Revanth Reddy: మంత్రి కేటీఆర్ పేషీ నుంచే కుట్ర! పేపర్ లీక్‌పై సీబీఐ విచారణకు రేవంత్ రెడ్డి డిమాండ్
సీబీఐ విచారణకు కోర్టు ఆదేశాలిచ్చేలా తాము రేపు కోర్టుకు వెళ్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పరీక్షలకు సంబంధించి పరీక్షా పేపర్లు లీక్ అయిన వ్యవహారంపై విచారణను సీబీఐతో జరిపించాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సీబీఐ విచారణకు కోర్టు ఆదేశాలిచ్చేలా తాము రేపు కోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ (ప్రత్యేక దర్యాప్తు టీమ్) వల్ల ఏ నమ్మకమూ లేదని చెప్పారు. ఆదివారం కామారెడ్డి జిల్లా గాంధారిలో రేవంత్ రెడ్డి ఒకరోజు నిరుద్యోగ నిరహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2015 నుంచి ఇప్పటి వరకు జరిగిన టీఎస్‌పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీలో కొందరికి లబ్ధి జరిగిందని అన్నారు.
సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే, కేటీఆర్ షాడో ముఖ్యమంత్రి అని అన్నారు. కేటీఆర్ కు షాడో ఆయన పీఏ అని, ఈ కథ నడిపింది మొత్తం కేటీఆర్ పీఏ తిరుపతేనని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మంత్రి కేటీఆర్ పేషీనే అన్ని వ్యవహారాలు నడిపిందని, ఏ విచారణ జరిపినా కేటీఆర్ పేషీ నుంచే మూలాలు బయటపడుతున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు.
రాజశేఖర్, కేటీఆర్ పీఏ తిరుపతి ఊర్లు పక్కపక్కనే ఉన్నాయని రేవంత్ రెడ్డి తెలిపారు. కేటీఆర్ పీఏ, రాజశేఖర్ ల సన్నిహితులకు మాత్రమే గ్రూపు 1 లో అత్యధిక మార్కులు వచ్చాయని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. గ్రూప్ 1లో 100కు పైగా మార్కులు వచ్చిన అందరి వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ పీఏ తిరుపతి సూచన మేరకే.. రాజశేఖర్ కు టీఎస్‌పీఎస్సీలో ఉద్యోగం ఇచ్చారని అన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పించి రాజశేఖర్ ను టీఎస్పీఎస్సీకి పంపించారని అన్నారు. అక్కడ పనిచేస్తూ పోటీ పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవుతారని ప్రశ్నించారు. గతంలో టీఎస్పీఎస్సీలో పనిచేస్తూ గ్రూప్ 1 పరీక్ష రాసిన.. మాధురికి ఒకటో ర్యాంక్, రజనీకాంత్ కు 4వ ర్యాంకులు వచ్చాయని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పనిచేసే 20 మందికి పైగా ఉద్యోగులకు పరీక్షలు రాసేందుకు నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) ఇవ్వటం నిజం కాదా అని ప్రశ్నించారు. ఇలాంటి పోటీ పరీక్షలు రాయాలనుకుంటే, టీఎస్పీఎస్సీలో పనిచేసే వారు ఇతర శాఖలకు బదీలీ చేసుకోవాలని అన్నారు. లేదా ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రయత్నించాలని అన్నారు. లేదంటే లాంగ్ లీవ్ పైన వెళ్లాలని అన్నారు. ఇలా చేస్తేనే పోటీ పరీక్షలకు రాసేందుకు అర్హత ఉంటుందని రేవంత్ రెడ్డి చెప్పారు. టీఎస్పీఎస్సీలోనే పనిచేసే 20 మంది పరీక్షలు రాశారని అన్నారు.
ప్రభుత్వాన్నే రద్దు చేయాల్సిన పరిస్థితులు - రేవంత్
నిరుద్యోగుల పాలిట రాష్ట్ర ప్రభుత్వమే పెద్ద సమస్యగా మారిందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పేపర్ లీకేజీలతో పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిందని, ఈ తప్పిదాలకు ప్రభుత్వాన్నే రద్దు చేయాల్సిన పరిస్థితులు దాపురించాయని అన్నారు. ఈ వ్యవహారంపై కేటీఆర్ తనకేం సంబంధం అని అతి తెలివిగా ప్రశ్నిస్తున్నారని ధ్వజమెత్తారు. పేపర్ లీక్ వ్యవహారంలో అరెస్ట్ చేసిన వారిని కస్టడీలోకి తీసుకుని వివరాలు ఎందుకు సేకరించలేదని రేవంత్ ప్రశ్నించారు. గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో 100 మార్కులు దాటినవారిని విచారించాలని పేర్కొన్నారు.