నాటు నాటు పాట కోసం 19 నెలలు - చంద్రబోస్ చెప్పిన సీక్రెట్స్
నాటు నాటు పాటను 45 నిమిషాల్లో రాసేసినప్పటికీ తుదిమెరుగులు దిద్దడానికి మాత్రం 19నెలల సమయం పట్టిందని చంద్రబోస్ అన్నారు.
ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ కు ఆస్కార్ అవార్డ్ వచ్చిన సందర్భంగా రవీంద్రభారతిలో ఆయనకు ఘన సన్మానం జరిగింది. తెలంగాణ సాహిత్య అకాడమీ తరపున ఈ అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ కార్య్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, నటుడు, దర్శకుడు ఆర్. నారాయణ మూర్తి, సాహితీవేత్తలు, కవులు, రచయితలు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబోస్ ప్రసంగిస్తూ స్టేజీపై నాటు నాటు పాట పాడారు.
ఇంకా గొప్పగా సన్మానించుకుంటాం- మంత్రి శ్రీనివాస్ గౌడ్
95 ఏళ్ల తర్వాత ఇండియన్ సినిమాకు.. అందునా తెలుగు పాటకు ఆస్కార్ అవార్డు రావడం గర్వకారణమన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. చంద్రబోస్ ఆస్కార్ పొందిన రోజు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషించారని ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలైతే ఎంతగానో గర్వించారన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. త్వరలో అందరినీ పిలిచి గొప్పగా సన్మానించుకుంటామని తెలిపారు. చంద్రబోస్ వల్ల యావత్ భారత దేశానికి ఖ్యాతి వచ్చిందని కొనియాడారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఆస్కార్ విజేతలను గొప్పగా గౌరవించుకుంటామన్నారు. తెలంగాణ సాహిత్యాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చంద్రబోసుకు అభినందనలు తెలిపారు మంత్రి శ్రీనివాస్ గౌడ్
మూడే ముక్కల్లో నా జీవితం- చంద్రబోస్
“ఆస్కార్ అనేది నా పరంగా అబద్దం లాంటి నిజం.. స్వప్నం లాంటి సత్యం.. కల్పన లాంటి యదార్థం అన్నారు గీత రచయిత, ఆస్కార్ విజేత చంద్రబోస్. 95 ఏళ్ల ఆస్కార్ చరిత్రలో మొట్టమొదటిసారి వినిపించిన తొలి తెలుగు పదం నమస్తే అని ఆయన గుర్తుచేశారు. ఆస్కార్ అవార్డు పొందిన మొదటి తెలుగు పాటలోని మొదటి మాట పొలం.. పొలం అనేది జీవన విధానం.. నమస్తే అనేది మన జీవన సంస్కారం. ఆస్కార్ వేదికపై ఆ రెండు పదాలు వినిపించడంలో భాగమైన నేను కవిగా గర్విస్తున్నా. నా జీవితం గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే.. చల్లగరిగ, జూబ్లీహిల్స్, బెవర్లీహిల్స్. జాతీయ అవార్డు కోసం చాలా ఎదురు చూశాను కానీ రాలేదు.. భగవంతుడు కరుణించి 4 అంతర్జాతీయ పురస్కారాలు ఇచ్చారు. 2018లో బెవర్లీహిల్స్ డాల్బీ స్టూడియోకి వెళ్తే లోపలికి రానివ్వలేదు.. నాలుగేళ్ల తర్వాత రెడ్ కార్పెట్ మీద నడిచివెళ్లే అవకాశం లభించింది. పోటీలో గొప్పగొప్ప సంగీతకారుల మధ్య మా పాటకు అవార్డు వచ్చింది. అవార్డు అందుకునే క్షణాల్లో ఉద్వేగ, ఆలోచనా రహిత స్థితిలో ఉన్నాను. నిర్వికల్ప సమాధి స్థితిని అనుభవించాను. ఆస్కార్ పురస్కారం అందుకున్నప్పుడు భారత జాతీయ సాహిత్య పతాకాన్ని చేతిలో పొదువుకున్నట్లు అనిపించింది. నాటు నాటు పాటను 45 నిమిషాల్లో రాశాను. కానీ, చిన్న చిన్న కూర్పులు చేయడానికి 19 నెలలు పట్టింది. సాహిత్యంతో పాటు సహనానికి పరీక్ష పెట్టారు. అవన్నీ దాటుకుని అవార్డు గెలుచుకున్నాం. రాసేటప్పుడే కాకుండా, రాయనప్పుడు కూడా కవిగా ఉండేవాడే అసలైన విజయాలకు అర్హుడు” - చంద్రబోస్
జాతి గర్విచదగ్గ కవి చంద్రబోస్- జూలూరి, ఆర్. నారాయణమూర్తి
తెలంగాణ మట్టి పరిమళాలను విశ్వవీధుల్లోకి తీసుకెళ్లిన ఘనత చంద్రబోసుదే అన్నారు తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ జూలరి గౌరీశంకర్. చంద్రబోస్ విశ్వనరుడుయ్యాడని కొనియాడారు. ఆస్కార్ అవార్డును పొందడం ఆషామాషీ కాదన్నారు నటుడు నారాయణమూర్తి. తెలుగు జాతి గర్విచదగ్గ కవి చంద్రబోస్ అన్నారాయన. చంద్రబోసుకు అభినందనలు తెలిపారు.