Revanth Reddy: కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి లేఖ, దశాబ్ది ఉత్సవాలకు ఆహ్వానం - గులాబి అధినేత అంగీకరిస్తారా?
KCR News: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలకు హాజరు కావాలని మాజీ సీఎం కేసీఆర్‌ను సీఎం ఆహ్వానించారు.
Telangana Formation Day: జూన్ 2న జరగబోయే తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు హాజరు కావాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొనాలని రేవంత్ రెడ్డి కేసీఆర్ ను కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి రాష్ట్ర అవతరణ దినోత్సవం ఇదే కావడంతో పాటు ఈసారి జూన్ 2 నాటికి తెలంగాణ వచ్చి పదేళ్లు నిండుతాయి. ఈ సందర్భంగా రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది.
కొత్తగా రూపొందించిన తెలంగాణ రాష్ట్ర గీతాన్ని కూడా జూన్ 2న ఆవిష్కరించబోతున్నారు. ఇలాంటి సందర్భంలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తూ లేఖ పంపారు. ప్రస్తుతం గజ్వేల్ లో ఉన్న కేసీఆర్ కు ఆ లేఖను ప్రొటోకాల్ అడ్వైజర్ హరకర వేణుగోపాల్, డైరెక్టర్ అరవివంద్ సింగ్ ఈ లేఖను చేరవేసినట్లుగా చెబుతున్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి హాజరు కావాలని రేవంత్ రెడ్డి ఆహ్వానం పంపినప్పటికీ కేసీఆర్ దీన్ని ఏ మేరకు అంగీకరస్తారన్న ఆసక్తి నెలకొంది.
గతేడాది డిసెంబరులో తెలంగాణ అసెంబ్లీ ఏర్పడ్డ అనంతరం జరిగిన మొదటి అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ హాజరు కాని సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి హోదాలో ఫేస్ చేయడం ఇష్టం లేకనే కేసీఆర్.. అప్పుడు సమావేశాలకు రాలేదని పలువురు చెబుతుంటారు. అలాంటిది రాబోయే తెలంగాణ అవతరణ వేడుకలకు ఒకే వేదికను పంచుకునేందుకు కేసీఆర్ అసలు అంగీకరించే అవకాశమే లేదని విశ్లేషణలు వస్తున్నాయి.