PM Modi Schedule: నేడే ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదీ
రేపు(శనివారం) హైదరాబాద్ లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. రేపు మధ్యాహ్నం ఇక్రిశాట్ సందర్శిస్తారు. సాయంత్రం ముచ్చింతల్ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు.
ప్రధాని మోదీ హైదరాబాద్ రేపు హైదరాబాద్ లో పర్యటించనున్నారు. శనివారం మధ్యాహ్నం 2.45 గంటలకు ఆయన ఇక్రిశాట్‌ను సందర్శిస్తారు. అక్కడ ఇక్రిశాట్ నూతన లోగోను ఆవిష్కరించనున్నారు. ఇక్రిశాట్ 50వ వార్షికోత్సవ వేడుకలను ప్రధాన మంత్రి మోదీ ప్రారంభించనున్నారు. మొక్కల సంరక్షణపై ఇక్రిశాట్ వాతావరణ మార్పు పరిశోధనా సదుపాయం, రాపిడ్ జనరేషన్ అడ్వాన్స్‌మెంట్ ఫెసిలిటీని ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. ఈ రెండు సౌకర్యాలు ఆసియా, సబ్-సహారా ఆఫ్రికాలోని చిన్న రైతుల కోసం అంకితం చేస్తారు. ఇక్రిశాట్ ప్రత్యేకంగా రూపొందించిన లోగోను కూడా ఆవిష్కరిస్తారు. ఈ సందర్భంగా విడుదల చేసిన స్మారక స్టాంపును కూడా ప్రధాన మంత్రి ఆవిష్కరించనున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ శంషాబాద్ దగ్గర్లోని ముచ్చింతల్ కు ప్రధాని వెళ్లనున్నారు. రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా చినజీయర్ స్వామి ఆశ్రమంలో ఏర్పాటు చేసిన సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత దిల్లీ బయలు దేరి వెళ్లనున్నారు.
ప్రధాన మంత్రి షెడ్యూల్
- మధ్యాహ్నం గం. 2.10లకు శంషాబాద్ ఎయిర్ పోర్టు
- గం.2.45లకు ఇక్రిశాట్
- 2.45 నుండి 4.15 వరకు ఇక్రిశాట్ 50వ వార్షికోత్సవ ప్రారంభకార్యక్రమం
- 5 గంటలకు ముచ్చింతల్
- 5 గంటల నుంచి 8 గంటల వరకు సమతా మూర్తి విగ్రహవిష్కరణ కార్యక్రమం
- 8.20 కి హైదరాబాద్ నుంచి దిల్లీకి తిరుగు ప్రయాణం
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన బందోబస్తు ఏర్పాట్లలో హైదరాబాద్ పోలీసు యంత్రాంగం నిమగ్నమైంది. 7వేల మంది పోలీసులతో పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు మోదీ వస్తున్నందున భద్రతా చర్యలపై రాష్ట్ర పోలీసులతో ఎస్పీజీ సమన్వయం చేసుకుంటోంది. ప్రధాని మోదీని హైదరాబాద్ లో ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలకనున్నారు. ప్రధాని పర్యటనకు ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి ముచ్చింతల్ లో ఆశ్రమాన్ని శుక్రవారం సందర్శించారు. భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు.
డ్రోన్లపై నిషేధం
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రోన్స్ పై నిషేధం విధించారు పోలీసులు. రామచంద్రపురం ఇక్రిశాట్, ముంచింతల్ చిన జీయర్ ఆశ్రమం వద్ద డ్రోన్స్ పై నిషేధం ఉంది. రేపు ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ వరకు డ్రోన్లను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీచేశారు పోలీసులు. రిమోట్ కంట్రోల్ డ్రోన్స్, పారా గ్లిడర్స్, మైక్రో లైట్ ఎయిర్ క్రాఫ్ట్స్ పై నిషేధం ఉంది. 15వ తేదీ వరకు వీవీఐపీల రాక సందర్భంగా డ్రోన్లు నిషేధిస్తూ సైబరాబాద్ సీపీ ఉత్తర్వులు ఇచ్చారు.
Also Read: రాజకీయాల్లోకి 'పుష్ప' ఫీవర్.. 'శ్రీవల్లి' పాటను రీమేక్ చేసిన కాంగ్రెస్