Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం -కొందరి ఫోన్లపై నిఘా పెట్టినట్లు రాధాకిషన్ రావు వాంగ్మూలం!
Phone Tapping Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజురోజుకో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Phone Tapping Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజురోజుకో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అప్రూవర్ గా మారిన మాజీ డీసీపీ రాధాకిషన్ రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందిగా మారిన వ్యక్తుల ఫోన్ల పై నిఘా పెట్టినట్లు ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో ఒప్పుకున్నట్లు అధికారులు ప్రకటించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మీడియా యజమానులకు కూడా వదల్లేదని తెలిపారు. కీలక ఛానళ్ల యజమానుల ఫోన్లు సైతం ట్యాప్ చేసినట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీని ట్రోలింగ్ చేసిన వారిని టార్గెట్ చేసినట్లు ఇదివరకే ప్రణీత్ రావు తెలిపాడు.
వివాదాలపై కన్నేసి, ఫోన్లపై నిఘా పెంచి..
అప్పటి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేతో వివాదాలున్న శంబీపూర్ రాజుపై, కడియం శ్రీహరితో ఉన్న రాజయ్య విభేదాలపై నిఘా పెట్టామని తెలిపాడు. తాండూరు ఎమ్మెల్యేతో పట్నం మహేందర్‌రెడ్డి దంపతులకు ఉన్న విభేదాలపైనా ఓ కన్నేసి ఉంచినట్లు రాధాకిషన్ రావు వెల్లడించారు. ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపైనా నిఘా పెట్టామన్నారు. అప్పటి బీఎస్పీ నేత ప్రవీణ్‌కుమార్, తీగల కృష్ణారెడ్డి, తీన్మార్ మల్లన్న ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు ఒప్పుకున్నారు.
వారితో పాటు కాంగ్రెస్ నేత జానారెడ్డి కుమారుడు రఘువీర్‌రెడ్డి, సరిత తిరుపతయ్యపై నిఘా పెట్టామన్నారు. జువ్వాడి నర్సింగరావు, వంశీకృష్ణ, కవ్వంపల్లి సత్యనారాయణతోపాటు ఈటల రాజేందర్, బండి సంజయ్, ఎంపీ అరవింద్ ఫాలోవర్ల ఫోన్లపై నిఘా పెట్టినట్లు రాధాకిషన్ పేర్కొన్నాడు. కొందరు మీడియా యజమానుల వాట్సప్, స్నాప్‌చాట్‌లో మాట్లాడిన వారి వివరాలు సేకరించినట్లు తెలిపారు. ఇంటర్నెట్ ప్రొటోకాల్ డేటా రికార్డులను ప్రణీత్‌రావు విశ్లేషించారని రాధాకిషన్‌రావు అంగీకరించారు.
కవితను లిక్కర్ కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు
అంతే కాకుండా బీఎల్ సంతోష్ ని అరెస్ట్ కనుక చేస్తే తన కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను లిక్కర్ కేసు నుంచి తప్పించవచ్చు అని అప్పటి సీఎం కేసీఆర్ భావించారని రాధాకిషన్ రావు వాంగ్మూలంలో పేర్కొన్నారు. కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. పార్టీని వదిలి బీజేపీలోకి చేరనున్నట్లు కేసీఆర్ కు సమాచారం రావడంతో వారిపై నిఘా పెట్టాలని ఐబీ చీఫ్ కు కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లుగా చెప్పారు. డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసి వాటిలో కొన్ని ఆడియోలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఇచ్చారని.. ట్యాపింగ్ క్లిప్ లు చేతికి అందిన తర్వాత ఫాంహౌస్ ట్రాప్ కోసం ఢిల్లీ నుంచి ఖరీదైన స్పై కెమెరాలు, మెటీరియల్ తెప్పించినట్లు తన వాంగ్మూలంలో తెలిపారు.