RSP IN BSP Live Updates: బీఎస్పీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
LIVE
Background
ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇటీవలే పదవీ విరమణ చేశారు. కాసేపట్లో ఆయన బహుజన్ సమాజ్ పార్టీలో చేరనున్నారు. నల్గొండలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. రాజ్యాధికార సంకల్ప సభ పేరిట జరగనున్న కార్యక్రమానికి బీఎస్పీ రాజ్యసభ సభ్యుడు రాంజీ గౌతమ్ హాజరవనున్నట్లు తెలుస్తోంది.
బీఎస్పీలోకి ఆర్ఎస్పీ
పదవీ విరమణ చేసిన ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్.. రాజకీయాల్లోకి ప్రవేశించారు. బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) కండువా కప్పుకొన్నారు. నల్గొండ ఎన్‌జీ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన 'రాజ్యాధికార సంకల్ప సభ'లో బీఎస్పీలో చేరారు. ఐపీఎస్‌కు రాజీనామా అనంతరం.. పూలే, అంబేడ్కర్, కాన్షీరాం బాటలోనే పోరాటం చేస్తానని ఆయన ఇదివరకే స్పష్టం చేశారు.
మర్రిగూడ బైపాస్ నుంచి సభా వేదిక వరకు ప్రవీణ్‌కుమార్.. ర్యాలీగా వచ్చారు. మర్రిగూడ బైపాస్ వద్ద అంబేడ్కర్, జగ్జీవన్ విగ్రహాలకు నివాళులు అర్పించారు. మహిళల కోలాటాలు, డప్పు చప్పుళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందులో స్వేరోస్ ప్రతినిధులు, బీఎస్పీ కార్యకర్తలు పాల్గొన్నారు.
నా సుఖల కోసం ప్రజలను మోసం చేయను: ప్రవీణ్ కుమార్
రాజ్యాధికారం వస్తే తన సుఖాల కోసం ప్రజలను మోసం చేయనని ప్రవీణ్ కుమార్ గతంలోనే చెప్పారు. తనకు ఒక బెడ్ రూమ్,బాత్ రూమ్ ఉంటే చాలునని... ప్రజలు నాకన్నా గొప్పగా జీవించేలా చూడటమే తన లక్ష్యమని అన్నారు. అన్ని రంగాల్లో వారికి గొప్ప అవకాశాలు కల్పిస్తామన్నారు. బహుజనులను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్నారని.. బహుజన వాదంతో వారందరినీ రాజ్యాధికారం వైపు నడిపిస్తామని ప్రవీణ్ కుమార్ తెలిపారు. తన వెంట లక్షలాది మంది బహుజన బిడ్డలు ఉన్నారని పేర్కొన్నారు.
ర్యాలీగా సభా వేదికకు
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సూర్యాపేట, నకిరేకల్, నార్కట్ పల్లి సహా వివిధ ప్రాంతాలు పర్యటించి రాజకీయ కార్యాచరణను ప్రవీణ్ కుమార్ ప్రాథమికంగా ప్రకటించారు. స్వైరో కార్యకర్తలు పది రోజులుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పల్లెపల్లెన తిరుగుతూ నల్గొండ సభకు జనసమీకరణ చేపట్టారు. మెుదట నల్గొండలో ఐదు కిలోమీటర్ల పరుగు నిర్వహించనున్నారు. అనంతరం మర్రిగూడ బైపాస్ నుంచి సభా వేదిక వరకు ర్యాలీ చేపడతారు.