Nizamabad News: సుద్దులం గ్రామంలో దొంగలను చాకచక్యంగా పట్టుకున్న గ్రామస్థులు
డిచ్ పల్లి మండలం సుద్దులం గ్రామంలో దొంగల బీభత్సం సృష్టించారు. ఆ దొంగలను చాకచక్యంగా పట్టుకొని నిర్బంధించిన గ్రామస్థులు.. అక్కడే విచారించాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
![Nizamabad News: సుద్దులం గ్రామంలో దొంగలను చాకచక్యంగా పట్టుకున్న గ్రామస్థులు Nizamabad Women blocking police vehicle to investigate the thieves in the village itself Nizamabad News: సుద్దులం గ్రామంలో దొంగలను చాకచక్యంగా పట్టుకున్న గ్రామస్థులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/28/5a7c75eff9ad6d38339b8a4051b95189_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం సుద్దులం గ్రామంలో గత కొన్ని రోజులుగా వరుస చోరీలు భయపెడుతున్నయి. ఏం చేయాలో అర్థం కాని గ్రామస్థులు ఓ ప్లాన్ వేశారు. వాళ్ల ప్లాన్ వర్కౌట్ అయింది. నిన్న రాత్రి దొంగలు దొరికారు. వెంటనే వారిని గ్రామంలో బంధించారు.
దొంగలు దొరికారని పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. సుద్దులం గ్రామ ప్రజల సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే వచ్చి దొంగలను స్టేషన్ తరలించేందుకు ప్రయత్నించారు. అక్కడే గ్రామస్థులు అడ్డుపడ్డారు. వాళ్లను స్టేషన్‌కు తరలించడానికి వీల్లేదని పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
తాము పట్టుకున్న దొంగలను గ్రామంలోనే విచారించాలంటూ డిమాండ్ చేశారు సుద్దులం గ్రామ ప్రజలు. గ్రామంలో గత నెల నుంచి సుమారుగా 12 ఇళ్లల్లో చోరీలు జరిగాయని తెలిపారు. ప్రజల ముందు విచారణ చేపట్టాలని, పోలీస్ జీపును స్థానిక మహిళలు అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.
దొంగలను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ మహిళలు పోలీస్ వాహనానికి అడ్డుగా కూర్చుని ఆందోళన చేశారు. గ్రామంలో ఉన్న సీసీ కెమెరా డాటాను గుర్తుతెలియని వ్యక్తులు తొలగించారని మహిళలు ఆరోపించారు. కొన్ని రోజులుగా వరుసగా చోరీలు జరుతుండటంపై గ్రామస్థులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని కొందరు వ్యక్తుల ప్రమేయంతోనే చోరీలు జరుగుతున్నాయని డౌట్ పడుతున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటివి జరగలేదన్నారు.
సిసి కెమెరాల ఫుటేజ్ ఎలా డిలీట్ చేస్తారని గ్రామంలోని మహిళలు ప్రశ్నిస్తున్నారు. గ్రామంలోని వారే ఇలా దొంగతనాలు చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అందుకే గ్రామ ప్రజల సమక్షంలోనే విచారణ జరిపిస్తే అసలు దొంగలు ఎవరనే విషయం బయట పడుతుందని మహిళలు పట్టుపట్టారు. అయితే గ్రామంలోని సర్పంచ్, ఇతర పెద్దలు సముదాయించటంతో మహిళలు వెనుదిరిగారు. నిందితులను పోలీసులు స్టేషన్‌కు తరలించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)