Revant Reddy : కేసీఆర్ గుడ్‌విల్ సున్నా- కాంగ్రెస్‌కు చాన్సివ్వాలన్నది ప్రజల నిర్ణయం - రేవంత్ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌కు ఓ అవకాశం ఇవ్వాలని ప్రజలు నిర్ణయించుకున్నారని రేవంత్ రెడ్డి నమ్మకం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో మీట్ ది ప్రెస్‌లో ఆయన పాల్గొన్నారు.
Revant Reddy : పదేళ్లలో కేసీఆర్ గుడ్ విల్ సున్నా అని.. . కాంగ్రెస్‌కు ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలు భావిస్తున్నారని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యనించారు. హైదరాబాద్‌లో జర్నలిస్టులు ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొని జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
బీఆర్ఎస్ కూటమి, కాంగ్రెస్ కూటమి మధ్యే ఎన్నికలు
బీఆర్‌ఎస్ కూటమి, కాంగ్రెస్ కూటమి మధ్యే ఎన్నికలు జరుగుతున్నాయని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ , ఎంఐఎం , బీఆర్‌ఎస్ ఒకే కూటమి అని రేవంత్ స్పష్టం చేశారు. వందశాతం ప్రజలు ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించి తీరతారని.. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు.ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చూసి ప్రజలే భయపడేలా భారాస పాలన ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ పాలన ఎలా ఉందో యువత, రైతులు, మహిళలు అడిగితే బాగా చెబుతారన్నారు.
రాష్ట్ర చిహ్నంలో మార్పు
రాష్ట్ర చిహ్నంలోనే రాచరిక పోకడల గుర్తులు కనిపిస్తున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర చిహ్నంలో ప్రజల త్యాగాల గుర్తులు ఉండాలన్నారు. రాష్ట్ర అధికారిక చిహ్నంలో పోరాటాల స్ఫూర్తి కనిపించడం లేదని రేవంత్ ఆరోపించారు. తెలంగాణ కోసం ఎందరో యువకులు ప్రాణత్యాగం చేశారన్న ఆయన ఈ పదేళ్లలో కెసిఆర్ ఏం చెప్పారు.. ఏం జరిగిందో ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు. పేదల సంక్షేమం కోసం నిధులు ఉపయోగపడ్డాయా ప్రజలు ఆలోచించాలని రేవంత్ ప్రజలను కోరారు. స్వరాష్ట్రంలో ఎన్నో మార్పులు వస్తాయని ఆశించిన యువత ఆకాంక్షలు అడియాశలు అయ్యాయని రేవంత్ విమర్శించారు. పరీక్షల నిర్వహణలో టీఎస్‌పీఎస్సీ విఫలమైందని ఆరోపించారు. కేసీఆర్ ఇచ్చిన పాత హామీలనే అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారన్నారు. తెలంగాణ కోసం ఎందరో యువకులు ప్రాణత్యాగం చేశారని.. రాష్ట్ర చిహ్నంలో ప్రజల త్యాగాల గుర్తులు ఉండాలన్నారు.
కాంగ్రెస్ దశాబ్ద పాలన - బీఆర్‌ఎస్ దశాబ్ద పాలనపై చర్చకు సిద్ధం
కాంగ్రెస్ దశాబ్ద పాలన - బీఆర్‌ఎస్ దశాబ్ద పాలనపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ‘‘మా పార్టీ నుంచి నేను, సీఎల్పీ భట్టి వస్తాం... మిగతా పార్టీల నుంచి ఇద్దరు చొప్పున రండి. చర్చ పెడితే పాలకు పాలు, నీళ్లకు నీళ్లు బయట పడతాయన్నారు. హైదరాబాద్‌లో ఐటీకి పునాది వేసింది కాంగ్రెస్. హైదరాబాద్‌ను పెట్టుబడి నగరంగా తీర్చిదిద్దుతాం. గంగా నదిలా మూసీని ప్రక్షాళన చేస్తాం. మూసీ రివర్ ఫ్రంట్‌ను అద్భుతంగా అభివృద్ధి చేసే ప్రణాళిక మా దగ్గర ఉంది. అర్బన్, రూరల్ హైదరాబాద్‌కు కనెక్టివిటీ ఇవ్వనున్నామన్నారు. రాచకొండ గుట్టలను తెలంగాణ ఊటీలా అభివృద్ధి చేస్తాం. హైదరాబాద్‌ను ప్రపంచానికే తలమానికంగా మారుస్తామని హామీ ఇచ్చారు.
కాళేశ్వరంకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి !
పిల్లర్లు కుంగాయి కాబట్టే మేడిగడ్డ బ్యారేజీ జాయింట్‌లో గ్యాప్ పెరిగిందన్నారు. ఒక మీటరు కుంగిందని అధికారులే చెబుతున్నారని.. తప్పించుకోవడానికే కేటీఆర్ ఏవేవో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాము తప్పు చెబుతున్నామంటే.. అఖిలపక్షాన్ని తీసుకెళదామని.. ప్రాజెక్టు కుంగిందో లేదో వాళ్లే చెబుతారని అన్నారు. బీఆర్‌ఎస్ నేతలవి లాజిక్ లేని వాదనలని విమర్శించారు.సంక్షేమాన్ని తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు. పెన్షన్లు, పక్కా ఇళ్లు లాంటి పథకాలు తీసుకొచ్చింది కాంగ్రెస్ అన్నారు. కేసీఆర్ తాను చేసింది చెప్పుకోలేక కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు తనను కందిపప్పు అని కేటీఆర్ అంటున్నారని.. తాను కందిపప్పునేనని ఆరోగ్యానికి మంచిదన్నారు. కానీ కేటీఆర్ గన్నేరు పప్పు లాంటివారు.. తింటే చస్తారు. ఆరోగ్యం బాగుండాలంటే కందిపప్పు, ముద్దపప్పును తీసుకోండి.. గన్నేరు పప్పును కాదు అని సెటైర్ వేశారు.
కమ్యూనిస్టులతో పొత్తుల చర్చలు
కమ్యూనిస్టులతో పొత్తుల అంశం ఇంకా ముగియలేదని రేవంత్ అన్నారు. పొత్తు అంశంపై తమ సమన్వయ కమిటీ చర్చలు జరుపుతోందన్నారు. ధరణి పోర్టల్ పేరుతో ప్రభుత్వమే పెద్ద దళారీగా మారిందని ఆరోపించారు. ధరణిలో అత్యంత పెద్ద దళారులు కేసీఆర్ కుటుంబసభ్యులే అని.. తాము ధరణిని రద్దు చేస్తామంటే కేసీఆర్‌కు ఎందుకంత దుఃఖం అంటూ రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. చుక్క మందు, డబ్బు లేకుండా వెళదామని అధికార బీఆర్ఎస్ పార్టీతో సహా ఇతర పార్టీలను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కరసవాల్ చేశారు.