Nizamabad నిజామాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు ఇంకా ఖరారు కాని పార్టీల అభ్యర్థులు
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా ఎన్నిక సందడి మొదలుకాలేదు. ఇంకా అభ్యర్థుల వేటలో ప్రధాన పార్టీలు. అధికార పార్టీలోనూ కొలిక్కిరాని అభ్యర్థి పేరు. పోటీకి బీజేపీ, కాంగ్రెస్ తర్జన భర్జన.
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 23 వరకు నామినేషన్ల గడువు. ఇప్పటి వరకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ప్రధాన పార్టీల్లో సైతం హడావుడి మొదలు కాలేదు. ఈ ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో బీజేపీ ఇప్పటికే ఓ దఫా సమావేశం కూడా నిర్వహించారు. అయితే సమావేశంలో ఎలాంటి క్లారిటీ రాలేదని సమాచారం. జిల్లా కాంగ్రెస్ లో ఇప్పటి వరకు ఎమ్మెల్సీ ఎన్నికపై సమాలోచనలు కూడా చేయలేదని తెలుస్తోంది. ప్రధాన పార్టీల్లో అభ్యర్థుల విషయంపై తర్జన, భర్జనలు నడుస్తున్నాయ్. అయితే అధికార టీఆర్ఎస్ పార్టీలో మాత్రం సీన్ సైలెంట్ గా నడుస్తోంది. మొదట్నుంచి ప్రస్తుతం సిట్టింగ్ గా ఉన్న ఎమ్మెల్సీ కవితకే అవకాశం దక్కుతుందని కారు పార్టీలో ఎవరూ ఈ స్థానంపై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. ప్రస్తుతం ఆమె రాజ్యసభకు వెళ్తున్నారన్న ప్రచారం ఉన్నప్పటికీ కన్ఫామ్ అని చెప్పలేకపోతున్నారు. కానీ ఈ ప్రచారంతో ఆ పార్టీలో మాత్రం ఆశావహులు ఎవరికి వారే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
బీజేపీ, కాంగ్రెస్ లో అంతర్మథనం
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ స్థానిక సంస్థల ఎన్నికలో పోటీకి దిగాలా వద్దా అన్న సమాలోచనలు జరుగుతున్నట్లు సమాచారం. భూపతి రెడ్డి సస్పెండ్ తో గతేడాది ఈ ఎన్నిక అనివార్యమైంది. ఆ సమయంలో బీజేపీ అభ్యర్థిగా పొతంకర్ లక్ష్మీ నారాయణ బరిలో నిలిచారు. కేవలం 56 ఓట్లు మాత్రమే వచ్చాయి. స్థానిక సంస్థల్లో టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులే మెజార్టీ గా ఉన్నారు. గత స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో కల్వకుంట్ల కవిత 728 ఓట్లతో భారీ మెజార్టీ సాధించారు. అయితే ఈ సారి ఎన్నికకు కవిత కాకున్నా మరెవరు బరిలో ఉన్నా మెజార్టీ శాతం అధికార పార్టీకే ఓట్లు పోలవుతాయ్. ఈ నేపథ్యంలో బీజేపీ బరిలో ఉండాలా ? వద్దా ? అన్నదానిపే సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకైతే పార్టీ అభ్యర్థి ఎవరనేది బీజేపీ ప్రకటించలేదు. అభ్యర్థి ఎంపిక విషయంలో బీజేపీ అధిష్టానం పూర్తి బాధ్యతను ఎంపీ అరవింద్ కు అప్పచెప్పినట్లు సమాచారం. మరోవైపు కాంగ్రెస్ పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే కనిపిస్తోంది. గతేడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్ నుంచి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి బరిలో ఉన్నారు. ఆయనకు కేవలం 29 ఓట్లు మాత్రమే వచ్చాయ్. ఈ సారి అభ్యర్థిని బరిలో ఉంచాలా వద్దా అన్న దానిపై కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనలో పడింది. ఓడిపోతే కాంగ్రెస్ కేడర్ లో ఆత్మస్థైర్యం దెబ్బతింటుందన్న భావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో పోటీకి దూరంగా ఉన్నా పార్టీకి ఒరిగేదేమి లేదన్న భావనలో కాంగ్రెస్ ఉన్నట్లు సమాచారం.
ఒక్క నామినేషన్ ధాఖలు కాని పరిస్థితి
ఇప్పటి వరకు ఏ పార్టీ నుంచి నామినేషన్ దాఖలు కాలేదు. ఇంకా అభ్యర్థుల పేర్లు కూడా ఖరారు కాకపోవటంతో ప్రధాన పార్టీల్లో సందడి కనిపించటం లేదు. పార్టీలు ఏ నిర్ణయం తీసుకుంటాయో అనే సందిగ్ధంలో ఉన్నారు పార్టీ శ్రేణులు. అధిష్టానం మదిలో ఏముందో అంతుచిక్కడం లేదంటున్నారు ప్రధాన పార్టీల క్యాడర్. అభ్యర్థుల పేర్లు ఖరారయ్యే వరకు నిజామాబాద్ జిల్లా పొలిటికల్ స్ట్రీట్ లో అంతా సైలెంట్ వాతావరణమే కనిపిస్తోంది.
కవిత వద్దంటే లలితకు ఛాన్స్ !
కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ వద్దనుకుని రాజ్యసభకే మొగ్గుచూపితే ఆకుల లలితకు అవకాశం దక్కవచ్చంటున్నాయ్ పార్టీ వర్గాలు. ఆకుల లలిత కాంగ్రెస్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఉండి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆమెకు ఎమ్మెల్సీ కొనసాగింపు ఇస్తామని టీఆర్ఎస్ అధిష్టానం మాటిచ్చినప్పటికీ ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో వేరే సభ్యులను ఖరారు చేసేశారు. దీంతో లలిత ఆశలకు గండి పడింది. ఆకుల లలితకు అధిష్టానం ఇచ్చిన మాటను నెలబెట్టుకోవాలంటే ఈసారి ఛాన్స్ దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయ్. బలమైన సామాజిక వర్గం డబ్బులున్న అభ్యర్థి కావటంతో లలితవైపు అదిష్టానం మొగ్గు చూపే ఛాన్స్ ఉంటుందని పార్టీ వర్గాల్లో చర్చ.
పార్టీల వారిగా బలా బలాలు
అధికార టీఆర్ఎస్ పార్టీలోనే ఎంపిటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎక్స్ అఫీషియోలు మెజార్టీ గా ఉన్నారు. బీజేపీ 82 మంది ఉన్నారు. ఇక కాంగ్రెస్ లో 20 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 23 వరకు నామినేషన్ల స్వీకరణ, 24వ తేదీన నామినేషన్ల పరిశీలన, 25,26వ తేదీల్లో నామినేషన్ల విత్ డ్రా ఉంటుంది. డిసెంబర్ 10 పోలింగ్, 6 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 14న తుది ఫలితాలు.