Vande Bharat Train : సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ రైలు, బీబీనగర్-నడికుడి మార్గాన్ని పరిశీలిస్తున్న అధికారులు!
Vande Bharat Train : సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ రైలు పరుగులు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధికారులు రూట్ పరిశీలన చేసినట్లు సమాచారం.
Vande Bharat Train : ఇండియన్ బుల్లెట్ ట్రైన్ వందే భారత్ రైలు సికింద్రాబాద్-తిరుపతి రూట్ ను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మధ్య పరుగులు పెడుతున్న వందే భారత్ రైలు ఇప్పుడు మరో మార్గంలో ప్రయాణించేందుకు సిద్ధమైంది. సికింద్రాబాద్ -తిరుపతి వందే భారత్ రైలును బీబీనగర్-నడికుడి మార్గంలో మిర్యాలగూడ మీదుగా నడపాలని రైల్వే అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ రైలును వరంగల్-ఖాజీపేట మార్గంలో నడపాలని రైల్వే అధికారులు భావించినప్పటికీ ఆ రూట్ లో దూరం ఎక్కువ అవుతుందనే కారణంతో బీబీనగర్-నడికుడి మార్గంలో నడపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. బీబీనగర్ నుంచి గుంటూరు వరకు ఉన్న రూట్ లో రైల్వే ట్రాక్ ను గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ఏర్పాటుచేసినట్లు అధికారులు తెలిపారు. ఈ మార్గంలో నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ తిరుపతికి చేరుకుంటుంది. నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ 664 కిలోమీటర్ల దూరాన్ని 12.30 గంటల సమయంలో చేరుకుంటుంది.
రైల్వే బోర్డు నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే
సికింద్రాబాద్ - తిరుపతి మధ్య సాధారణంగా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ మార్గంలో వందేభారత్ రైలును ప్రవేశపెడితే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో వందే భారత్ రైలుకు మరింత ఆదరణ పెరుగుతుందని అంటున్నారు. సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ రైలు వచ్చే అవకాశం ఉందని ఇటీవల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా చెప్పారు. రైల్వే బోర్డు నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే వందే భారత్ రైలును పరుగుపెట్టించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్-విశాఖ మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ నడుపుతున్నారు. ఈ రైలు అందుబాటులోకి వచ్చాక సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళ్లే ప్రయాణ సమయం భారీగా తగ్గింది. కేవలం 8.40 గంటల్లోనే ప్రయాణికులు విశాఖ చేరుకుంటున్నారు. త్వరలో సికింద్రాబాద్- తిరుపతి మధ్య వందే భారత్ పట్టాలు ఎక్కనుంది.
మూడు రూట్లు పరిశీలన
సికింద్రాబాద్-తిరుపతి మధ్య మొత్తం 3 ఆప్షన్స్ ను అధికారులు పరిశీలించారు. ఒకటి బీబీనగర్, నడికుడి, మిర్యాలగూడ మీదుగా, మరొకటి వరంగల్, ఖాజీపేట, కడప మీదుగా, ఇంకొకటి బీబీనగర్ నుంచి గుంటూరు, నెల్లూరు, గూడూరు మార్గాలను అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది. పిడుగురాళ్ల నుంచి శావల్యపురం మీదుగా ఒంగోల్, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట మార్గం కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. వీటంన్నిటిలో బీబీనగర్-నడికుడి రూట్ బెటర్ అని నిర్ణయించినట్లు తెలుస్తోంది. గంటకు 130 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో రైలు ప్రయాణించేలా ట్రాక్ ను అభివృద్ధి చేసిన అనంతరం అధికారిక ప్రకటన రానుంది. వందే భారత్ రైలు టికెట్ ధర రూ.1150 నుంచి మొదలవుతుంది. సికింద్రాబాద్- తిరుపతి మధ్య నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ ప్రయాణిస్తుంది. ఈ రైలు ప్రయాణ సమయం 12 గంటలు పడుతోంది. వందేభారత్ రైలు అందుబాటులోకి వస్తే 6 నుంచి 7 గంటల సమయం పడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ నెలాఖరులోపు వందే భారత్ రైలు అందుబాటులోకి రానుందని రైల్వే అధికారులు తెలిపారు.
శ్రీసిటీ నుంచి వందే భారత్ రైలు విడిభాగాలు
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీసిటీ మరో ఘనతను సొంతం చేసుకుంది. దేశంలో బాగా ప్రాచుర్యం పొందిన వందే భారత్ సెమీ హైస్పీడ్ రైలు విడి భాగాలను శ్రీసిటీలోని బీఎఫ్జీ అనే సంస్థ తయారు చేస్తోంది. బీఎఫ్జీ సంస్థ 2009వ సంవత్సరం నుంచి నిర్మాణ, రవాణా, పవన విద్యుత్ వంటి రంగాల్లోని పరిశ్రమలకు విడిభాగాలను అందిస్తోంది. మెట్రో కోచ్ ల తయారీ సంస్థలు అయిన బొంబార్డియర్, వోల్వో, ఆల్ స్తోమ్ తో పాటు ఇండియన్ రైల్వేస్, జనరల్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, కొచ్చిన్ షిప్ యార్డు, గమేశ, థెర్మాక్స్, ఎంసీఎఫ్, బెచ్ టెల్ వంటి వివిధ సంస్థలు దీని సేవలను అందుకుంటున్నాయి. సెమీ హైస్పీడ్ వందే భారత్ రైలులోని ఇంటీరియర్, టాయిలెట్ క్యాబిన్, ఇంజిన్ ముందు భాగాన్ని బీఎఫ్జీ సంస్థ తయారు చేసి అందిస్తోంది. ఒక్కో వందే భారత్ రైలు కోసం 329 రకాల ఫైబర్ రీ ఇన్ ఫోర్స్డ్ ప్లాస్టిక్ ప్యానెళ్లను తయారు చేసి ఇస్తోంది. ఆర్డరు ఇచ్చినప్పటి నుండి కేవలం 10 నెలల్లో బీఎఫ్జీ పూర్తి చేసింది. ప్రాజెక్టును ఆకర్షణీయంగా రూపొందించడానికి వివిధ రంగుల ప్యానెళ్లను ఈ కంపెనీ తయారు చేసింది.