Nizamabad News: నిజామాబాద్ పోలీసుల సెల్ఫ్ డిఫెన్స్, గాల్లోకి కాల్పులు - అయినా పారిపోయిన దొంగలు
రాజస్థాన్‌కు చెందిన దొంగల ముఠాను పట్టుకునేందుకు పోలీసులు ముందస్తుగా వేసిన ప్లాన్ లో భాగంగా ఇంత ఎపిసోడ్ జరిగింది.

నిజామాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా పోలీసులపైనే దాడికి తెగబడ్డారు. దీంతో పోలీసులు ఆత్మ రక్షణ కోసం నేడు (మే 29) దొంగలపై కాల్పులు జరిపాల్సి వచ్చింది. నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి మండలంలోని జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. అక్కడే దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే వారు పారిపోతుండగా దొంగలపై కాల్పులు జరిపారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన దొంగల ముఠాను పట్టుకునేందుకు పోలీసులు ముందస్తుగా వేసిన ప్లాన్ లో భాగంగా ఇంత ఎపిసోడ్ జరిగింది. ఆ దొంగల ముఠా.. పోలీసుల కారును ఢీకొట్టి పారిపోయింది. దీంతో, వారిని పట్టుకునేందుకు పోలీసులు రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. కాగా, ఈ దొంగల ముఠా.. జిల్లాలో ట్రాన్స్‌ఫార్మర్‌లోని కాపర్ వైర్లను దొంగలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే దొంగలను పట్టుకునేందుకు పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు వేగవంతం చేశారు.
ముప్కాల్ మండలంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ కాయిల్ చోరీ చేసిన అంతర్‌రాష్ట్ర ముఠా 44వ జాతీయ రహదారి మీదుగా వెళ్తోందని పోలీసులకు ఆదివారం అర్ధరాత్రి సమాచారం వచ్చింది. దీంతో ఇందల్వాయి ఎస్సై నరేశ్, దర్పల్లి ఎస్సై వంశీకృష్ణారెడ్డి ఇందల్వాయి టోల్‌గేటు వద్ద చెక్ పోస్టు ఏర్పాటు చేసి వచ్చిపోయే వాహనాలను తనిఖీ చేశారు.
ఈ క్రమంలో దొంగల ముఠా వారికి చిక్కింది. దొంగలు అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో దొంగలు తమ కారుతో దర్పల్లి ఎస్సై వంశీకృష్ణారెడ్డి వాహనాన్ని ఢీకొట్టారు. అనంతరం ఎస్సైను సైతం ఢీకొట్టేందుకు రావడంతో ఆత్మరక్షణ కోసం ఆయన రెండుసార్లు గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో దుండగులు పక్కవైపు నుంచి పారిపోయారని ఇందల్వాయి ఎస్సై నరేశ్ తెలిపారు. అంతర్రాష్ట్ర ముఠాపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు.





















