Dalit Bandhu Vs Dalit Dandora : బంధు వర్సెస్ దండోరా ! కేసీఆర్ - రేవంత్.. ఆ వర్గాల్లో ఎవరు చాంపియన్లు అవుతారు..?
దళిత బంధు పథకం ద్వారా ఆ వర్గాలను ఆకట్టుకోవాలని సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా దళిత, గిరిజన దండోరాలు నిర్వహించి వారిని కాంగ్రెస్‌వైపే ఉంచుకోవాలని రేవంత్ ప్రయత్నిస్తున్నారు.
తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది. హుజూరాబాద్ ఉపఎన్నిక కళ్ల ముందు కనిపిస్తోంది కానీ అందరి టార్గెట్ 2023లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలే. ఆ ఎన్నికలే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలో అందరి దృష్టి దళిత గిరిజనులపై పడింది. తెలంగాణ అధికార పార్టీ అధినేతగా కేసీఆర్ దళితులను పూర్తి స్థాయిలో ఆకట్టుకునేందుకు పెద్ద పెద్ద ప్రణాళికలు అమలు చేస్తున్నారు. దళితులతో పాటు గిరిజన వర్గాలనూ తమ వైపు తిప్పుకునేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పోరాటం ప్రారంభించంది. సీఎం కేసీఆర్ దళిత బంధు పేరుతో హంగామా చేస్తూండగానే... దళిత, గిరిజన దండోరా పేరుతో కాంగ్రెస్ రోడ్డెక్కుతోంది.
18శాతం దళిత ఓటు బ్యాంక్‌ను "బంధువు"గా చేసుకునేందుకు కేసీఆర్ మాస్టర్ ప్లాన్..!
రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పేరు తెచ్చుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవలి కాలం వరకూ బయట కనిపించేది తక్కువ. అయితే ప్రగతి భవన్.. లేకపోతే ఫాంహౌస్ అన్నట్లుగా ఆయన షెడ్యూల్ ఉండేది. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. దాదాపుగా ప్రతీ రోజూ ఆయన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వారానికో సారి ప్రజల్లోకి వెళ్తున్నారు. జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. అంతకు మించి "దళిత బంధు" లాంటి పథకాలు ఆవిష్కరించేశారు. ఆయన ఇలా యాక్టివ్ కావడానికి హుజూరాబాద్ ఉపఎన్నిక కారణమని కొంత మంది విశ్లేషిస్తూంటారు. కారణం ఏదైనా రాజకీయంగా తెలంగాణలో వచ్చిన కదలికలకు కేసీఆర్ బిజీ షెడ్యూల్‌ను ఓ సాక్ష్యంగా చెప్పుకోవచ్చు.
ఇప్పుడు కేసీఆర్ ఒకటే మంత్రం జపిస్తున్నారు. అదే దళిత మంత్రం. ఒక్కో దళిత కుటుంబానికి రూ. పది లక్షలు పంచేలా "దళిత బంధు" ప్రకటించేశారు. తన దత్తత గ్రామం వాసాలమర్రి నుంచి ప్రారంభించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని 90 శాతం దళిత కుటుంబాలకు రూ. పది లక్షల చొప్పున ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత రాష్ట్రం మొత్తం ఇస్తానని చెబుతున్నారు. రూ. లక్ష కోట్లయినా భరిస్తానని అంటున్నారు. అంత వెసులుబాటు ప్రభుత్వానికి ఉందా లేదా అన్నది తర్వాత సంగతి కానీ.. కేసీఆర్ మాత్రం దళిత వర్గాలను ఏకపక్షంగా ఓటు బ్యాంక్‌గా మార్చుకునే ప్రయత్నాలు మాత్రం చేస్తున్నారని కళ్ల ముందు కనిపిస్తున్న సత్యం.
డబుల్ బెడ్ రూమ్ స్కీమ్ లాగే దళిత బంధూ వర్కవుట్ అయ్యేలా వ్యూహం..!
