులకు సమాచారం అందడంతో వారు ఘటనా స్థలంల చేరుకుని విచారణ చేపట్టారు. అక్కడ ఎవరూ లేక పోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ట్రాక్టర్‌ను తనిఖీలు చేయగా గంజాయి బయపడింది. భారీ మొత్తంలో గంజాయి ఉండడంతో పోలీసులు రెండు స్పెషల్ టీమ్స్‌ను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
ట్రాక్టర్ ఓనర్‌తో పాటు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితులు పరారీలో ఉన్నట్లు సీపీ రాజేశ్వరి తెలిపారు. త్వరలోనే గంజాయి అక్రమ సరఫరా చేస్తున్న ముఠాను అరెస్ట్ చేస్తామని అన్నారు. నిందితుల వద్ద నుంచి రెండు సెల్‌ఫోన్లు, గంజాయి తరలిస్తున్న ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులను కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించనున్నట్లు ఆమె తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో కీలకపాత్ర వహించిన శ్రీరాంపూర్ పోలీసులను ఆమె ప్రత్యేకంగా అభినందించారు.