Rahul Tour In Telngana : చంచల్ గూడ జైలుకు రాహుల్ గాంధీ - రేవంత్ రెడ్డి వ్యూహం !
ఓయూలో రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడంపై ఆందోళనలు చేసిన ఎన్‌ఎస్‌యూఐ నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని పరామర్సించేందుకు రాహుల్ వెళ్లే అవకాశం ఉంది.
తెలంగాణ పర్యటనకు వస్తున్న కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ టూర్‌లో చంచల్ గూడ జైలును కూడా చేర్చారు రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ ఏడో తేదీన చంచల్ గూడ జైలును సందర్శించి..అందులో ఉన్న ఎన్ఎస్‌యూఐ నేతలను పరామర్శిస్తారని రేవంత్ రెడ్డి ప్రకటించారు. సోమవారం రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లి .. జైల్లో ఉన్న ఎన్‌ఎస్‌యూఐ నేతలతో ములాఖత్ అయ్యారు. రాహుల్ గాంధీతో ఉస్మానియా యూనివర్శిటీలో మీటింగ్ పెట్టాలని కాంగ్రెస్ నేతలు భావించారు. అయితే ఓయూ పాలకవర్గం అనుమతి నిరాకరించింది. ఓయూలో రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని ఎన్‌ఎస్‌యూఐ నేతలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
వారికి సంఘిభావంతెలియచేసేందుకు విద్యార్థి నేతలను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఇతర నాయకులు సోమవారం చంచల్ గూడ జైలులో పరామర్శించారు. ప్రస్తుతం నేతలంతా రిమాండ్‌లో ఉన్నారు. వారు బెయిల్ కోసం ప్రయత్నించడం లేదు. ఈ నెల 7 వారిని పరామర్శించేందుకు రాహుల్ గాంధీ జైలుకు వస్తారని ఇందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ జైలు సూపరిండెంటెంట్‌కు వినతి పత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అలాంటి నేత పర్యటనను తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంటోందని విమర్శించారు.
We have given representation to the superintendent of Chanchalguda Jail seeking permission for
— Revanth Reddy (@revanth_anumula) May 2, 2022
@RahulGandhi ji to visit our illegally arrested @TSNSUI president & other important leaders.
TRS Government is in a state of panic with Rahul ji’s visit to the state. pic.twitter.com/3xSgLF3FV8
ఉస్మానియా పాలక వర్గం అనుమతి ఇవ్వకపోయినా రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో ఉస్మానియా యూనివర్సిటీ సందర్శిస్తారని రేవంత్ రెడ్డి సందర్శిస్తారని ప్రకటించారు. శాంతిభద్రతల సమస్య తలెత్తితే తప్పు మాది కాదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరించారు. రాహుల్‌గాంధీ ఓయూ విద్యార్థులతో రాజకీయాలు మాట్లాడరని యూజీసీ నిధులు సరిగా వినియోగం అవుతున్నాయా? లేదా? తెలుసుకుంటారని అన్నారు. ఓయూలో నియామకాలు సరిగా జరుగుతున్నాయా? లేదా? రాహుల్ గాంధీ తెలుసుకుంటారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ఎన్‌ఎస్‌యూఐ నాయకులను అరెస్ట్ చేశారని కాంగ్రెస్ నేతలు మండి పడుతున్నారు. మరో వైపు ఓయూలో రాహుల్ పర్యటనకు అనుమతి ఇవ్వాలంటూ వరుసగా నిరసనలు చోటు చేసుకుంటూనే ఉన్నయి.