Revanth Reddy: ఖమ్మం సభ నుంచే బీఆర్ఎస్‌కి సమాధి కడతాం - రేవంత్ రెడ్డి
ఖమ్మం జిల్లా తల్లంపాడు వద్ద పాదయాత్ర శిబిరంలో భట్టి విక్రమార్కతో శుక్రవారం రేవంత్ భేటీ అయ్యారు. సభ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఖమ్మం జిల్లా వేదికగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావం పూరిస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం, స్థానిక మంత్రి ఎన్ని అడ్డంకులు పెట్టినా కాంగ్రెస్ సభను విజయవంతం చేయకుండా ఆపలేరని అన్నారు. ఖమ్మం సభ నుంచే బీఆర్ఎస్ ప్రభుత్వానికి సమాధి కడతామని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ జన గర్జన సభకు ఖమ్మం జిల్లా నుంచి వచ్చే స్పందన ఎలా ఉంటుందో మీరే చూడబోతారని రేవంత్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా తల్లంపాడు వద్ద పాదయాత్ర శిబిరంలో భట్టి విక్రమార్కతో శుక్రవారం రేవంత్ భేటీ అయ్యారు. సభ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సభ ఏర్పాట్లపై భట్టి సలహాలు, సూచనలు తీసుకున్నామని, జులై 2న జరిగే సభకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరవుతారని అన్నారు.
భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కాంగ్రెస్ పార్టీ కోసం కాదని, తెలంగాణ సమాజం కోసమని రేవంత్ అన్నారు. అభివృద్ధి పేరుతో సీఎం కేసీఆర్ ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నారని, ఈస్ట్‌మన్ కలర్‌లో చూపిస్తున్న భ్రమలను పాదయాత్ర ద్వారా భట్టి విక్రమార్క ప్రజల దృష్టికి తీసుకెళ్లారని అన్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో చూసిన సమస్యలు, వాటి పరిష్కారమే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోగా ఉంటుందని అన్నారు. జన గర్జనసభ ఏర్పాట్లపై సమీక్షించేందుకు అక్కడకు వచ్చినట్లు చెప్పారు.
ఖమ్మం సభ ఏర్పాట్లను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పక్కాగా చేస్తున్నారని అన్నారు. సభ కోసం పొంగులేటి ఆర్టీసీ బస్సులను అడిగితే, ఆర్టీసీ అధికారులు ముందు బస్సులను ఇస్తామని కూడా తర్వాత కుదరని చెప్పేశారని అన్నారు. ఇది ప్రభుత్వం పెట్టిన అడ్డంకి అని అన్నారు. బస్సులు ఇచ్చినా, ఇవ్వకపోయినా సొంత వాహనాల్లో సభకు రావాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఖమ్మం సభ విజయవంతం కాకుండా ఎవరూ అడ్డుకోలేరని.. బీఆర్ఎస్ ఆవిర్భావ సభను మించేలా కాంగ్రెస్ సభను పొంగులేటి నిర్వహిస్తారని అన్నారు. బీఆర్ఎస్ నేతలు సభలో ఎంత మంది వచ్చారో లెక్కపెట్టుకోవచ్చని అన్నారు.
ఖమ్మం జిల్లాకు భట్టి విక్రమార్క, రేణుక రెండు కళ్లని.. పొంగులేటి మూడో కన్ను అని రేవంత్ రెడ్డి అన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వ్యాపారులున్నాయి కాబట్టి బీజేపీలో చేరతారని అనుకున్నానని.. కానీ, అభిమానులు, అనుచరుల కోరిక మేరకు కాంగ్రెస్ లో చేరుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నారనే కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి కదిలారని అన్నారు.