Rahul Gandhi: నోటికొచ్చినట్లు మాట్లాడితే ఇక కఠిన చర్యలు, ఇద్దరు నేతలకు రాహుల్ గాంధీ వార్నింగ్!
కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ అందరు నేతలు కలిసికట్టుగా పని చేయాలని రాహుల్ గాంధీ సూచించారు.
ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో రాహుల్ గాంధీతో జరిగిన వ్యూహాత్మక సమావేశంలో ఇద్దరు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు అగ్రనేత క్లాస్ పీకినట్లు సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్ లో ఏ లీడర్లు ఏం చేస్తున్నారో తనకు అంతా తెలుసని.. ఇప్పటివరకూ ఎవరెవరు పార్టీ కోసం ఏం చేశారో, ఏం చేస్తున్నారో తన దగ్గర సమాచారం ఉందని రాహుల్ గాంధీ అన్నట్లు సమాచారం. ఇకపై అంతర్గత విబేధాలు ఉంటే తనకు గానీ, పార్టీ పెద్దలతో కానీ చెప్పి పరిష్కరించుకోవాలని, అంతేకానీ, నోటికొచ్చినట్లు బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని రాహుల్ గాంధీ హెచ్చరించినట్లుగా సమాచారం.
కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ అందరు నేతలు కలిసికట్టుగా పని చేయాలని రాహుల్ గాంధీ సూచించారు. కర్ణాటక ఎన్నికల వ్యూహంలో అనుసరించిన విధానాన్ని సమావేశంలో చర్చించారు. తెలంగాణ పీసీసీ నేతల సూచనలు, సలహాలు రాహుల్ గాంధీ విన్నారు. నాయకులంతా ఏకతాటిపై నడవాలని, కేసీఆర్‌ను ఓడించేందుకు నేతలందరూ విబేధాలు, చిన్న చిన్న గొడవలు పక్కన పెట్టేయాలని రాహుల్ గాంధీ సూచించారు.
ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం నేడు (జూన్ 27) జరిగిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల కోసం వ్యూహాలను ఇందులో చర్చించారు. ఈ సమావేశం దాదాపు 3 గంటలపాటు సాగింది. ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు కీలక నేతలు, వారి అనుచరులు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త కళ వచ్చినట్లు అయింది. ఈ భేటీలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్ రావ్ ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, కే. జానారెడ్డి, జగ్గారెడ్డి, మధుయాస్కి గౌడ్ తదితరలు పాల్గొన్నారు.
కేసీఆర్ ని గద్దె దింపడమే లక్ష్యం - మాణిక్ రావు
తెలంగాణలో అనుసరించే వ్యూహాలపై, చేపట్టే కార్యక్రమాలపై రాహుల్ గాంధీతో చర్చించామని సమావేశం అనంతరం మాణిక్ రావు ఠాక్రే తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు కాస్త ఆగ్రహంతో ఉన్నారని, పదేళ్ల తర్వాత కూడా ప్రజల జీవితాల్లో మార్పు రాలేదని అన్నారు. కేసీఆర్ ని గద్దె దించి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించామని అన్నారు. కాంగ్రెస్‌తో తెలంగాణ వికాస్ ఉంటుందని అన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ గట్టిగా ఉన్న చోట బీజేపీకి లాభం చేసేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మాణిక్ రావ్ థాక్రే విమర్శలు చేశారు. తాము చెప్పిన అందరి సూచనలను రాహుల్ గాంధీ విన్నారని తెలిపారు.
120 రోజుల కార్యాచరణ - రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే 120 రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించామని తెలిపారు. తెలంగాణ ఎన్నికల కార్యచరణ మొదలైందని అన్నారు. మేనిఫెస్టో రూపకల్పన తొందరగా పూర్తి చేయాలని చర్చ జరిపామని అన్నారు. అభ్యర్థుల ఎంపికలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలనే దానిపై చర్చ జరిగిందని అన్నారు. ఎన్నికల సన్నాహక సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగిందని, కర్ణాటక ఫార్ములాను తెలంగాణలో అమలు చేయాలని నిర్ణయించామని చెప్పారు. అక్కడ అనుసరించిన కొన్ని కీలక అంశాలు ఇక్కడ కూడా అమలు చేయాలని నిర్ణయించినట్లుగా రేవంత్ రెడ్డి చెప్పారు.