MP Arvind: బీజేపీ ఎంపీ ఇంటి ముందు పసుపు కుప్పలు - ద్రోహం చేశారంటూ నిరసన, నినాదాలు
Nizamabad MP Arvind: పెర్కిట్ లోని ఎంపీ అర్వింద్ నివాసం ముందు పసుపు కొమ్ముల పంటను కుప్పగా పోసి రైతులు నిరసన తెలిపారు.
Nizamabad Turmeric Farmers: నిజామాబాద్ లో పసుపు రైతులు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ ధర్మపురి అరవింద్ గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీపై ప్రశ్నించారు. ఎంపీ అర్వింద్ పసుపు రైతులను మోసం చేశారంటూ ఆర్మూర్ మండలం పెర్కిట్ లోని ఎంపీ అర్వింద్ నివాసం ముందు పసుపు కొమ్ముల పంటను కుప్పగా పోసి నిరసన తెలిపారు. ఇటీవల ఎమ్మెల్సీ కవిత ఎంపీ అరవింద్ పసుపు రైతులకు చేసిన ద్రోహాన్ని ఆర్టీఐ సమాచారంతో బట్టబయలు చేశారు. దీంతో అరవింద్ ఓట్ల కోసం తమ మనోభావాలతో ఆడుకున్నాడని పసుపు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అరవింద్ నిజామాబాద్ లో ఎక్కడ పర్యటించినా అడ్డుకుని తీరుతామని పసుపు రైతులు స్పష్టం చేశారు.
ధర్మపురి అర్వింద్ శనివారం నిజామాబాద్ సీపీ క్యాంప్ ఆఫీస్ ఎదుట 3 గంటలపాటు బైఠాయించి ధర్నా చేసిన సంగతి తెలిసిందే. సీపీ కేఆర్ నాగరాజు టీఆర్ఎస్ పార్టీకి తొత్తుగా మారారంటూ ఎంపీ ఆరోపించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆయన సేవకుడిలా పని చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ తనకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వనుందని ఇటీవల కమిషనర్ నాగరాజు చెప్పిన విషయాన్ని అర్వింద్ గుర్తు చేశారు. కవిత ఎంపీగా ఓడిపోయి, దొడ్డిదారిన ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నారని విమర్శించారు. తన దత్తత గ్రామం కుకునూరు పర్యటనను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ కిరాయి గుండాలు ప్రయత్నిస్తున్నారని, తాను అక్కడకు వెళ్లేందుకు రక్షణ కల్పించాలని కోరితే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
కవిత విమర్శలు
ఎంపీ అర్వింద్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రెండ్రోజుల క్రితం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి విమర్శించిన సంగతి తెలిసిందే. మోసపూరిత హామీలతో అర్వింద్ ఎంపీగా గెలిచారని అన్నారు. ఎన్నికలకు ముందు చెప్పిన పసుపు బోర్డు ఏమైందని ప్రశ్నించారు. హామీ నిలబెట్టుకోకపోతే గ్రామాల్లో అడ్డుకుంటామని హెచ్చరించారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో 2016 లోనే పసుపు బోర్డు గురించి ప్రధానమంత్రి మోదీని కలిశానని, 2017 లో తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఉత్తరం కూడా రాసిందని కవిత గుర్తు చేశారు.
పసుపు ఎక్కువగా పండించే నిజామాబాద్ పరిధిలో 2018 ఎన్నికలకు ముందు పసుపు బోర్డు అంశం కీలకం అయింది. అప్పటి ఎంపీ కవిత పసుపు బోర్డు తేలేదని నిరసన వ్యక్తం చేస్తూ 178 మంది రైతులు ఆమెకు వ్యతిరేకంగా నామినేషన్లు వేశారు. ఆ ఎన్నికల హామీల్లోనే బీజేపీ ఎంపీగా గెలిచిన తరువాత పసుపు బోర్డును తీసుకురాకపోతే రాజీనామా చేస్తానంటూ ధర్మపురి అర్వింద్ బాండ్ పేపర్‌పై రాసిచ్చారు. అన్న మాట అది నిలబెట్టుకోలేకపోవడంతో ఆయనపై విమర్శలు వస్తూనే ఉన్నాయి.