TSPSC DAO Exam: అభ్యర్థి నిర్వాకం - మరొకరి OMR షీట్ లో ఎగ్జామ్ ! అడ్డంగా దొరకడంతో ట్విస్ట్
TSPSC DAO Exam: ఈ పరీక్ష రాస్తున్న ఓ అభ్యర్థి చేసిన నిర్వాకాన్ని అధికారులు గుర్తించారు. గవర్నమెంట్ జాబ్ కోసం పరీక్ష రాస్తున్న అభ్యర్థి ఏకంగా ఓఎంఆర్ షీట్ నే మింగేశాడు.
TSPSC DAO Exam 2023: రాష్ట్ర వ్యాప్తంగా పలు కేంద్రాలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ రాత పరీక్ష (TSPSC DAO Exam) నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ పరీక్ష రాస్తున్న ఓ అభ్యర్థి చేసిన నిర్వాకాన్ని అధికారులు గుర్తించారు. గవర్నమెంట్ జాబ్ కోసం పరీక్ష రాస్తున్న అభ్యర్థి ఏకంగా ఓఎంఆర్ షీట్ నే మింగేశాడు.
సహకార శాఖలో క్లర్క్ గా పనిచేస్తున్న అబ్దుల్ ముఖీద్ డీఏఓ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నాడు. నిజామాబాద్ నాల్గవ టైన్ పరిధిలో ఉన్న బోర్గాం (పి) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అతడికి సెంటర్ పడింది. తనకు ఇచ్చిన ఓఎంఆర్ పత్రంలో అబ్దుల్ తన వివరాలు తప్పుగా రాశాడు. ఈ క్రమంలో పక్కన ఉన్న ఓ అభ్యర్థి పరీక్షకు హాజరు రాకపోవడంతో అతని ఓఎంఆర్ పత్రాన్ని తీసుకొని రాశాడు. ఓఎంఆర్ షీట్లను కలెక్ట్ చేసిన సమయంలో ఇది గమనించిన ఇన్విజిలేటర్ ఆ అభ్యర్థిని ఓఎంఆర్ షీట్ ఇవ్వాలని అడిగారు. అతను ఆ ఓఎంఆర్ షీట్ ను నమిలి మింగేశాడు. దీంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ నాలుగో టౌన్ పోలీసులు అభ్యర్థిపై ఛీటింగ్ కేసు నమోదు చేశారు.
నిజామాబాద్ నగరంలో 20 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. నేడు జరిగిన డీఏఓ పరీక్ష ఉదయం మధ్యాహ్నం వేళలో రెండు సెషన్ లుగా విభజించి నిర్వహించారు. పరీక్ష రాసేందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అభ్యర్థులు వివిధ ప్రాంతాల నుండి వచ్చి పరీక్షను హాజరయ్యారు. ఈ క్రమంలో బోర్గాం పి ప్రభుత్వ పాఠశాలలో జరిగిన పరీక్షా కేంద్రంలో ఓ అభ్యర్థి ఏకంగా ఓఎంఆర్ షీట్ ని మింగేసిన ఘటన వెలుగు చూసింది. ఓఎంఆర్ షీట్ మాల్ ప్రాక్టీస్ చేసినట్లు అంగీకరించడంతో అభ్యర్థి అబ్దుల్ ముఖీద్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
నోటిఫికేషన్ వివరాలు..
తెలంగాణ వర్క్స్ అకౌంట్స్ సర్వీస్‌లో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (వర్క్స్) గ్రేడ్-2, పోస్టుల భర్తీకి సంబంధించి ఫిబ్రవరి 26న రాతపరీక్ష నిర్వహించారు. ఓఎంఆర్ విధానంలోనే రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిబ్రవరి 20న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది.
తెలంగాణలో 53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ఆగస్టు 4న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థుల నుంచి ఆగస్టు 17 నుంచి సెప్టెంబరు 6 వరకు దరఖాస్తులు స్వీకరించింది. రాతపరీక్ష నిర్వహించి ఖాళీలను భర్తీ చేయనున్నారు. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ లలో ఎగ్జామ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. పే స్కేలు: రూ.45,960- రూ.1,24,150 గా ఉంది.