Nitin Gadkari Telangana Tour: రూ.3,694 కోట్లతో నిర్మించిన 5 జాతీయ రహదారులను ప్రారంభించిన కేంద్ర మంత్రి గడ్కరి
Kumuram Bheem Asifabad district | రూ.3,694 కోట్లతో నిర్మించిన 5 జాతీయ రహదారులను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.

Nitin Gadkari inaugurated 5 national highways | కాగజ్‌నగర్: కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలతో కలిసి నితిన్ గడ్కరీ పలు జాతీయ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం ఉదయం 10.20 గంటలకు కుమురం భీం ఆసిఫాబాద్ (Kumuram Bheem Asifabad) జిల్లాలోని కాగజ్‌నగర్‌కు చేరుకున్నారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలతో కలిసి రూ.3,694.42 కోట్లతో నిర్మించిన రూ.115.39 కిలోమీటర్ల మేర విస్తరించిన 5 జాతీయ రహదారులను నితిన్ గడ్కరీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, ఎంపి గోడం నగేష్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
తెలంగాణకు మోదీ సర్కార్ 12 లక్షల కోట్లు ఖర్చుపెట్టింది..
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. గతంలో హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ రావాలంటే ఉదయం బయలుదేరితే సాయంత్రం, రాత్రికి చేరుకునేవాళ్లం. ఇప్పుడు కానీ ఎన్డీయే పదేళ్ల పాలనతో ఇప్పుడు కొన్ని గంటల్లోనే హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ చేరుకునేలా రోడ్లు నిర్మించారు. పదేళ్ల ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో 5100 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం పూర్తిచేశాం. నితిన్ గడ్కరీ చొరవతో రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం వేగంగా జరుగుతోంది. లక్షా 25 వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఎన్డీయే ప్రభుత్వం. రైల్వేల అభివృద్ధి, రైల్వేల నిర్మాణానికి రూ.32 వేల కోట్లు ఖర్చు పెట్టాం. తెలంగాణ ప్రభుత్వానికి 12 లక్షల కోట్ల రూపాయల్ని మోదీ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. గత రాష్ట్ర ప్రభుత్వంలా కేంద్రంపై విమర్శలు చేయడానికి బదులు ప్రస్తుత ప్రభుత్వం తమతో సహకరించాలని కోరారు.
నేటి సాయంత్రం హైదరాబాద్‌లో బహిరంగ సభ
కాగజ్‌నగర్ పర్యటన ముగించుకుని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం మధ్యాహ్నం 1 గంట నుంచి 3.30 వరకు హైదరాబాద్ శివారులోని కన్హా శాంతి వనాన్ని సందర్శించనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు బీహెచ్‌ఈఎల్ ఫ్లైఓవర్‌ను గడ్కరీ ప్రారంభిస్తారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా సాయంత్రం 5.30 గంటలకు అంబర్‌పేట ఫ్లైఓవర్‌ను నితిన్ గడ్కరీ ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. రూ.2,628.43 కోట్లతో నిర్మించిన రూ.173.14 కిలోమీటర్ల మేర ఏడు జాతీయ రహదారులను ఆ సభ నుంచి కేంద్ర మంత్రులు గడ్కరీ, కిషన్ రెడ్డి ప్రారంభిస్తారు. వీటితో పాటు పలు వంతెనల నిర్మాణానికి, రహదారుల విస్తరణ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రులు శంకుస్థాపనలు చేయనున్నారు.






















