రైతుల పేరిట రాజకీయాలు వద్దు- ఎంపీ కోమటిరెడ్డికి మంత్రి నిరంజన్‌రెడ్డి కౌంటర్
అకాలవర్షాల గురించి 4 రోజుల ముందు నుంచే ప్రభుత్వం అప్రమత్తం చేస్తుందని మంత్రి నిరంజన్‌రెడ్డి గుర్తు చేశారు. వర్షాలు కురిసిన 24 గంటలలోపే కేసీఆర్ ఆదేశాలతో వికారాబాద్ జిల్లాలో పర్యటించానని తెలిపారు.
రైతుల పేరిట కాంగ్రెస్ నేతలు రాజకీయం చేయడం తగదని హితవు పలికారు వ్యవసయశాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి. నాలుగేళ్లలో కాంగ్రెస్ ఎంపీలు ఎన్ని సమస్యల మీద ఎన్ని దీక్షలు చేశారని ఆయన ప్రశ్నించారు. అకాలవర్షాలకు పంటనష్టంపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖపై స్పందించారు వ్యవసాయ శాఖా మంత్రి.
అకాలవర్షాల గురించి నాలుగు రోజుల ముందు నుంచే ప్రభుత్వం అప్రమత్తం చేస్తున్నదని మంత్రి నిరంజన్‌రెడ్డి గుర్తు చేశారు. వర్షాలు కురిసిన 24 గంటలలోపే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లాలో పర్యటించానని తెలిపారు. రాష్ట్రంలో దెబ్బతిన్న పంటలను అంచనా వేయాలని వ్యవసాయ శాఖను ఆదేశించామని నిరంజన్‌రెడ్డి అన్నారు. వివిధ ప్రాంతాల్లో ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు పంట నష్టం జరిగిన వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి రైతులకు భరోసా కల్పిస్తున్నారని మంత్రి స్పష్టం చేశారు.
కేవలం రాజకీయ ప్రయోజనాల కొరకు చేసే ప్రతిపక్షాల రాజకీ దీక్షలను రైతులు గమనిస్తున్నారని మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి ఒక ప్రజాప్రతినిధిగా కోమటిరెడ్డి గాని, మరొకరు గాని తీసుకురావడం వారి బాధ్యత అని గుర్తుచేశారు. అంతేకానీ రాజకీయ దురుద్దేశాలతో ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే అలోచన సబబు కాదని హితవు పలికారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు, వ్యవసాయానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి వ్యవసాయ అనుకూల విధానాలతో దేశంలోనే అగ్రగామిగా సాగుతున్నదని మంత్రి స్పష్టం చేశారు.
ప్రభుత్వ చర్యల మూలంగా ఈ యాసంగిలో 56.44 లక్షల ఎకరాలలో వరి సాగవుతున్నదని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంటు, సాగునీటి కల్పనతో రైతులలో ఆత్మవిశ్వాసం పెరిగిందని ఆయన అన్నారు. ప్రతి యేటా వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతున్నాయని, దేశంలో సగటు ఉత్పత్తిలో ప్రథమ స్థాయిలో నిలిచామని చెప్పుకొచ్చారు.
తెలంగాణ వరి ధాన్యం కొనబోమని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెబితే, ఒక్క కాంగ్రెస్ నేత కూడా ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు? అప్పుడెందుకు రైతుకోసం దీక్షలు చేయలేదని ప్రశ్నించారు. అకాలవర్షాలతో వచ్చిన పంటనష్టం మీద రాజకీయం చేయడం దురదృష్టకరమని అన్నారు మంత్రి నిరంజన్‌రెడ్డి. గత పాలనలో రైతుల పడ్డ గోస గుర్తు చేసుకోండని హితవు పలికారు.
అకాల వర్షాలు, వడగళ్ల వానతో తీవ్రంగా నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. రైతుల సమస్యలపై రెండ్రోజుల్లో స్పందించకుంటే ఈనెల 22న తిరుమలగిరి మండలంలో నిరాహార దీక్ష చేస్తానని ఆయన హెచ్చరించారు. అకాల వర్షం, వడగళ్ల వాన అన్నదాతల ఆశలను చిదిమేశాయని కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయానికి వాన తుడిచిపెట్టిందని అన్నారు. రెండ్రోజుల్లో ప్రభుత్వం స్పందించకుంటే రైతుల పక్షాన తానే స్వయంగా రంగంలోకి దిగుతానని స్పష్టం చేశారు. నష్టపోయిన ప్రతీ రైతుకు పరిహారం అందేవరకు పోరాటం ఆగదని వెల్లడించారు. తక్షణమే పంటనష్టం అంచనా వేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలోని తిరుమలగిరి మండలంలో 99 శాతం పంటలు దెబ్బతిన్నాయని, వరి, మిర్చి, మామిడి, మొక్కజొన్న, తదితర పంటలు పాడైపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.