Kavitha కవితకు ఇంటి భోజనానికి అనుమతి - మరిన్ని వెసులుబాట్లు కల్పిస్తూ న్యాయస్థానం కీలక ఆదేశాలు
Telangana News: ఢిల్లీ లిక్కర్ కేసులో తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కల్పించాల్సిన వసతులపై రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేసింది.
Court Allows Kavitha To Take Home Meal: ఢిల్లీ లిక్కర్ కేసులో (Delhi Liquor Case) తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kavitha) ఇంటి భోజనం సహా అవసరమైన వసతులు కల్పించాలని రౌస్ అవెన్యూ కోర్టు సోమవారం మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. మార్చి 26న కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో ఏ ఒక్కటీ అనుమతించలేదని కవిత తరఫు న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఇంటి నుంచి ఆహారం, జపమాల, పుస్తకాలు, పెన్నులు, ఇతర వస్తువులతో పాటు మెడిటేషన్ చేసుకునేందుకు కోర్టు అనుమతించింది. అలాగే, పరుపు, దుప్పట్లు తెచ్చుకునేందుకు, ఆభరణాలు ధరించేందుకు, లేసులు లేని బూట్లకు అనుమతించాలని ఆదేశించింది. అవి అమలు కావడం లేదని.. కవిత న్యాయవాదులు కోర్టుకు తెలపగా.. కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్న అన్నింటినీ అనుమతిస్తున్నట్లు జైలు సూపరింటెండెంట్ న్యాయస్థానానికి తెలిపారు. దీనిపై స్పందించిన కోర్టు.. మరోసారి జైలు అధికారులకు లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేసింది.
బెయిల్ పిటిషన్ పై
మరోవైపు, ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని దాఖలు చేసిన కవిత పిటిషన్ పై విచారణను కోర్టు ఏప్రిల్ 4కి వాయిదా వేసింది. ఆ రోజు మధ్యాహ్నం 2:30కి రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది. సుదీర్ఘ వాదనలు, ఈడీ రిప్లై రిజాయిన్డర్ కు అభిషేక్ మను సింఘ్వి మరింత సమయం కోరారు. దాంతో కవిత తరఫు న్యాయవాదులు ఏప్రిల్ 3న సాయంత్రానికి రిజాయిన్డర్ దాఖలు చేస్తామని తెలిపారు. కాగా, తన కుమారుడికి పరీక్షలు ఉన్నాయని తనకు ఈ నెల 16 వరకు బెయిల్ మంజూరు చేయాలని కవిత మార్చి 26న రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. ఆమె దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై సమాధానం చెప్పాలని ఈడీకి కోర్టు నోటీసులు జారీ చేసింది. మార్చి 15న హైదరాబాద్‌లోని తన నివాసంలో ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు విచారణ చేపట్టిన అనంతరం కవితను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకు తరలించారు. మరుసటి రోజు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా.. ఈడీ 10 రోజుల కస్టడీకి కోరగా 7 రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. మార్చి 23న ఈడీ కస్టడీ ముగియడంతో అధికారులు మరో 5 రోజుల కస్టడీకి కోరగా.. 3 రోజుల కస్టడీకి ఇచ్చింది కోర్టు. దాంతో మార్చి 26న అధికారులు కోర్టులో హాజరు పరచగా కవితకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించగా తీహార్ జైలుకు తరలించారు.
Also Read: Warangal Congress MP Candidate: వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య, అధిష్టానం కీలక ప్రకటన