Nirmal Rains Updates: నీట మునిగిన బాసర.. కలెక్టర్ ఆదేశాలతో 40 మందిని కాపాడిన SDRF టీమ్
Basara Rains | ఎగువన మహారాష్ట్రతో పాటు నిర్మల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు బాసర నీట మునిగింది. వరద నీటిలో చిక్కుకున్న 40 మందిని SDRF టీమ్ కాపాడింది.

Adilabad Rains News | బాసర: నిర్మల్ జిల్లా బాసరలో గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. గత నాలుగు రోజులుగా ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్రతో పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురయడంతో పది లక్షల క్యూసెక్కుల నీరు రెండు మూడు రోజుల్లో బాసరకు చేరనుంది. ప్రస్తుతం 5 లక్షల క్యూసెక్కుల నీరు బాసరకు చేరిందని అధికారులు అంచనా వేశారు. మహారాష్ట్రలోని బాబ్లీ విష్ణుపురి గైక్వాడ్ ఫైటన్ డ్యాములు భారీగా నీటిని విడుదల చేయడంతో 10 క్యూసెక్కుల నీరు బాసర దిగువ ప్రాంతమైన పోచంపాడు డ్యామ్ కు ఇన్ ఫ్లో వస్తుందని అధికారులు అంచనా వేశారు.

బాసర ఆలయానికి వచ్చే దారి జలమయం
బాసరలోని ప్రధాన రహదారులైన గోదావరి నుండి ఆలయానికి వచ్చే రహదారి జలమయం అయ్యింది. అదేవిధంగా గోదావరి మీదుగా ఆలయానికి చేరే రహదారి కూడా జలమయము అయ్యింది. ఆలయం నుండి గ్రామంలోకి వచ్చే రహదారి కూడా లాడ్జిలను సత్రాలను చేరుకోకుండా ఉండేవిధంగా జలమయము అయ్యింది. బాసరలోని పలు కాలనీలు నీట మునిగాయి. హరిహర కాటేజెస్, దీక్షా లాడ్జి వడ్డేపల్లి లాడ్జి మొదటి అంతస్తు వరకు నీట మునిగాయి. వెంకటేశ్వర కాలనీ, అక్షర కాలనీ జలమయం అయ్యాయి. వేద పాఠశాలలోకి నీటి మట్టం పెరుగుతుందని వేద పాఠశాల నిర్వాహకులు తెలిపారు. ఈ నీటి ఉధృతిని గమనించి బాసరకు వచ్చే యాత్రికులు నాలుగు రోజుల వరకు రావద్దని అధికారులు జారీ చేశారు.

గోదావరి వరద ముప్పుతో ప్రమాద హెచ్చరిక జారీ
బాసర గ్రామంతో పాటు బాసర మండల కేంద్రంలోని ఓని కౌటా, కిరుగుల్, సూరల్లీ, సాలాపూర్, తాక్లి, లాబ్ది, దొడపూర్ గ్రామాలకు మొదటి ప్రమాద హెచ్చరిక, రెండవ ప్రమాద హెచ్చరిక, మూడవ ప్రమాద హెచ్చరికలతో పాటు అన్ని ప్రమాద హెచ్చరికలు జారీచేసినట్టు అధికారులు తెలిపారు. ఇంకా ఎవరికైనా సహాయ సహకారాలు అందాల్సి ఉంటే సమీప పోలీస్ స్టేషన్ ని సంప్రదించాలని అధికారులు తెలిపారు. బాసర లో కురుస్తున్న అతి భారీ వర్షాలకు మూడు లాడ్జిల్లో ఉన్న సుమారు 11 కుటుంబాలు వరదల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే.
ఉదయం జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు స్పందించిన జిల్లా పోలీసు రెవెన్యూ శాఖల అధికారులు.. ఎస్ డి ఆర్ ఎఫ్ సెకండ్ బెటాలిటన్ యాపల్ గూడ కు చెందిన 40 మంది సిబ్బంది వారిని కాపాడారు. దీంతో బాధితులు జిల్లా పోలీసు యంత్రాంగానికి, రెవెన్యూ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.





















