Telangana Rains: తెలంగాణాకు పొంచి ఉన్న ముప్పు- అధికార యంత్రాంగం అప్రమత్తం
వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణ చిగురుటాకులా వణికిపోతోంది. మరో రెండు రోజులు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది.
వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణ చిగురుటాకులా వణికిపోతోంది. మరో రెండు రోజులు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సచివాలయం నుంచి బుధవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మరో 48 గంటలపాటు అత్యంత అప్రమత్తతతో ఉండాలని ఆదేశించారు. ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం లేకుండా విస్తృతస్థాయిలో చర్యలు తీసుకోవాలని సూచించారు.
గోదావరి పరీవాహక ప్రాంతంలో పలు ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, కాలువలు పూర్తిస్థాయి నీటి మట్టంతో ప్రవహిస్తున్నాయని, ఆయా ప్రాంతాల్లో జాగ్రత చర్యలను చేపట్టాలని సీఎస్ ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు, ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. దెబ్బతిన్న రాష్ట్ర, నేషనల్ హైవే రోడ్లను వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించారు. డీజీపీ అంజనీకుమార్ సైతం పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో బుధవారం రాత్రి డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పలు ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు పూర్తిగా నిండాయని, ఈ జలాశయాల వద్దకు ఎవరూ వెళ్లకుండా చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.
భద్రాచలంలో రెండో హెచ్చరిక జారీ
భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. బుధవారం మధ్యాహ్నం 43 అడుగులు దాటడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాత్రి 9.45 గంటలకు ప్రవాహం 48 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో శ్రీరాంసాగర్‌కు వరద పెరిగింది. ఎస్సారెస్పీ ప్రాజెక్టు గేట్లు ఏ క్షణమైనా ఎత్తే అవకాశం ఉంది. కర్ణాటక, మహారాష్ట్రలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణా బేసిన్‌లో ఎగువన ఉన్న ప్రాజెక్టులకు స్థిరంగా వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు సైతం స్వల్పంగా వరద నీరు వస్తోంది. మూసీపై ఏడు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.
మరో రెండ్రోజులు కుండపోతే..
వాయవ్య బంగాళాఖాతంలో ఏపీ, ఒడిశా తీరంలో తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సముద్ర మట్టం నుంచి 7.6 కి.మీ ఎత్తు వరకు స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలంగాణలో రెండ్రోజులపాటు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి-భువనగిరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. నిర్మల్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
గడిచిన 24 గంటల్లో మూడు జిల్లాల్లో అత్యంత భారీ, ఐదు జిల్లాల్లో అతి భారీ, పది జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురిశాయి ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో కురిసిన వానలకు అనేక చెరువులు, కుంటలు నిండిపోయాయి. వాతావరణశాఖ ఖమ్మం జిల్లాకు రెడ్‌అలర్ట్ ప్రకటించిదని, రాబోయే 48 గంటల్లో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నందున జాగ్రత్తగా ఉండి ప్రాణనష్టం జరగకుండా అన్ని ముం దస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వీపీ గౌత మ్ అధికారులను ఆదేశించారు.
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు నిండు కుండలను తలపిస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జూకల్ మాటు వరద దాటికి తెగిపోయింది. కేటీకే ఓసీపీ-1, కేటీకే ఓసీపీ-2 రెండు గనుల్లో బొగ్గు ఉత్పత్తి, మట్టి తవ్వకాలు నిలిచిపోయాయి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో అలుగు పారుతున్న చెరువులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పరిశీలించారు. గంగమ్మకు పూజలు నిర్వహించారు. కాజీపేటలో ఓ ఇంటిపై పిడుగు పడింది. పిడుగు దాటికి చుట్టుపక్కల ఇల్లలో విద్యుత్తు మీటర్, వైర్లు, ఎలక్ట్రికల్ వస్తువులు కాలిపోయాయి. నారాయణపేట జిల్లాలోని మక్తల్ మండలం పసుపులలోని కృష్ణా నది పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షానికి మొసళ్లు కొట్టుకొచ్చాయి. కడెం రిజర్వాయర్‌పై నుంచి వరద నీరు ప్రమాదకర స్థాయిలో పొంగి పొర్లుతోంది. దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి పోస్ట్ చేశారు.
కడెం ప్రాజెక్టు పై నుండి ఓవర్ ఫ్లో....! pic.twitter.com/PIvnFLEQXT
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) July 27, 2023
33 శాతం అదనం
రాష్ట్రవ్యాప్తంగా అధిక వర్షపాతం నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ నాగరత్న తెలిపారు. జూన్ 1 నుంచి బుధవారం నాటికి 313.9 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 416.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు చెప్పారు. సాధారణం కంటే దాదాపు 33 మిల్లీమీటర్ల అధిక వర్షపాతం నమోదైందని, మరో వారంపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలతో మరింత అధిక వర్షపాతం రికార్డు అయ్యే అవకాశం ఉన్నదని వెల్లడించారు.