నేడు బలపడనున్న అల్పపీడనం - వర్షాలతో తెలంగాణలో 3 రోజులు ఎల్లో అలర్ట్, ఏపీలో ఇలా
Low pressure over Bay Of Bengal: అల్పపీడన అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది ప్రస్తుతం వాయువ్యవ దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా నేడు బలపడనుంది.
Rains In Telangana: ఈశాన్య, పరిసర ప్రాంతాలైన తూర్పు బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీర ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది ప్రస్తుతం వాయువ్యవ దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా నేడు బలపడనుంది. అనంతరం ఉత్తర బంగాళాఖాతం, దానిని అనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో వాయుగుండంగా బలపడుతుంది. ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ గంగా పరివాహక పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్ గఢ్ వైపు ప్రయాణిస్తుందని వాతావరణ కేంద్రం పేర్కొంది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. ధవళేశ్వరం వద్ద నీటి ప్రవాహం పెరుగుతోంది. నేడు, రేపు ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఆదివారం ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
Synoptic features of weather inference for Andhra Pradesh Dated 18.08.2022. pic.twitter.com/HTfI08cWGZ
— MC Amaravati (@AmaravatiMc) August 18, 2022
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా నేడు బలపడనుంది. తీరంలో గాలులు వేగంగా వీస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో రెండు నుంచి మూడు రోజులు వర్షాలు కురుస్తాయి. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయిని అంచనా వేసింది వాతావరణ కేంద్రం. రాయలసీమలోని ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలలో నేడు, రేపు తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు.. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని చెప్పారు.
తెలంగాణలో వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని, ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. నేడు, రేపు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు. దక్షిణ తెలంగాణలో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు పడతాయి. ఉదయం వేళ చల్లగా ఉంటూ, మధ్యాహ్నానికి వాతావరణం పూర్తిగా వేడెక్కుతుంది. ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆగస్టు 19 నుంచి 21 వరకు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
— IMD_Metcentrehyd (@metcentrehyd) August 18, 2022
హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. అరటితోటలకు నష్టం వాటిల్లుతుంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.