(Source: ECI/ABP News/ABP Majha)
Rajagopal Reddy: ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్దంగా ఉండాలి - కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
Komatireddy Rajagopal Reddy: మునుగోడు ఎన్నిక ఒక యుద్ధంలా కొనసాగింది ఆ యుద్ధం కేసీఆర్ కు, బీజేపీ కార్యకర్తలకు మధ్య జరిగిందన్నారు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
Komatireddy Rajagopal Reddy On Early Election In Telangana: తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కునేందుకు కార్యకర్తలు సంసిద్ధంగా ఉండాలని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన శక్తి కేంద్రాల సభల నిర్వహణపై బిజెపి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మునుగోడు మాజీ ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. బిజెపి పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు. గ్రామ గ్రామాన బిజెపి గురించి ప్రచారం నిర్వహించాలన్నారు. కేంద్రం తెలంగాణ రాష్ట్రంపైన అందులోనూ, అక్షర క్రమంలో మొదటిదైన ఆదిలాబాద్ జిల్లాపై స్పెషల్ ఫోకస్ చేసిందన్నారు. మునుగోడులో బీఆర్ఎస్ సాంకేతికంగా గెలిచినా నైతికంగా బీజేపీ గెలిచిందన్నారు. సీఎం కేసీఆర్ పాలనా న్యాయ బద్ధంగా జరిగి ఉంటే ఎన్నికల్లో గెలవడానికి వందల కోట్లు ఖర్చుపెట్టే అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. గ్రామానికొక శాసన సభ్యుడు ఒక మంత్రి ఎందుకొచ్చారు ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్నారు.
కేసీఆర్ కు, బీజేపీ కార్యకర్తలకు మధ్య యుద్ధం
మునుగోడు ఎన్నిక ఒక యుద్ధంలా కొనసాగింది ఆ యుద్ధం కేసీఆర్ కు, బీజేపీ కార్యకర్తలకు మధ్య జరిగింది. ఒకవైపు వందల కోట్ల రూపాయలు, అధికార దుర్వినియోగం, దౌర్జన్యం, అధికార పార్టీకి కొమ్ము కాసిన పోలీస్ వ్యవస్థ ఉంటె మరో వైపు మరోవైపు కేవలం బీజేపీ కార్యకర్తలున్నారు. ఇది బీజేపీ నైతిక గెలుపు కార్యకర్తలు ఈ ఓటమితో మరింత దైర్యాన్ని పెంచుకోవాలన్నారు రాజగోపాల్ రెడ్డి. ప్రతి కార్యకర్త తన పరిధిలో బూత్ స్థాయిలో మండల స్థాయిలో స్ట్రీట్ కార్నెర్ మీటింగులు పెట్టి ప్రజలను చైతన్య పరచాలని అన్నారు. తెలంగాణా ఉద్యమ సమయంలో జరిగిన పోరాటాలను గురించి చర్చించండి, ఆ సమయంలో పోరాటంలో ఎవరున్నారనే విషయాలు చర్చించండి కెసిఆర్ చేస్తున్న మోసాలను చర్చించండి అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఎన్నికలకు సిద్దంగా ఉండాలని, పార్టీ అదిష్టానం ఆదేశిస్తే ఆదిలాబాద్ కు ఇంచార్జిగా వచ్చి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పదికి పది స్థానాలను గెలిచే దిశగా కృషి చేస్తానన్నారు. ఆ దిశగా అందరు పార్టీ కోసం పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చిట్యాల సుహాసిని రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి అల్జాపూర్ శ్రీనివాస్, మాజీ ఎంపీ రాథోడ్ రమేష్, నాయకులు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ రాజరిక పరిపాలన
తెలంగాణలో సీఎం కేసీఆర్ రాజరిక పరిపాలన నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ అన్నారు. తామే దేవుళ్లం, తాము చేసిందే వేదం, శాసనం అన్నట్టుగా బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు. రాజ్యాంగాన్ని, రాజ్యాంగ బద్ద పదవుల్లో ఉన్న గవర్నర్, రాష్ట్రపతులను అందులోనూ ముఖ్యంగా ఆ పదవిలో కొనసాగుతున్న మహిళలను గౌరవించలేని పరిస్థితుల్లో కేసీఆర్ ప్రభుత్వం ఉందని విమర్శించారు. బుధవారం కరీంనగర్ లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో మంత్రి కేటీఆర్ వివిధ పర్యటనల సందర్భంగా బీజేపీపై చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గురించి మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆమె తప్పు పట్టారు.