Patancheru CI Suspend: కేసులో నిర్లక్ష్యం, వ్యక్తి మృతి - పటాన్ చెరు సీఐపై సస్పెన్షన్ వేటు
Telangana Police News: ఓ వ్యక్తి మిస్సింగ్ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పటాన్ చెరు సీఐ లాలు నాయక్ పై సస్పెన్షన్ వేటు వేశారు.
Hyderabad News: హైదరాబాద్: విధుల్లో నిర్లక్ష్యం వహించిన కారణంగా పటాన్ చెరు సీఐపై సస్పెన్షన్ వేటు (Patancheru CI Suspend) పడింది. సీఐ లాలు నాయక్ స్థానంలో ఇంఛార్జి సీఐగా డీఐ శ్రీనివాస్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు జిల్లా ఎస్పీ రూపేష్. గత ఏడాది డిసెంబర్ 24వ తేదీ రాత్రి పటాన్ చెరుకి చెందిన నాగేశ్వర్ రావు అనే వ్యక్తిపై దాడికి సంబంధించిన కేసులో సీఐ లాలు నాయక్ నిర్లక్ష్యం చేయడంతోనే అతడు మరణించాడని ఆరోపణలు ఉన్నాయి. నాగేశ్వర్ రావు కుటుంబ సభ్యులు సీఐ లాలు నాయక్ పై ఫిర్యాదు చేశారు.
మొదట నాగేశ్వర రావు మిస్సింగ్ పై సమాచారం ఇచ్చినా, కేసు నమోదు చేసినా సీఐ పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారని విచారణలో తేలింది. దాంతో పటాన్ చెరు సీఐ లాలు నాయక్ పై జిల్లా ఎస్పీ రూపేష్ సస్పెన్షన్ వేటు వేశారు. అనుమానస్పద కేసు నమోదు చేసినా అతడి జాడ గురించి పట్టించుకోలేదని గుర్తించిన ఉన్నతాధికారులు పటాన్ చెరు సీఐని సస్పెండ్ చేశారు. ఇంఛార్జ్ సీఐగా శ్రీనివాస్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు.
ఇటీవల పలువురు సీఐలపై వేటు..
ఇటీవల పలు కేసులో నిర్లక్ష్యం వహిస్తున్న ఎస్, సీఐలు వరుసగా సస్పెండ్ అవుతున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల ఇద్దరు సీఐలు సస్పెండ్ అయ్యారు. దంపతుల మధ్య వివాదంలో జోక్యం చేసుకోవడంతో పాటు ఓ వ్యక్తిపై దాడి చేసిన కారణంగా కేపీహెచ్‌బీ సీఐపై వేటు పడింది. కేసులో నిర్లక్ష్యం వహించారని ఎయిర్ పోర్ట్ సీఐ శ్రీనివాస్ సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పహాడి షరీఫ్ సీఐపై సైతం ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. సివిల్ కేసు వివాదంలో జోక్యం చేసుకున్న కారణంగా సీఐ సతీష్ పై సస్పెన్షన్ వేటు వేశారు.