PM Modi Tour : రామగుండంలో ప్రధాని మోదీ పర్యటనను అడ్డుకుంటాం- కార్మిక సంఘాల జేఏసీ
PM Modi Tour : రామగుండంలో ప్రధాని మోదీ పర్యటనను అడ్డుకుంటామని సింగరేణి కార్మిక సంఘాలు నిరసనలకు పిలుపునిచ్చాయి.
PM Modi Tour : పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేసేందుకు ఈనెల 12న ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. పెద్దపల్లి జిల్లాలోని సింగరేణి గనులున్న ప్రాంతాల్లో నరేంద్ర మోదీ 'గో బ్యాక్' అంటూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వామపక్ష పార్టీలతో పాటు సింగరేణి కార్మిక సంఘాల నేతలు, కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనలకు పూనుకున్నారు. ఇదే క్రమంలో గురువారం రామగుండం సింగరేణి సంస్థలోని అన్ని బొగ్గు గనులలో జాతీయ కార్మిక సంఘాల జేఏసీతో పాటు సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం (తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం) సైతం మోదీ గో బ్యాక్... అంటూ నల్ల బ్యాడ్జీలతో నిరసనలు చేపట్టారు.
కార్మిక వ్యతిరేక విధానాలు
కార్మిక నాయకులు మాట్లాడుతూ... దేశంలో బొగ్గు బ్లాక్ లను ప్రైవేటీకరణ చేయడంతో పాటు నల్ల చట్టాలను తెస్తున్న ప్రధాని మోదీ పర్యటనను వ్యతిరేకిస్తున్నామన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్మిక లోకానికి ప్రధాని అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ కార్మికుల సంఖ్య తగ్గిస్తున్నాడని ఆరోపించారు. అసంఘటిక కార్మికుల జీవనోపాధిని హరిస్తున్న ప్రదాని పర్యటన అడ్డుకుంటామని నాయకులు ధ్వజమెత్తారు. సింగరేణికి ముఖ్యమైన నాలుగు బొగ్గు గనులు కేంద్రం ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధమైందన్నారు. సింగరేణి మనుగడ ఉండాలని ఈ నాలుగు బొగ్గు గనులను కాపాడుకోవాలన్నారు. వాటిని కాపాడుకోవడానికి కార్మికులు ఆందోళనకు పిలుపునిచ్చారన్నారు.
ఆ గనులు అప్పగిస్తారా?
"మోదీ అంటే కార్మిక వ్యతిరేక విధానాలకు నిదర్శనం. దేశ వ్యాప్తంగా 44 కార్మిక చట్టాలను 4 కోడ్ లుగా కుదించారు. పబ్లిక్ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారు. నరేంద్ర మోదీని ఒక్కటే అడుగుతున్నాం. మా సింగరేణి గనులను మాకు అప్పగిస్తారా? మరి ఎందుకు గోదావరిఖని పట్టణానికి వస్తున్నారు. మోదీ తన పర్యటనలో గనులపై ప్రకటన చేస్తారా?" కెంగర్ల మల్లయ్య, కార్మిక నేత
ప్రొటోకాల్ వివాదం
ప్రధానమంత్రి నరేంద్రమోడీ 12వ తేదీన తెలంగాణలో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ పాల్గొనాల్సి ఉంది. అయితే ప్రోటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించలేదని టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వ వర్గాలు .. ఈ ఆరోపణల్ని ఖండించాయి. రామగుండం ప్లాంట్ సీఈవో స్వయంగా కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ పంపిన ఆహ్వాన లేఖను సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీకి అందించారన్నారు. ఈ లేఖను మీడియాకు కూడా విడుదల చేశారు.
ప్రోటోకాల్ వివాదాన్ని లేవనెత్తిన టీఆర్ఎస్
ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 12న తెలంగాణలో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ హాజరయ్యే ఈ ఈవెంట్ కోసం పంపిన ఆహ్వానంలో కేంద్ర ప్రభుత్వం కనీస ప్రొటోకాల్‌ను పాటించలేదని టీఆర్ఎస్ ఆరోపించింది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణలో అధికారిక భాగస్వామిగా ఉన్న తెలంగాణ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రజలను కేంద్రం అవమానించిందని తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రొటోకాల్ ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ పేరు తర్వాత అతిథిగా తెలంగాణ సీఎం కేసీఆర్ పేరును చేర్చలేదని టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామిగా ఉన్న ఫ్యాక్టరీ ఈవెంట్లో సీఎంకు నామమాత్రంగా ఆహ్వానం పంపి కేంద్ర ప్రభుత్వం చేతులు దులిపేసుకుందని తమ ట్వీట్లో పేర్కొన్నారు.