Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
Telangana Ration Card Edit Option | తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అని ప్రచారం జరుగుతోంది. అందులో వాస్తవం లేదని సివిల్ సప్లైస్ అధికారులు తెలిపారు.
Telangana Government Allowed Changings In Ration Cards: తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం రేషన్ కార్డులకు (Ration Cards) గుడ్ న్యూస్ చెప్పిందని, మార్పులు చేర్పులకు అవకాశం కల్పించిందని ప్రచారం జరిగింది. శనివారం (జులై 6) నుంచి ఎడిట్ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసిందని రేషన్ కార్డుల్లో వివరాలు మార్చుకోవడం, అప్ డేట్ చేసుకోవడానికి ఇదే సదావకాశం అని వార్తలు వచ్చాయి. రేషన్ కార్డుల వివరాల సవరణ (Ration Card Edit Option) ప్రక్రియ మొదలైందన్న ప్రచారంపై తెలంగాణ పౌరసరఫరాల శాఖ క్లారిటీ ఇచ్చింది.
రాష్ట్రంలోని రేషన్ కార్డుల్లో పేర్లు, వివరాల మార్పులకు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదని పౌరసరఫరాల శాఖ పేర్కొంది. రేషన్ కార్డుల ఎడిట్ ఆప్షన్‌కు సంబంధించి తాము ఎలాంటి అధికారిక ఉత్తర్వులు జారీ చేయలేదని పౌరసరఫరాల శాఖ అధికారులు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులకు మీ సేవా కేంద్రాల్లో ఎలాంటి ప్రక్రియ చేపట్టలేదన్నారు. సోషల్ మీడియాలో ఎడిట్ ఆప్షన్ విషయం వైరల్ కావడంతో ఎంతో ఆశగా వేలాదిగా రేషన్ కార్డుదారులు మీ సేవా కేంద్రాలకు క్యూ కట్టారు.
మరోవైపు మీ సేవా కేంద్రాల నిర్వాహకులు రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులకు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే దానిపై ప్రకటన చేస్తుందని, తమకు సైతం వివరాలు అందుతాయని చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కొన్ని రోజుల కిందట ప్రకటన చేసింది. అయితే పాత వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులు ఇస్తారా, లేక ఏమైనా సవరణలతో కొత్తవి జారీ చేస్తారన్నది క్లారిటీ లేదు.