Double Bed Room Houses: విమర్శలు చేయడం సులభం, పనులు చేయడమే కష్టం : మంత్రి కేటీఆర్
Double Bed Room Houses: విమర్శలు చేయడం సులభమేనని, పనులు చేయడం కష్టమని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో రెండు పడక గదుల ఇళ్లు నిర్మించామని ఆయన అన్నారు.
Double Bed Room Houses: రాజన్న సిరిసిల్ల(Rajanna Sirisilla) జిల్లా ఎల్లారెడ్డి పేట మండలంలోని వెంకటాపుర్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి కేటీఆర్(KTR) శనివారం ప్రారంభించారు. 40 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ లు పంపిణీ చేసిన మంత్రి కేటీఆర్, లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. డబుల్ బెడ్ రూమ్(Double Bed Room) ఇళ్లను పారదర్శకంగా కేటాయించిన అధికారులను మంత్రి అభినందించారు. గ్రామంలో మరో 40 మంది ఇల్లులేని వారిని గుర్తించి పట్టాలు ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. సొంత ఇంటి స్థలం ఉన్నవారికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించి ఇస్తామని వెల్లడించారు.
ప్రతీ గ్రామానికి రూ. 5 కోట్ల నిధులు
గ్రామంలో అన్ని సంఘాల భవనాలు త్వరలోనే పూర్తి అవుతాయని, కొన్నింటికి ఇప్పటికే మంజూరు చేశామని మంత్రి కేటీఆర్ అన్నారు. గ్రామాలలో 20 లక్షలతో కేసీఆర్ భవన్(KCR Bhavan) లు ఏర్పాటుచేశామని తెలిపారు. తెలంగాణ రాకముందు గ్రామానికి రూ.50 లక్షలు రావడమే కష్టంగా ఉండేదని, కానీ ఇప్పుడు ఒక్కో గ్రామానికి రూ.5 కోట్లు పైనే నిధులు అందుతున్నాయన్నారు. భారతదేశంలో ఎక్కడా పేదలకు ఇటువంటి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు లేవన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై విమర్శలు చేస్తున్న వారు దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఇలాంటి అభివృద్ధి పనులు చూపించాలని సవాల్ చేశారు.
'మాపై విమర్శలు చేసేటోళ్లు గతంలో ఏమి చేసిండ్రు చెప్పమనండి. నేను రాను బిడ్డో దవాఖానకు అని పాడుకున్న ఆడబిడ్డలు నేడు హాస్పిటల్స్ లో అత్యున్నత వైద్యంతో పాటు కేసీఆర్ కిట్ అందుకుంటున్నారు. సిరిసిల్ల రూపు మార్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుంది. రాష్ట్రంలో గూడు లేని పేదలకు గూడు కల్పిస్తున్న నేత మన కేసీఆర్' అని మంత్రి కేటీఆర్ అన్నారు.
విమర్శలు చేయడం సులభం
తెలంగాణలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నా విమర్శలు చేస్తున్నవారికి కనిపించడం లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. విమర్శలు చేయడం సులభమేనని, పనులు చేయడం కష్టమన్నారు. రాష్ట్రంలో కోతల్లేని విద్యుత్(Electricity) ఉందని మంత్రి అన్నారు. వెంకటాపూర్ అభివృద్ధి బాటలో ముందుకెళ్తుందన్న కేటీఆర్ త్వరలోనే మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలలు ఏర్పాటుచేస్తామన్నారు. అర్హులైన అందరికి ఇళ్ల పట్టాలు అందిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.