Adilabad Latest News: ఆదిలాబాద్ జిల్లాలో డ్రైవర్ అత్యుత్సాహం- ప్రమాదంలో కొట్టుకుపోయిన ప్రయాణికులు
Adilabad Latest News: ఆదిలాబాద్ జిల్లాలో ఓ ఆటో డ్రైవర్ అత్యుత్సాహంతో ప్రయాణికులు ప్రమాదంలో పడ్డారు. వరదల్లో కొట్టుకుపోయారు. స్థానికులు అప్రమత్తమై వారిని రక్షించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Adilabad Latest News: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో బుధవారం భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇంద్రవెల్లి మండలంలోని పాటగూడ, అందునాయక్ తండా, మర్కాగూడ సమీపంలోని వాగులు ఉప్పొంగడంతో సట్వాజీగుడా వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఇంద్రవెల్లి నుంచి సట్వాజిగూడతోపాటు మర్కాగూడ, బుర్సన్ పటార్, ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చిచ్ దరి, ఖానాపూర్‌కు రహదారులకు అంతరాయం ఏర్పడింది.

ఇంద్రవెల్లి మండలంలోని బుర్సన్ పటాన్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నిఖిల్ ఆలస్యమవుతుందనీ, అత్యుత్సాహంతో వాగు దాటి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఎవరు చెప్పినా అతడు వినకపోవడంతో ఆయన వాగు దాటించి ప్రయత్నించగా.. వాగులో వరద ఉధృతికి ఆటో కొట్టుకుపోయింది. వాగులో ఆటో కొట్టుకుపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ఎనిమిదిమంది నీటిలో మునిగిపోయారు. వెంటనే స్థానికులు అప్రమత్తమై వాగులోకి దూకి వారిని వాగు ఒడ్డునకు చేర్చి కాపాడారు.

ప్రమాద సమయంలో ఆటోలో డ్రైవర్ నిఖిల్‌తోపాటు సట్వాజిగూడకు చెందిన ఇద్దరు, మర్కగూడకు చెందిన ముగ్గురు, బర్గర్‌గూడకు చెందిన ఇద్దరు ఉన్నట్లు చెబుతున్నారు. 8 మందిని కూడా స్థానికులు ఇంద్రవెల్లి ఎస్సై సాయన్న, పంచాయితీ ఈవో సంజీవరావు ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది వారిని బయటకు తీసి కాపాడారు.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు పోలీసులు అప్రమత్తమై ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎత్తకుండా గస్తికాస్తున్నారు. వాగు ప్రవాహం ఉన్న ఈ ప్రాంతంలో రహదారినీ నిలిపివేశారు. అయితే వాగులు వరదలు ప్రవహించే ప్రాంతాల్లో ప్రజలు ఎవరు కూడా అత్యుత్సాహం ప్రదర్శించకూడదని వాగులు దాటే ప్రయత్నం చేయకూడదని పోలీసులు అధికారులు సూచిస్తున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఘటనపై సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలోనూ ఈ సట్వాజీగూడ వాగులో ఆటో కొట్టుకుపోయే వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు జిల్లా యంత్రాంగం ప్రభుత్వం అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది.






















