Nizamabad Politics: మునుగోడు రిజల్ట్‌తో టీఆర్ఎస్‌లో జోష్ - గూలాబీ దళాన్ని ఢీకొట్టేందుకు బీజేపీ, కాంగ్రెస్ వ్యూహాలు
మంత్రి ప్రశాంత్ రెడ్డి మూడు రోజులుగా నియొకవర్గంలోనే ఉంటూ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత సైతం వీలు చేసుకుని నిజామాబాద్ వస్తూ కార్యకర్తలను కలుస్తున్నారు.
తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాయి ప్రధాన పార్టీలు. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత జిల్లాపై ఫోకస్ పెడుతున్నారు అన్ని పార్టీల కీలక నేతలు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాపై దృష్టి సారించారు. అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారంపై నాయకులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక నుంచి నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డిసైడ్ అయ్యారు. తమ నియోజకవర్గాల్లో పర్యటనలపై ఎమ్మెల్యేలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే బోధన్ ఎమ్మెల్యే షకీల్ మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమంతో గ్రామాల్లో తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి మూడు రోజులుగా నియొకవర్గంలోనే ఉంటూ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత సైతం వీలు చేసుకుని నిజామాబాద్ వస్తూ కార్యకర్తలను కలుస్తున్నారు. మునుగోడు బైపోల్ రిజల్ట్ జోష్ తో టీఆరెస్ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపైంది. సిట్టింగ్ నేతలు సీట్లను కాపాడుకునేందుకు చూస్తుండగా, వచ్చే ఎన్నికల్లో తాము ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలని మరికొందరు నేతలు గట్టిగా ప్రయత్నాలు మొదలుపెట్టేశారు.
ఇక బీజేపీ నేతలు సైతం అలర్ట్ అవుతున్నారు. మునుగోడు బైపోల్ రిజల్ట్ నిరాశ మిగిల్చినా నల్గొండ లాంటి జిల్లాలో టఫ్ ఫైట్ ఇచ్చామన్న ధీమాతో ఉన్నారు. టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లాలో మూడు ఉప ఎన్నికల్లో నెగ్గి, అన్ని స్థానాలు కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేసింది. ఇక నిజామాబాద్ జిల్లాలో పార్టీకి మరింత బలం చేకూరేలా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. జిల్లాలో గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టి బీజేపీ శ్రేణుల్లో జోష్ పెంచేందుకు రెడీ అవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈసారి మెజార్టీ ఎమ్మెల్యే సీట్లు కైవసం చేసుకునేందుకు పక్కా ప్లాన్ తో వస్తున్నారు. ఇక ప్రస్తుతం నియోజకవర్గాల్లో టికెట్ ఆశిస్తున్న నేతలు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రజా సమస్యలను వెలికి తీసేందుకు రెడీ అవుతున్నారు. అటు జిల్లాలో బలమైన నాయకులను పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. జిల్లా బీజేపీ నాయకులు ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. ఇక ప్రజల్లో ఉండేందుకు రెడీ అవుతున్నారు.
రాహుల్ జోడో యాత్రతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఊపు...
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని జుక్కల్ నియోజక వర్గంలో జరిగిన రాహుల్ గాంధీ జోడో యాత్రతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. రాహుల్ గాంధీ సభకు సైతం భారీగా జనాలు రావటంతో హస్తం పార్టీ నేతలు ఉత్సాహంగా ఉన్నారు. ఇక ఇదే ఊపులో నియోజకవర్గాల్లో తిరిగేందుకు సన్నద్ధమవుతున్నారు. ప్రజా సమస్యలను ఎత్తి చూపుతూ... నియోజకవర్గాల్లో పర్యటనలు చేసేందుకు ఆ పార్టీ నేతలు రెడీ అవుతున్నారు. జిల్లా కాంగ్రెస్ లో సీనియర్ నేతలు ఇక జిల్లాలో పర్యటించేందుకు రూట్ మ్యాప్ వేసుకుంటునట్లు తెలుస్తోంది. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న నేతలు ప్రజాల్లోనే ఉండేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కిందిస్థాయి నేతలతో టచ్ లో ఉంటున్నారు. జిల్లాలో పట్టు సాధించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నాయి.