Kanti Velugu: జనవరి 18న తెలంగాణలో కంటి వెలుగు ప్రారంభం, 18 ఏళ్లు దాటిన వారికి పరీక్షలు
Kanti Velugu In Telangana: రాష్ట్ర ప్రభుత్వం జనవరి 18వ తేదీ నుంచి చేపడుతున్న కార్యక్రమం కంటి వెలుగు. ఈ కార్యక్రమాన్ని సమిష్టి కృషితో విజయవంతం చేద్దామని ప్రజాప్రతినిధులు, అధికారులు పిలుపునిచ్చారు.
Kanti Velugu In Telangana: తెలంగాణలో దృష్టి లోపాలను దూరం చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం జనవరి 18వ తేదీ నుంచి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమం కంటి వెలుగు. ఈ కార్యక్రమాన్ని సమిష్టి కృషితో విజయవంతం చేద్దామని ప్రజాప్రతినిధులు, అధికారులు పిలుపునిచ్చారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో బుధవారం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి నేతృత్వంలో కంటి వెలుగు కార్యక్రమం పై జిల్లా స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
దేశంలోనే మరెక్కడా లేనివిధంగా రాష్ట్రంలో కార్యక్రమాలు
ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ, దేశంలోనే మరెక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో వినూత్న ఆలోచనలతో ఎన్నో బృహత్తర కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు సుఖ, సంతోషాలతో ఉన్నప్పుడే బంగారు తెలంగాణ లక్ష్యం నెరవేరుతుందనే ప్రగాఢ విశ్వాసంతో అన్ని కులాలు, అన్ని మతాల వారి కోసం విస్తృత స్థాయిలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దార్శనికతతో ఇక్కడ అమలు చేస్తున్న కార్యక్రమాలు యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు తెలంగాణ పాలనను కొనియాడుతున్నారని వారు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని చెప్పారు. కంటి వెలుగు ప్రాధాన్యతను గుర్తిస్తూ, ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగస్వాములై విజయవంతం చేయాలని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కలెక్టర్ నారాయణరెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్
కంటి వెలుగు ముఖ్య ఉద్దేశ్యం గురించి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన ఆవశ్యకత గురించి కలెక్టర్ నారాయణరెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. జిల్లాలో 18 సంవత్సరాలు పైబడిన 12,32,872 మందికి ఈ కార్యక్రమం ద్వారా నేత్ర పరీక్షలు నిర్వహించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డులలో కంటి వెలుగు శిబిరాలను నిర్వహించేందుకు వీలుగా 70 బృందాలను ఏర్పాటు చేశామని, ఒక్కో బృందంలో ఎనిమిది మంది సభ్యులు ఉంటారని, కంటి పరీక్షలు జరిపి అవసరమైన వారికి అప్పటికప్పుడు ఈ శిబరాల్లోనే మందులు, కంటి అద్దాలు అందించడం జరుగుతుందన్నారు.
ఇప్పటికే జిల్లాకు 61,200 అద్దాలు చేరుకున్నాయని వివరించారు. ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ అవసరమైన వారి వివరాలను ఆన్ లైన్ లో పొందుపర్చడం జరుగుతుందని, పక్షం రోజుల్లోపు వారికి కంటి అద్దాలు సమకూరుస్తామని తెలిపారు. శరీర అవయవాలలో అతి ముఖ్యమైనవి నేత్రాలే అయినందున కంటి సమస్యలను ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయకుండా పద్దెనిమిదేళ్లు పైబడిన వారందరూ తప్పనిసరిగా కంటి వెలుగు శిబిరాల్లో నేత్ర పరీక్షలు జరిపించుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. ఈ దిశగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లోనూ విస్తృత ప్రచారం నిర్వహించాలని కలెక్టర్ కోరారు. ముఖ్యంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పరస్పర సమన్వయంతో సమిష్టిగా కృషి చేస్తూ జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమాన్ని శతశాతం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు చెందిన అధికారులు, సిబ్బంది శిబిరాల నిర్వహణలో కీలకపాత్ర పోషించాలన్నారు. శిబిరాలకు అవసరమైన కుర్చీలు, టేబుళ్లు, షామియానాలు, తాగు నీరు, పారిశుధ్యం వంటి వాటి ఏర్పాటుకు స్థానిక ప్రజాప్రతినిధులు సైతం తోడ్పాటును అందించాలని, వైద్య బృందాలు వారికి కేటాయించిన కార్యస్థానాల్లో స్థానికంగా బస చేసేందుకు వీలుగా సహకారం అందించాలని కలెక్టర్ కోరారు. ఆయా గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా రూపొందించిన నిర్ణీత ప్రణాళికను అనుసరిస్తూ కంటివెలుగు శిబిరాలకు క్రమ పద్దతిలో ప్రజలను తరలించేలా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కంటి వెలుగు శిబిరాల నిర్వహణపై పరిపూర్ణ అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన డెమో ప్రదర్శనను ప్రజాప్రతినిధులు తిలకించారు. కంటి వెలుగు బ్రోచర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు.