TS Congress Fight : రాజనర్సింహ చెప్పిన కోవర్టులు ఎవరు ? తెలంగాణ కాంగ్రెస్‌లో అసంతృప్తికి అంతే ఉండదా ?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి అంతకంతకూ పెరిగిపోతోంది. తాజాగా కమిటీల్లో అనర్హులకు చోటు దక్కిందని.. సీనియర్లకు ప్రాధాన్యం దక్కలేదని పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
TS Congress Fight : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తుల సెగ అంతకంతకూ పెరిగిపోతోంది. తెలంగాణ కాంగ్రెస్కు కోవర్టిజమనే కొత్త రోగం పట్టుకుందని మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ లీడర్ దామోదర రాజనర్సింహ తాజాగా అసంతృప్తి స్వరం వినిపించారు. తెలంగాణలో అధికారం దూరమయినప్పటి నుండి కాంగ్రెస్లో కోవర్టిజం కొనసాగుతోందన్నారు. సిద్దిపేట జిల్లాలో కోవర్టులకే పదవులు కట్టబెట్టారని ఆరోపించారు. కావాలనే కోవర్టులను ప్రోత్సహిస్తున్నారని..ఈ కల్చర్ పోవాలని డిమాండ్ చేశారు. కోవర్టులతో కాంగ్రెస్కు ఒరిగేదేమి లేదని చెప్పారు. అయితే దామోదర రాజనర్సింహ ఎవరి పేర్లనూ బయట పెట్టలేదు.సమయం వచ్చినప్పుడు కోవర్టుల పేర్లను బయటపెడతానని వెల్లడించారు.
కాంగ్రెస్‌లో ప్రక్షాళన జరగాలంటున్న దామోదర రాజనర్సింహ
కాంగ్రెస్లో ప్రక్షాళన జరగాలని దామోదర రాజనర్సింహ ఆకాంక్షించారు. పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత సీనియర్ లీడర్ గా తనపై ఉందన్నారు. రెండు, మూడు నెలల కిందట పార్టీలోకి వచ్చిన వారికి కాంగ్రెస్ గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. అలాంటి వారికి పదవులు ఇచ్చి..పార్టీకి ఎన్నో ఏళ్ల నుంచి సేవ చేస్తున్న వారిని విస్మరించారని మండిపడ్డారు. కాంగ్రెస్ పదవుల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, ముస్లింలకు చోటు కల్పించలేదన్నారు. పీసీసీ కమిటీల్లో అనర్హులకు పదవులు ఇచ్చారని మండిపడ్డారు. కోవర్టులు లేకుండా పీసీసీ కమిటీల లిస్ట్ ఎలా బయటకు వచ్చిందని ప్రశ్నించారు. తాను ఎవరికి వ్యతిరేకం కాదని దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. తాను 58 ఏళ్లుగా కాంగ్రెస్ లో కొనసాగుతున్నానని చెప్పారు. ఒకే నియోజకవర్గంలోనే 50 ఏళ్లకు పైగా పని చేస్తున్నాని తెలిపారు. తాను అసలు సిసలైన కాంగ్రెస్ కార్యకర్తనని వెల్లడించారు. కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలను కార్యకర్తలు ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు. తాను హై కమాండ్ ను గౌరవిస్తానని చెప్పారు.
కమిటీల నియామకంతో పెరిగిపోయిన అసంతృప్తి స్వరాలు
కాంగ్రెస్ హైకమాండ్ మూడు రోజుల కిందట కమిటీల్ని ప్రకటించింది. కమిటిల్లో పేర్లున్నా.. వాళ్లకున్న సీనియార్టీకి సముచిత స్థానం దక్కలేదని కొందరు నాయకులు.. అసలు కమిటీల్లో స్థానమే దక్కలేదని మరికొందరు నేతలు అలకపాన్పులెక్కారు. ముందు నుంచి పార్టీనే నమ్ముకుని ఉన్న నాయకులకు కమిటీల కూర్పులో అన్యాయం జరిగిందంటూ.. సీనియర్ నాయకులు బాహటంగానే అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో ఇన్ని రోజుల నుంచి ఉన్నా.. గుర్తింపునిచ్చే పదవులు మాత్రం కొత్తగా వచ్చిన వాళ్లకు ఇచ్చారంటూ.. పాత నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లా నాయకురాలు కొండా సురేఖ తనకు కేటాయించిన టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌షిప్‌కు ఆదివారమే రాజీనామా చేశారు. ఇక ఈరోజు.. పీసీసీ అధికార ప్రతినిధి పదవికి బెల్లయ్య నాయక్ రాజీనామా చేశారు.
అందరూ బహిరంగ విమర్సలు - ఎవరికి వారే రాజకీయం
పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా బహిరంగంగానే అసంతృప్తి వెల్లగక్కారు. వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్లకు కూడా పదవులిచ్చి.. ఎప్పటి నుంచో పార్టీనే నమ్ముకుని ఉన్న తనలాంటి నిజాయితీ గల నాయకులకు మాత్రం అన్యాయం చేశారన్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత దక్కలేదు. మల్లు భట్టి విక్రమార్కను కలిసి కొంత మంది నేతలు మంతనాలు జరిపారు. పీసీసీకి.. సీఎల్పీకి మధ్య గ్యాప్ ఉందని భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వివాదం ఏ దశకు చేరుతుందనే ఆసక్తి రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది.