Nizamabad News: ఆసక్తికరంగా ఆకుల లలిత యాక్టివిటీస్- నిజామాబాద్ అర్బన్‌లో పోటీకి సమాయత్తం!
నిజామాబాద్ అర్బన్ పై ఆకుల లలిత గురి. వచ్చే ఎన్నికల్లో అర్బన్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారంటూ జోరుగా ప్రచారం. సామాజిక వర్గం అండతో గెలుపుపై ధీమా... అర్బన్ లో పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న లలిత.
ఆకుల లలిత...తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పోరేషన్ ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఆకుల లలిత బీఆర్ఎస్‌లో చేరకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా చేశారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. 2008లో జరిగిన బైపోల్స్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఆర్మూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీగా కూడా చేశారు. ప్రస్తుతం ఆకుల లలిత తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ గా పనిచేస్తున్నారు.
ఆకుల లలిత ఈసారి నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తారన్న ప్రచారం నిజామాబాద్ పొలిటికల్ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ మధ్య ఆకుల లలిత తమ సామాజిక వర్గంలోని మహిళలను ఏకం చేస్తూ పలు కార్యక్రమాలు కూడా నిర్వహించారు. మున్నూరు కాపు మహిళలను ఏకం చేస్తూ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వన భోజనాలు ఏర్పాటు చేశారు. గత కొంత కాలంగా యాక్టివ్ పాలిటిక్స్‌లో పాల్గొంటున్నారు ఆకుల లలిత.
నిజామాబాద్ అర్బన్‌లో మున్నూరు కాపు సామాజిక వర్గం ప్రాభల్యం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ బలమైన సామాజిక వర్గం. ఆకుల లలిత కూడా మున్నూరు కాపు సామాజిక వర్గం కావటం... వచ్చే ఎన్నికల్లో అర్బన్ నుంచి పోటీ చేస్తే కలిసొస్తుందనే ఉద్దేశంలో ఉన్నారని తెలుస్తోంది. గతంలో ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నుంచి ఆకుల లలిత ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆర్మూర్ నుంచి పోటీ చేసేందుకు అంతగా ఆసక్తి లేదన్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె గురి నిజామాబాద్ అర్బన్ పై మళ్లీందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అర్బన్ సిట్టింగ్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఇప్పటికే రెండుసార్లు వరుసగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు. మూడోసారి రంగంలోకి దిగేందుకు బిగాల సమాయత్తమవుతున్నారు. అయితే ఆకుల లలిత కూడా అర్బన్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అర్బన్ లో ఆకుల లలిత చేస్తున్న హడావుడి చూస్తుంటే ఆమె ఇక్కడి నుంచి పోటీ చేస్తారన్న సంకేతాలు కనిపిస్తున్నాయని భావిస్తున్నారు. ఆకుల లలిత ఎక్కడా నేరుగా చెప్పకున్నా....అర్బన్ లో యాక్టివ్ పాలిటిక్స్ చేస్తుండటంపై అనుమానాలు తలెత్తుతున్నాయంటున్నారు. అర్బన్ లో గెలుపొటములను ప్రభావితం చేసే మున్నూరు కాపు అభ్యర్థులను బరిలో దించే యోచనలో రాజకీయ పార్టీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక వేళ ఇదే సామాజిక వర్గం నుంచి అర్బన్ లో బరిలోకి దింపాలనుకుంటే ... బీఆర్ఎస్ నుంచి ఆకుల లలితకు కచ్చితంగా అవకాశం ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. అర్బన్ లో గత 8 ఏళ్ల కాలంలో అభివృద్ధి కూడా జరుగుతోంది. బిగాల గణేష్ గుప్తా అర్బన్ డెవలప్ మెంట్ ముందు నుంచి చురుగ్గా ఉన్నారు. అయితే ఇటీవల అర్బన్ బీఆర్ఎస్ లో ఆకుల లలిత పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతుండటం కొంత చర్చకు దారితీస్తోంది. అటు ఆకుల లలిత మాత్రం పార్టీ అధిష్టానం ఆదేశాలకు కట్టుబడి ఉంటానని చెబుతున్నారు. ఇటు బిగాల గణేష్ గుప్తా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి మూడో సారి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం తనకే వస్తుందన్న ధీమాతో ఉన్నారు.