RS Praveen Vs Sajjanar: సజ్జనార్‌పై చేసిన ఆరోపణలపై ఆర్ఎస్ ప్రవీణ్ యూటర్న్ - నోటీసులతోనే భయపడ్డారా?
RS Praveen: సిట్ చీఫ్ సజ్జనార్ ఇచ్చిన నోటీసులపై ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పత్రికల్లో వచ్చిన వాటిపైనే తాను స్పందించానన్నారు.

RS Praveen U turn on allegations against CP Sajjanar: ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణాధికారిగా ఉన్న సజ్జనార్‌పై తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పోలీసులు నోటీసులు జారీ చేయడంపై ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ స్పందించారు. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నేతలకు మద్దతుగా ప్రెస్ మీట్ పెట్టిన 12 గంటల వ్యవధిలోనే, అర్ధరాత్రి తన ఇంటికి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. కేటీఆర్, హరీష్ రావు వంటి నాయకులను విచారణ పేరిట వేధిస్తున్న తీరును ప్రశ్నించినందుకే ప్రభుత్వం తనపైకి పోలీసులను పంపిందని ఆయన ఆరోపించారు. బెదిరింపులకు తాను భయపడబోనని, తన వద్ద ఉన్న సమాచారంతోనే నోటీసులకు సమాధానం ఇస్తానని స్పష్టం చేశారు.
సజ్జనార్‌పై కేసులు ఉన్నాయని చెప్పలేదన్న ఆర్ఎస్ ప్రవీణ్
ప్రవీణ్ కుమార్ తన వివరణలో ప్రధానంగా నైతికత అంశాన్ని తెరపైకి తెచ్చారు. గతంలో ఓటుకు నోటు కేసు సమయంలో తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం ఆంధ్రప్రదేశ్ నేతల ఫోన్లను ట్యాప్ చేసిందంటూ 2015లో ఏపీలో పలు కేసులు నమోదయ్యాయని ఆయన గుర్తు చేశారు. ఆ సమయంలో సజ్జనార్ ఇంటెలిజెన్స్ విభాగంలో కీలక అధికారిగా ఉన్నందున, ఇప్పుడు అదే ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఏర్పాటైన సిట్‌కు ఆయన నేతృత్వం వహించడం నైతికంగా సరికాదని తాను అభిప్రాయపడినట్లు తెలిపారు. నోటీసులో పేర్కొన్నట్లుగా తాను సజ్జనార్‌పై కేసులు ఉన్నాయని అనలేదని, గతంలోని కేసుల కారణంగా ఆయన విచారణాధికారిగా ఉండటాన్ని మాత్రమే ప్రశ్నించానని సమర్థించుకున్నారు.
సజ్జనార్‌పై వ్యక్తిత్వ హననానికి పాల్పడలేదన్న ప్రవీణ్
ఫోన్ ట్యాపింగ్ అనేది దేశ రక్షణ , వ్యవస్థీకృత నేరాల నియంత్రణ కోసం చట్టబద్ధంగా జరిగే ప్రక్రియ అని, దీనిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ప్రవీణ్ కుమార్ వాదించారు. గతంలో యూపీఏ ప్రభుత్వం, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గతంలో ట్యాపింగ్ గురించి చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. కేవలం రాజకీయ ప్రతీకారంతోనే బీఆర్ఎస్ నేతలను ఇబ్బంది పెడుతున్నారని, ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యలపై గొంతెత్తడం తన రాజ్యాంగబద్ధమైన హక్కు అని ఆయన ఉద్ఘాటించారు. తన వ్యాఖ్యలు ఏ అధికారి లేదా రాజకీయ నాయకుడి వ్యక్తిత్వ హననానికి ఉద్దేశించినవి కావని ఆయన క్లారిటీ ఇచ్చారు.
నేను వ్యక్తిగత దూషణలు చేయను-చిల్లర భాషను వాడను - వాస్తవాలు దాచను - దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటం ఆపను.
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) January 24, 2026
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లో మా @BRSparty సీనియర్ నాయకులు @KTRBRS @BRSHarish గార్లకు ఆ వ్యవహారంలో సంబంధం లేకున్నా నోటీసులు ఇచ్చి @CPHydCity @SajjanarVC గారి నేతృత్వంలో…
ప్రవీణ్‌కు రెండు రోజుల గడువిచ్చినపోలీసులు
బహిరంగంగా సజ్జనార్‌పై తీవ్ర విమర్శలు చేసి, తీరా నోటీసులు అందగానే తాను అలా అనలేదు అని వివరణ ఇచ్చుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సజ్జనార్ ఇచ్చిన రెండు రోజుల గడువులోగా ప్రవీణ్ కుమార్ సమర్పించే సమాచారం ఏ విధంగా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఆ సమాచారం పోలీసులను సంతృప్తి పరచకపోతే, ఆయనపై సివిల్ , క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పరిణామాలతో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఇప్పుడు అధికారులకు మరియు రాజకీయ నేతలకు మధ్య సవాలుగా మారింది.
Before You Go
IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
ట్రెండింగ్ వార్తలు





















