Nizamabad: కొడుకు కోసం స్కూటీపై 1,400 కి.మీ వెళ్లిన ఈ తల్లి గుర్తుందా? ఉక్రెయిన్ యుద్ధంతో మళ్లీ కన్నపేగులో అలజడి
Bodhan Mother: బోధన్ నుంచి నెల్లూరుకు కొడుకు కోసం 700 కిలో మీటర్లు స్కూటీపై వెళ్లిన ఈ తల్లి మీకు గుర్తుందా? ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఇప్పుడు మళ్లీ ఆమె గుండెల్లో అలజడి పుడుతోంది.
కన్న కొడుకు కోసం 1,400 కిలో మీటర్లు ఒక స్కూటీపై ఒంటరిగా వెళ్లిన తల్లి గుర్తుందా? కరోనా మన దేశంలో రాగానే కఠినమైన లాక్ డౌన్ విధించిన సమయంలో ఈ ఘటన జరిగింది. స్నేహితుడి పెళ్లికి కుమారుడు దూర ప్రాంతం వెళ్లగా సరిగ్గా అప్పుడే లాక్ డౌన్ విధించారు. అతని భద్రతపై ఆందోళన చెందిన ఆ మాతృమూర్తి.. ఎంతో ధైర్యంతో ఒంటరిగా ఓ సాధారణ స్కూటీపై 1400 కిలో మీటర్లు ప్రయాణించింది. కుమారుడిని స్కూటీపై ఎక్కించుకొని క్షేమంగా ఇంటికి తెచ్చుకుంది. ఈ పరిణామం అప్పట్లో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. తల్లి ప్రేమను ఈమె మరోసారి చాటి చెప్పిదంటూ అభినందనలు వెల్లువెత్తాయి.
అయితే, ఇప్పుడు ఆ తల్లే తన కొడుకు కోసం మరోసారి ఆందోళన చెందాల్సిన పరిస్థితి తలెత్తింది. కుమారుడు ప్రస్తుతం మెడిసిన్ చదువుతూ ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయాడు. దీంతో తన కుమారుడిని ఎలాగైనా సొంతూరికి రప్పించాలని ఆమె వేడుకుంటోంది.
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణానికి చెందిన రజియా బేగం ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. ఈమె కుమారుడు నిజాముద్దీన్ అమన్ ప్రస్తుతం ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఉక్రెయిన్‌లోని సుమీ నగరంలో ఉంటున్నాడు. అయితే, ఈ సుమీ సిటీ రష్యా సరిహద్దుకు బాగా దగ్గరగా ఉంది. అక్కడ ఉన్న సుమీ మెడికల్ యూనివర్సిటీలో చాలా మంది భారత విద్యార్థులు ఉన్నారు. ప్రస్తుతం అక్కడ యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ తల్లి రజియా బేగం తన కొడుకు భద్రత కోసం ప్రార్థిస్తున్నారు. ఎలాగైనా భారత్‌కు రప్పించాలని ప్రధాని నరేంద్రమోదీని, సీఎం కేసీఆర్, మంత్రి మహమూద్ అలీని వేడుకుంటున్నారు.
ప్రస్తుతం నిజాముద్దీన్ అమన్ అక్కడ బంకర్లలో తలదాచుకున్నట్లుగా తల్లి రజియా బేగం చెబుతున్నారు. తనతో ఫోన్‌లో తరచూ మాట్లాడుతున్నట్లుగా చెప్పారు. అతను ఉంటున్న ప్రాంతంతో రవాణా వ్యవస్థ పూర్తిగా తెగిపోయిందని రజియా వెల్లడించారు.
2020లో ప్రమాదకర ప్రయాణం
కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో లాక్ డౌన్ విధించినప్పుడు ఎక్కడికక్కడ అన్ని సదుపాయాలు స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. బస్సులు, రైళ్లు, కనీసం ప్రైవేటు వాహనాలను సైతం రోడ్లపైకి రానివ్వకపోవడంతో ఎక్కడివారు అక్కడే చిక్కుకుపోయారు. అలా 19 ఏళ్ల తన కొడుకు నెల్లూరుకు వెళ్లి లాక్ డౌన్‌లో అక్కడే చిక్కుకుపోయాడు. అతని కోసం ఆరాటపడ్డ తల్లి ఏకంగా తెలంగాణలోని నిజామాబాబ్ జిల్లా బోధన్ నుంచి ఏపీలోని నెల్లూరు వరకూ ఏకంగా 700 కిలో మీటర్లు స్కూటీపై ఒంటరిగా ప్రయాణించారు. కుమారుడ్ని చేరుకొని మళ్లీ స్కూటీపైనే బోధన్‌కు తిరిగొచ్చారు. ఈ విషయం బయటికి రావడంతో ఆ మాతృమూర్తి గొప్పతనం దేశ వ్యాప్తంగా సంచలనం అయింది. తాజాగా ఆమె మళ్లీ తన కొడుకు ఉక్రెయిన్‌లో చిక్కుకోవడంతో తల్లడిల్లుతున్నారు.