పొరపాట్లకు తావులేకుండా గ్రూప్-1 ప్రిలిమ్స్- చీఫ్ సూపరింటెండెంట్‌లతో కలెక్టర్ సమీక్ష
16 వ తేదీన ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాన్నం ఒంటి గంట వరకు కొనసాగే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు జిల్లాలో 12,858 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు.
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్‌పీఎస్సీ ద్వారా ఈ నెల 16 వ తేదీన జరుగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష సందర్భంగా ఏ చిన్న పొరపాటుకు సైతం తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని నిజామాబాద్ కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఏర్పాట్లలో భాగంగా సోమవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్‌హాల్‌లో చీఫ్ సూపరింటెండెంట్‌లతో కలెక్టర్ సమీక్ష జరిపారు.
16 వ తేదీన ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాన్నం ఒంటి గంట వరకు కొనసాగే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు జిల్లాలో 12,858 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు. అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా నిజామాబాద్‌లో 40 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, అభ్యర్థులు టీఎస్పీఎస్సీ వెబ్ సైట్ ద్వారా హాల్‌టికెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా నెలకొల్పిన కంట్రోల్ రూమ్ 08462 - 220183 నెంబర్‌కు ఫోన్ చేయవచ్చని తెలిపారు. టీఎస్‌పీఎస్‌సీ పరీక్షలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నందున ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాలని, నిబంధనలన్నీ తూచా తప్పకుండా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత చీఫ్ సూపరింటెండెంట్లదేనని స్పష్టం చేశారు.
ప్రతి పరీక్షా కేంద్రంలోనూ డ్యూయల్ డెస్క్ టేబుళ్లు, కుర్చీలు తప్పనిసరిగా ఉండాలని, పరీక్షా గదుల్లో తగినంత వెలుతురు, సరిపడా లైటింగ్, తాగునీరు, టాయిలెట్ ఇత్యాది వసతులు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి కేంద్రంలో ఏఎన్‌ఎం, ఆశా వర్కర్‌ను నియమించాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శనను ఆదేశించారు. పరీక్షా సమయాలకు అనుగుణంగా వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు నడిచేలా చర్యలు తీసుకోవాలని ఆర్.ఎం ఉషాదేవికి సూచించారు.
పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ఈ నెల 15 , 16 తేదీలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు చేపట్టాలని ట్రాన్స్కో ఎస్‌ఈ రవీందర్‌ను ఆదేశించారు. ముఖ్యంగా పోలీస్ శాఖ క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ, పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్‌లను మూసి ఉంచేలా చర్యలు చేపట్టాలని అన్నారు. నిర్వహణాపరమైన లోటుపాట్లతో అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా ముందుగానే అన్ని సదుపాయాలను సరిచూసుకోవాలని అన్నారు. ప్రతి 24 మంది అభ్యర్థులకు ఒక ఇన్విజిలేటర్ చొప్పున నియమించుకుని వారికి పరీక్షల నిర్వహణ, నిబంధనలపై స్పష్టమైన అవగాహన కలిగేలా శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.
పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించకూడదని, ఇన్విజిలేటర్లకు కూడా అనుమతి లేదని స్పష్టం చేశారు. ఒకవేళ అభ్యర్థులు ఎవరైనా వెంట తీసుకువస్తే, పరీక్షా హాల్ బయటనే స్వాధీనం చేసుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో సి.సి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, సి.సి కెమెరా రికార్డింగ్ మధ్యే విధిగా ప్రశ్నపత్రాల బండిల్ సీళ్లు విప్పాలని ఆదేశించారు. ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక సిట్టింగ్ స్క్వాడ్, 7 కేంద్రాలకు ఒక ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను నియమిస్తున్నామని తెలిపారు.
ఎలాంటి అపశ్రుతులు, అపవాదులకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని, ప్రతి చిన్న అంశానికి సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకుంటూ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని చీఫ్ సూపరింటెండెంట్లకు హితవు పలికారు. కాగా, అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలను ఒకరోజు ముందే చూసుకోవాలని, పరీక్షా సమయానికి కనీసం రెండు గంటల ముందు కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ సూచించారు.