Mancherial News: టీచర్‌గా మారిన మంచిర్యాల జిల్లా కలెక్టర్, అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం
Mancherial District Collector | మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ జిల్లా కేంద్రంలోని షెడ్యూల్డ్ కులాల సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహాన్ని శనివారం తనిఖీ చేశారు.

Mancherial District Latest News | మంచిర్యాల: ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యాభ్యాసిస్తున్న విద్యార్థులకు నాణ్యమైన పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని షెడ్యూల్డ్ కులాల సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహాన్ని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత, వసతి గృహ పరిసరాలను పరిశీలించారు. మెస్ కమిటీ సభ్యులతో రోజువారి ఆహార పట్టిక అమలుపై వివరాలు అడిగి తెలుసుకుని, విద్యార్థినులతో కలిసి అల్పాహారం చేశారు.
అమ్మ ఆదర్శ పాఠశాలలు..
ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ.. విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుంది. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలలో త్రాగునీరు, విద్యుత్, మూత్రశాలలు ఇతర అన్ని సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందిస్తున్నాం. ఆహారం తయారీలో తాజా కూరగాయలు, నిత్యవసర సరుకులు వినియోగించాలని, విద్యార్థులకు వేడి భోజనం, శుద్ధమైన త్రాగునీరు అందించాలని సూచించాం.

విద్యార్థుల నీటి సమస్య పరిష్కారానికి హామీ
వర్షాకాలం సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వసతి గృహాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించాలి. విద్యార్థినుల మానసిక పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సరైన మార్గ నిర్దేశం చేసి వారిలో మనోధైర్యాన్ని కల్పించాలని సంక్షేమ అధికారిని ఆదేశించాం. వసతి గృహ సంక్షేమ అధికారి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. వసతి గృహంలో నెలకొన్న నీటి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. బోర్ వెల్ మంజూరు చేసి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని’ కలెక్టర్ తెలిపారు.

గిరిజన సంక్షేమ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ
అనంతరం మంచిర్యాల పట్టణంలోని సాయికుంటలో గల ప్రభుత్వ గిరిజన సంక్షేమ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న సదుపాయాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. వర్షాకాలం అయినందున విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సీజనల్ వ్యాధుల నియంత్రణకు పాటించవలసిన జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు సిహెచ్. దుర్గాప్రసాద్, సహాయ సాంఘిక సంక్షేమ అధికారి ఎం. రవీందర్, వసతి గృహ సంక్షేమ అధికారి డి. చందన, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.





















