కొరడా ఝులిపించిన ఈసీ- తెలంగాణలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీ
అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ...ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌లను బదిలీ చేసింది.
అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ...ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌లను బదిలీ చేసింది. జిల్లా కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలు బదిలీ జాబితాలో ఉన్నారు. విధి నిర్వహణలో అధికారుల అలసత్వంపై ప్రతిపక్షాల ఫిర్యాదులతో ఈసీ యాక్షన్ తీసుకుంది. కీలక శాఖల అధికారులు, పలు జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లను బదిలీ చేసింది. ప్రధాన నగరాల పోలీస్ కమిషనర్లకూ స్థానచలనం కలిగింది. నలుగురు కలెక్టర్ల బదిలీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్, మేడ్చల్ కలెక్టర్ అమోయ్ కుమార్, యాదాద్రి జిల్లా కలెక్టర్ కృష్ణారెడ్డి, నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డిని బదిలీ చేసింది. వీరితో పాటు 13 మంది ఎస్పీలు, సీపీలను సైతం ట్రాన్స్‌ఫర్ చేసింది.
కమిషనర్లు సైతం బదిలీ
హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, నిజామాబాద్ సీపీ సత్యనారాయణ, వరంగల్ సీపీ రంగనాథ్‌ను సైతం బదిలీ చేసింది. సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్, కామారెడ్డి ఎస్పీ శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎస్పీ భాస్కర్, మహబూబ్‌నగర్ ఎస్పీ నర్సింహ, నాగర్ కర్నూల్ ఎస్పీ మనోహర్, జోగులాంబ గద్వాల ఎస్పీ సృజన, నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు, మహబూబాబాద్ ఎస్పీ చంద్రమోహన్, భూపాలపల్లి ఎస్పీ కరుణాకర్, సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్ బదిలీకి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇటు ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌తో పాటు రవాణా శాఖ కార్యదర్శి శ్రీనివాస్‌రాజ్‌ను సైతం ట్రాన్స్‌ఫర్ చేసింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖకు ప్రత్యేక కార్యదర్శులను నియమించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. గురువారం సాయంత్రం 5గంటల కల్లా ప్యానల్ పంపాలని ఈసీ ఆదేశించింది.
అక్టోబరు 3 నుంచి 5 వరకు ఎన్నికల కమిషన్ అధికారులు రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలపై సమీక్షించారు. పోలీసుశాఖతో నిర్వహించిన సమావేశంలో కొందరు అధికారుల పనితీరుపై ఈసీ అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందులో ఎస్పీ స్థాయి అధికారులే ఎక్కువగా ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలు కూడా కొందరు పోలీసు అధికారుల పనితీరును విమర్శిస్తూ వారిని మార్చాలని వినతిపత్రం సమర్పించాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున అధికారులను మార్చే అధికారం కమిషన్‌కు ఉంటుంది. దీంతో కొందరు ఎస్పీలకు స్థానచలనం కల్పిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది.
ఎన్నికల వేళ మద్యం అమ్మకాలపై ఆబ్కారీ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. నగరంలోని ఆరు ఆబ్కారీ జిల్లాల పరిధిలోని 596 దుకాణాలు, బార్లలో మద్యం విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టింది. ఇప్పటిదాకా బెల్టు దుకాణాలను చూసీచూడనట్లు వదిలేసిన ఆ శాఖ సోమవారం నుంచి విస్తృత స్థాయిలో తనిఖీలు చేపడుతోంది. పోలీసుల ఆధ్వర్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల్లోని తనిఖీల్లో ఆబ్కారీ శాఖ అధికారులు పాల్గొంటున్నారు. సనత్‌నగర్, బోరబండ, ఫిలింగనగర్ పోలీస్‌స్టేషన్ల పరిధిలోని వివిధ ప్రాంతాల్లో బెల్టు దుకాణాలు నిర్వహిస్తున్న వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని మద్యం స్వాధీనం చేసుకుంటున్నారు.
దేశంలో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లోని 679 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్‌ను సీఈసీ రాజీవ్‌కుమార్ వెల్లడించారు. తెలంగాణ ఎన్నికల ముఖ్య తేదీలు.. ఎన్నికల నోటిఫికేషన్: నవంబర్ 3, 2023. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: నవంబర్ 10, 2023. దరఖాస్తుల ఉపసంహరణ: నవంబర్ 15, 2023. దరఖాస్తుల స్క్రూటినీ: నవంబర్ 13, 2023. పోలింగ్ తేదీ: నవంబర్ 30, 2023. ఎన్నికల కౌంటింగ్: డిసెంబర్ 3, 2023.