తెలంగాణలో దళిత ఓటర్లే గెలుపోటముల్ని నిర్దేశించగలిగే స్థితిలో ఉన్నారు. సమగ్ర కుటుంబసర్వే ప్రకారం.. తెలంగాణ జనాభాలో 18 శాతం దళితులు. వీరిని ఏకపక్షంగా ఓటు బ్యాంక్‌గా మార్చుకుంటే విజయం సునాయాసం. వరుసగా మూడోసారి గెలవాలనుకుంటున్న కేసీఆర్ దళిత వర్గంపై అందుకే గురి పెట్టారు. "దళిత బంధు" పాచికతో రంగంలోకి దిగారు. ఆయన నిజంగా ఒక్కో కుటుంబానికి రూ. పది లక్షలు ఇవ్వగలరా లేదా అన్నది తర్వాత విషయం. కానీ ఆ వర్గంలో ఓ ఆశ.. ఓ నమ్మకాన్ని కలిగిస్తే చాలు ఓట్ల వర్షమే కురుస్తుంది. 2015 గ్రేటర్ ఎన్నికల్లో సనత్ నగర్ నియోజకవర్గంలో పది అంటే పది డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించి.. వాటినే చూపించి ఆ ఎన్నికలను స్వీప్ చేశారు. కానీ ఇప్పటికీ ఆ డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎంత మందికి ఇచ్చారో తెలియదు. కానీ ఆ విజయం ఊపు మాత్రం కొనసాగుతోంది. అలాగే దళిత బంధు పథకం కూడా రాజకీయంగా లాభం కలిగేలా కేసీఆర్ డిజైన్ చేసుకున్నారు.
కేసీఆర్ వ్యూహాలకు చెక్ పెట్టేలా రేవంత్ దండోరా వ్యూహం..!
కేసీఆర్ వ్యూహాలను పక్కాగా అంచనా వేయడంలో ఆరితేరిపోయిన నేత తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి... దళిత బంధు పథకాన్ని కేవలం హుజూరాబాద్ కోసమే పెట్టలేదని.. 2023 ఎన్నికలను టార్గెట్ చేశారని అంచనా వేస్తున్నారు. రేవంత్ అంచనా ప్రకారం.. హుజూరాబాద్‌లో దళిత బంధును అమలు చేసి.. ఆ తర్వాత కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారు. అంటే 2022లోనే కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వెళతారు. ఈ విషయాన్ని రేవంత్ మీడియాతో చెప్పారు. కావాలంటే రాసి పెట్టుకోవాలని చాలెంజ్ కూడా చేశారు. అందుకే రేవంత్ కూడా కేసీఆర్ వ్యూహాలకు ధీటుగా దళితులతో పాటు గిరిజనులను కూడా కలుపుకుని కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. దళిత గిరిజన దండోరాకు ప్రణాళిక సిద్ధం చేశారు. 18 శాతం దళితుల ఓట్లకు తోడు.. దాదాపుగా ఎనిమది శాతం వరకూ ఉండే గిరిజనుల ఓట్లను రేవంత్ ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వం వారికి చేసిన అన్యాయాలను వివరించి... దళిత బంధు పేరుతో మభ్య పెడుతున్నారని చెప్పనున్నారు. దళిత గిరిజన దండోరాను అందుకే రూపొందించారు. ఇది ఒక్క ఇంద్రవెల్లి సభతోనే అయిపోదు. వరుసగా నిర్వహిస్తారు. వరంగల్‌లో నిర్వహించబోయే దళిత, గిరిజన దండోరా సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించాలని నిర్ణయించారు. కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై దూకుడుగా వెళ్తే... గెలుపోటముల్ని నిర్ణయించే వర్గాల కోసం టగ్ ఆఫ్ వార్ ప్రారంభమైనట్లే అనుకోవాలి.
ఎవరు దళిత , గిరిజన చాంపియన్లు అవుతారో.. వారిదే తర్వాత అధికారం..!
తెలంగాణ ప్రజల ముందు ఇప్పుడు రెండు ఆప్షన్లు ఉంటాయి. ఒకటి దళిత బంధు లేదా.. దళిత, గిరిజన దండోరా. ప్రభుత్వం పథకం అమలు చేస్తుందని నమ్మేవారంతా బళిత బంధు కిందకు వెళ్తారు. లేదు ఇప్పటి వరకూ కేసీఆర్ మాటలే చెప్పారు.. ఇక ముందూ అవే చెబుతారు.. పైగా దక్కాల్సిన ప్రయోజనాలు దక్కలేదనుకున్న వాళ్లు దళిత, గిరిజన దండోరా వైపు వస్తారు. ఎవరు ఎక్కువ మందిని ఆకట్టుకుంటారో వారికే అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే దళిత బంధు వర్సెస్ దళిత, గిరిజిన దండోరా పోరాటం.. వచ్చే ఎన్నికల వరకూ సాగుతుందన్నమాట.