OU News: ఓయూ లేడీస్ హాస్టల్లోకి ఆగంతకులు - భద్రత కల్పిస్తామన్న డీసీపీ హామీతో విద్యార్థినుల ఆందోళన విరమణ
OU Girl Students Protest: ఉస్మానియా వర్శిటీ విద్యార్థినులు ఎట్టకేలకు ఆందోళన విరమించారు. లేడీస్ హాస్టల్ లోకి ఆగంతుకులు చొరబడడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా భద్రత కల్పిస్తామని డీసీపీ హామీ ఇచ్చారు.
OU Girl Students Agitation Over: ఉస్మానియా వర్శిటీ (Osmania University) లేడీస్ హాస్టల్ లోకి శుక్రవారం రాత్రి ఆగంతకులు ప్రవేశించారని విద్యార్థినులు ఆందోళన చేస్తోన్న విషయం తెలిసిందే. వీరి ఆందోళనతో వర్శిటీ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఓయూ రిజిస్ట్రార్ వచ్చి నచ్చచెప్పినా విద్యార్థినులు వినలేదు. వీసీ వచ్చే వరకూ ధర్నా విరమించబోమని స్పష్టం చేశారు. అయితే, వర్శిటీని సందర్శించిన నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని విద్యార్థినులకు నచ్చచెప్పారు. వసతులు కల్పిస్తామని, భద్రతా ఏర్పాట్లు చేస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించి ఆందోళన విరమించారు. ఈ క్రమంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.
ఇదీ జరిగింది
ఉస్మానియా యూనివర్శిటీలోని లేడీస్ హాస్టల్‌లోకి శుక్రవారం రాత్రి ఇద్దరు ఆగంతకులు ప్రవేశించడం కలకలం రేపింది. ముగ్గురు దుండగులు గోడ దూకి హాస్టల్ ప్రాంగణంలోకి ప్రవేశించి.. విద్యార్థినులపై దాడికి ప్రయత్నించారు. అమ్మాయిలు అప్రమత్తం కావడంతో వాళ్లు తప్పించుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలోనే ఇద్దరు పరారు కాగా, మరో వ్యక్తి విద్యార్థినులకు దొరికిపోయాడు. అతన్ని పట్టుకొని చున్నీతో కట్టేశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. వారు అక్కడికి చేరుకోవడంతో నిందితున్ని వారికి అప్పగించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా విద్యార్థినుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. హాస్టల్లో రక్షణ కరవైందని, సీసీ టీవీలు ఏర్పాటు చేయాలని విద్యార్థినులు నిరసనకు దిగారు. వెంటనే అక్కడికి చేరుకున్న ప్రిన్సిపాల్ స్టూడెంట్స్‌తో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయినా విద్యార్థినులు వినలేదు. హాస్టల్లో ఆగంతకులు చొరబడటంపై తమకు రక్షణ లేదంటూ భారీగా రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగారు. సీసీ టీవీలు ఏర్పాటు చేసి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. వీసీ వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో వర్శిటీ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పోలీసులు, విద్యార్థినులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. చివరకు డీసీపీ హామీతో విద్యార్థులు శాంతించి.. ఆందోళన విరమించారు.