Nizambad Rape: మైనర్ బాలిక అత్యాచారం కేసులో కొత్త ట్విస్ట్, నిందితుల్లో ఆయన కొడుకే!
Nizamabad: కామారెడ్డిలో పనిచేస్తున్న ఓ ఏఎస్సై కొడుకు రోహితే ప్రధాన నిందితుడిగా ఉన్నాడని ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. ఈ కేసులో నిందితుణ్ని తప్పించే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
నిజామాబాద్ నగరంలో మైనర్ బాలిక అత్యాచారం కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. వినాయక్ నగర్ లో 15 ఏళ్ల మైనర్ బాలికపై తరుచూ ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో కామారెడ్డిలో పనిచేస్తున్న ఓ ఏఎస్సై కొడుకు రోహితే ప్రధాన నిందితుడిగా ఉన్నాడని ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. ఈ కేసులో నిందితుణ్ని తప్పించే ప్రయత్నం చేసినప్పటికీ, పోలీసులు ఈ ఘటనను సీరియస్ గా తీసుకుని కేసు నమోదు చేసి ఏఎస్సై కొడుకుతో పాటు మరో నిందితుడిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు చెందిన వివరాలు ఇలా ఉన్నాయి.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ వినాయక్ నగరులోని ఒక అపార్ట్మెంటులో 2017 నుంచి మైనర్ బాలికపై రోహిత్ అనే వ్యక్తి తరచూ అత్యాచారానికి పాల్పడ్డట్లు తెలిసింది. అత్యాచారానికి పాల్పడుతున్న సమయంలో ఫోటోలు తీసి, రోహిత్ తన ఫోనులో బంధించి పెట్టాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించి తరచూ అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఇదిలా ఉండగా 2022లో వినాయక్ నగర్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నివాసముండే భానుప్రసాద్ గౌడ్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఓ మైనర్ బాలికతో పరిచయం పెంచుకొని, ఒక నెల తర్వాత మైనర్ బాలికకు ప్రేమిస్తున్నానని మెసేజ్ చేశారు. అనంతరం పరిచయం కాస్త సన్నిహితంగా మారడంతో, బస్వాలక్ష్మి నర్సయ్య గార్డెన్ సమీపంలో బలవంతంగా అత్యాచారానికి పాల్పడుతూ, నగ్న౦గా ఉన్న ఫొటోలు తీసుకొని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. దీంతో దిక్కుతోచని ఆ మైనర్ హత్యాచార వేధింపులు భరించలేక వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. దీంతో తల్లిదండ్రులు ఈ నెల 6 న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. పోక్సో చట్టం కింద నిందితులైన రోహిత్, భాను ప్రసాద్ గౌడ్ లను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు పంపారు.