Mancherial Bandh: సాగునీటి కోసం మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా బంద్ - కాంగ్రెస్ నాయకుల అరెస్ట్
Mancherial Bandh: మంచిర్యాల రైతులు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. అలాగే రైతులకు సాగు నీరు అందించాలని డిమాండ్ చేశారు.
Mancherial Bandh: గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా కడెం ప్రాజెక్టు ఆయకట్టు పంట పొలాలకు సాగునీరు అందించాలని మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారని తెలిపారు. నేడు మూడో రోజు రైతుల ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతోందన్నారు. రైతులు చేస్తున్న నిరాహార దీక్షకు మద్దతుగా నేడు మంచిర్యాల జిల్లా బంద్ కు పిలుపునివ్వగా.. గురువారం మంచిర్యాల పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకుని స్టేషన్ తరలించారని చెప్పుకొచ్చారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో వర్తక వాణిజ్య సంస్థలు శాంతియుతంగా బంద్ చేస్తుంటే పోలీసులు అకారణంగా అరెస్టు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ.. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కేసీఆర్ కు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు కనబడడం లేదా అని ప్రశ్నించారు. గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు అందిస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే గొప్పలు చెప్పుకుంటు రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రైతులపై ప్రేమ ఉంటే గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ కడేం ప్రాజెక్టు చివరి ఆయకట్టు వరకు నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సర్కారుకు వ్యతిరేకంగా మాట్లాడితే..!
రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే పోలీసులు అక్రమ అరెస్టు చేస్తూ భయానక వాతావరణo సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే దివాకర్ రావు స్పందించి గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చివరి ఆయకట్టు వరకు నీరందించాలని డిమాండ్ చేశారు. వారితో మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, పీసీసీ సభ్యుడు కొండ చంద్రశేఖర్, కౌన్సిలర్లు రామగిరి బానేష్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు సంజీవ్, మాజీద్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వడ్డె రాజమౌళి, పూదరి ప్రభాకర్, మోహన్ రెడ్డి, చింతకింద మల్లయ్య, జిల్లా మహిళా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్ట లావణ్య, నక్క రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
దిక్కుతోచని స్థితిలో ఆమరణ నిరాహార దీక్ష
మంచిర్యాల జిల్లాలో పొలాల్లో సాగు నీరందక భూములు నెర్రలు బారుతున్నాయి. తడి ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. అసలే భారీ వర్షాలకు నష్టపోయిన రైతులు, ఇప్పుడు కడేం ఆయకట్టుకు గూడేం ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరందక ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి, లక్షెటిపేట్, హాజీపూర్ మండలాలలోని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దిక్కు తోచని స్థితిలో అన్నదాతలు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే పలుమార్లు ధర్నాలు, రాస్తారోకోలు చేసినా తీరు మారలేదు. దీంతో సాగు నీరందించాలని డిమాండ్ చేస్తూ రైతులు దండేపల్లిలో ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ నిలిచింది. మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు రైతులతో కలిసి ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. ఫిబ్రవరి 28న ఈ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. ఈ ఆమరణ నిరాహారదీక్ష విజయవంతంగా కొనసాగింది.