Health Profile Telangana: దేశంలోనే తొలిసారిగా ములుగులో ఈ-హెల్త్ ప్రొఫైల్, ప్రారంభించిన హరీశ్ - దీంతో మనకి ఎన్ని లాభాలో!
E-Health Profile: ఒక గిరిజన జిల్లా అయిన ములుగులో దేశంలోనే తొలిసారిగా ఈ-హెల్త్ ప్రొఫైల్ ప్రారంభించడం అరుదైన గౌరవం, రికార్డు అని మంత్రి హరీశ్ రావు అన్నారు.
Warangal News: రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య సూచిలను రూపొందించి, వాటిని భద్రపరిచి, ప్రజల అనారోగ్య సమస్యలను వేగంగా, సురక్షితంగా పరిష్కరించేందుకు ఉద్దేశించిన ఈ - హెల్త్ ప్రొఫైల్ ప్రారంభమైంది. అత్యవసర సమయంలో ప్రాణాపాయ పరిస్థితిని నివారించేందుకు గానూ ప్రయోగాత్మకంగా ములుగు జిల్లాలో రాష్ట్ర మంత్రులు హరీష్ రావు (Harish Rao), ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ దీన్ని ప్రారంభించారు. దేశంలోనే ఒక గిరిజన జిల్లా ములుగులో (Mulugu) ఈ హెల్త్ ప్రొఫైల్ ప్రారంభించడం అరుదైన గౌరవం, రికార్డు అని మంత్రులు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ములుగు జిల్లాపై, గిరిజన పట్ల ఉన్న ప్రేమకు ఇది నిదర్శనం అని అన్నారు. ములుగు జిల్లాను మిగిలిన జిల్లాలతో సమానంగా కాకుండా.. కాస్త ఎక్కువగా చూస్తూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ అన్ని వసతులు కల్పించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని మంత్రులు తెలిపారు.
ఈ - హెల్త్ ప్రొఫైల్ ఆవిష్కరణ అనంతరం సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ‘‘ఈ హెల్త్ ప్రొఫైల్ ఆవిష్కరణ అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కార్యక్రమం. దేశంలో ఎక్కడా ఇది జరగలేదు. యూరప్ లో ఈ విధానం ఉంది. మన దేశంలో ములుగులో ప్రారంభించుకుంటున్నాం. ఆరోగ్య తెలంగాణను ఆవిష్కరించేందుకు సీఎం కేసీఆర్ (CM KCR) దీనిని చేపట్టారు. 40 రోజుల్లో దీనిని పూర్తి చేస్తాం. సిరిసిల్లలో కూడా 40 రోజుల్లో పూర్తి చేస్తాం. ఈ హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమంలో భాగంగా ఇక్కడి ప్రజలు అందరికీ డిజిటల్ హెల్త్ కార్డు ఇస్తాం. దీనివల్ల వారి ఆరోగ్య చరిత్ర మొత్తం తెలుస్తుంది. తద్వారా వారికి వేగంగా, మెరుగ్గా వైద్యం అందించవచ్చు. 42 కోట్లతో జిల్లా హాస్పిటల్ ఏర్పాటు చేస్తున్నాం. 60 లక్షల రూపాయలతో రేడియాలజీ ల్యాబ్ ప్రారంభించాం. రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు, జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమం పూర్తి చేయాలి.
ఇంటికి వెళ్ళి మందులు ఇచ్చే కార్యక్రమం కూడా ఈ హెల్త్ ప్రొఫైల్ లో ఉంది. 18 ఏళ్లు దాటిన వారు జిల్లాలో 2.60 లక్షల మంది ఉన్నారు. వచ్చే 40 రోజుల్లో వీరి అందరి హెల్త్ ప్రొఫైల్ పూర్తి చేస్తాం. ఇది దేశానికి ఆదర్శం. తలసేమియా వారికి కూడా ఇక్కడే వైద్యం అందించే వసతి కల్పించే పరిశీలన చేస్తాం. మెడికల్ కాలేజీ ఇవ్వడంపై త్వరలోనే సీఎం కేసీఆర్ నుంచి శుభవార్త వింటారు. నేను సీఎం కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తాను. కొత్తగా 250 పడకల హాస్పిటల్ పాత 100 పడకలు కల్పి 350 పడకల హాస్పిటల్ జిల్లాలో అందుబాటులోకి రానుంది.’’ అని మంత్రి అన్నారు.
అసలు హెల్త్ ప్రొఫైల్ (E Health Profile) ఎందుకు?
తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ అమలవుతున్న జిల్లాలో ప్రతి ఒక్కరి ఆధార్ నంబర్, అడ్రస్, షుగర్, బీపీ స్థాయిలు ఇదివరకు ఉన్న వ్యాధుల చరిత్ర, క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు వంటి నాన్-కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్‌సీడీలు) సహా కీలక సమాచారమంతా డిజిటల్‌గా సేకరిస్తారు. ఈ సేకరించిన డేటా ఆధారంగా రిస్క్-అసెస్‌మెంట్ ను డిసైడ్ చేస్తారు. అధిక-రిస్క్ వున్న వ్యక్తులను గుర్తించి వారికి అవసరమైన ఆరోగ్య సంరక్షణ సేవలు వీలైనంత త్వరగా అందేలా చూస్తారు. హెల్త్ ప్రొఫైల్ లో నమోదు చేసుకున్న వ్యక్తులు తెలంగాణలోని ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించినప్పుడు, ఆల్రెడీ వారికి సంబందించిన వైద్య రికార్డులు క్లౌడ్ స్టోరేజ్ లో ఉంటుంది కాబట్టి వైద్య సమస్యలను వేగంగా, సురక్షితంగా పరిష్కరించేందుకు, అవసరమైతే దాతలను అందుబాటులో ఉంచేందుకు కూడా ఈ - హెల్త్ ప్రొఫైల్ ఉపయోగపడుతుందన్నమాట.
తెలంగాణ ఆరోగ్యరంగ ముఖచిత్రాన్ని మార్చేందుకు, ఆరోగ్యతెలంగాణ కల సాకారం చేసేందుకు సీఎం శ్రీ కేసీఆర్ ఆలోచనతో రూపొందించిన తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్టును ములుగు జిల్లా కలెక్టరెట్ లో ప్రారంభించిన మంత్రి శ్రీ హరీష్ రావు గారు.. ఈసందర్భంగా ఇ-హెల్త్ కార్డులను పలువురికి అందజేశారు pic.twitter.com/ZxOq2xS512
— Office of Minister for Health, Telangana (@TelanganaHealth) March 5, 2022