Nirmal Master Plan: నిర్మల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాల్సిందే! బీజేపీ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు నేడు ఈటల రాక
Nirmal Master Plan Latest News: మాస్టర్ ప్లాన్ తో నిర్మల్ పట్టణ ప్రజలను నిండా ముంచుతున్నారని, బీఆర్ఎస్ నేతలు తమ ఆస్తుల విలువ పెంచుకుంటున్నారని బీజేపీ సహా కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.
Nirmal Master Plan Latest News: మాస్టర్ ప్లాన్ తో నిర్మల్ పట్టణ ప్రజలను నిండా ముంచుతున్నారని, బీఆర్ఎస్ నేతలు తమ ఆస్తుల విలువ పెంచుకుంటున్నారని బీజేపీ సహా కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. గ్రీన్ జోన్ లో ఉన్న పంట పొలాలను ఇండస్ట్రియల్ జోన్ లోకి మార్చి రైతులను మోసం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో మహేశ్వర్ రెడ్డి సహా బీజేపీ నేతల్ని పోలీసులు గృహనిర్బంధం చేయడంతో కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.
నిర్మల్ లో నూతన మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత రెండు రోజులుగా బిజెపి ఆధ్వర్యంలో నిరసన చేపడుతున్నారు. దీంట్లో భాగంగానే బిజెపి నాయకులు జాతీయ రహదారి దిగ్భందనానికి పిలుపునిచ్చారు. శాంతియుతంగా నిరసన చేపట్టేందుకు వెళుతున్న మహేశ్వర్ రెడ్డిని పట్టణంలో 30 యాక్ట్ అమలులో ఉండడంతో ఎలాంటి నిరసన ప్రదర్శనలకు, ఆందోళనలకు అనుమతి లేదని ఇంటి వద్దే అడ్డుకున్నారు. దీంతో బిజెపి నాయకులకు, పోలీసులకు కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే పోలీసుల అక్రమ అరెస్టును నిరసిస్తూ ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్షకు బైఠాయించారు.
మంత్రి అల్లోల, ఆయన కుటుంబానికి వేలకోట్లు
ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రైతుల పొట్ట కొట్టే విధంగా మాస్టర్ ప్లాన్ ను రూపొందించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మాస్టర్ ప్లాన్ తో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తో పాటు ఆయన కుటుంబ సభ్యులు వేలకోట్ల రూపాయలు సంపాదించేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు చేపడితే పోలీసులతో అడ్డుకోవడం సరికాదన్నారు. మాస్టర్ ప్లాన్ రద్దు అయ్యే వరకు తమ పోరాటాలు ఆపేది లేదన్నారు. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి నివాసం ముందు పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షకు మద్దతు తెలిపెందుకు గురువారం హుజూరాబాద్ ఎమ్మెల్యే బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ రానున్నారు.
బీజేపీ నేతలు ఆమరణ నిరాహార దీక్షా స్థలం (పోలీస్ దిగ్భంధంలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇంటి వద్ద దీక్ష)లోనే బుధవారం రాత్రి నిద్రించారు. నిర్మల్ మాస్టర్ ప్లాన్ ను ప్రభుత్వం రద్దు చేసే వరకు పోరాటం ఆగదన్నారు. ఇండస్ట్రియల్ జోన్ ను కమర్షియల్ రెసిడెన్షియల్ జోన్ గా మార్చడానికి ఉండే నియమ నిబంధనల్ని బీఆర్ఎస్ నేతలు తుంగలో తొక్కి, ప్రభుత్వ పెద్దలే భారీ కుంభకోణానికి పాల్పడ్డారని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి విమర్శలు గుప్పిస్తున్నారు. గ్రీన్ జోన్‌లో ఉండే చెరువులు, పచ్చని పంట పొలాలు, చెట్లు ఉన్నప్ప టీకీ వాటిని పూర్తిగా ఇండస్ట్రియల్ జోన్ పరిధిలోకి తెచ్చే ప్రయత్నం జరుగుతుండటంతో రైతులకు నష్టం జరుగుతోందని.. కనుక నిర్మల్ మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేశారు.
Also Read: Nirmal News : నిర్మల్‌లో మాస్టర్ ప్లాన్ రగడ - అక్రమాలు జరిగాయని విపక్షాల ఉద్యమాలు !