Asifabad Latet News: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా గుండి గ్రామస్తుల పాట్లు- థర్మకోల్ తెప్పలపై ప్రమాదకర ప్రయాణం
Asifabad Latet News: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా గుండి గ్రామస్తులు థర్మకోల్ తెప్పలపై ప్రమాదకర ప్రయాణాలు చేస్తున్నారు. ప్రభుత్వం వంతెన నిర్మించాలని కోరుతున్నారు.

Asifabad Latet News: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని గుండి గ్రామస్తులకు వర్షాకాలం వచ్చిందంటే నరకం చూడాల్సివస్తుంది. గుండి గ్రామం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి 3 కిలోమీటర్ల దూరంలో దగ్గరలోనే ఉన్నా… గుండి గ్రామస్థుల పరిస్థితి మధ్యయుగాల్లా ఉంది. ఏ పని చేసుకోవాలన్నా… పొలాలకు వెళ్లాలన్నా… జిల్లా కేంద్రానికి వెళ్లాలన్నా… ఒకే ఒక దారి – పెద్ద వాగు దాటాల్సిందే. ఇక ఎండాకాలంలో కష్టాలు తక్కువే. కానీ వర్షాలు మొదలయ్యాయంటేనే గుండి గ్రామస్తుల్లో ఆందోళన మొదలవుతుంది. ఉధృతంగా ప్రవహించే వాగును దాటడం కష్టమైపోతుంది. గర్భిణులు… చిన్నపిల్లలు… వృద్ధులు… ప్రాణాలు పణంగా పెట్టుకుని వాగు దాటాల్సిన దుస్థితి నెలకొంది.

అత్యవసర సమయాల్లో పరిస్థితి మరింత విషమంగా ఉంటోంది. ఆసుపత్రికి వెళ్లాలన్నా… అత్యవసర సేవలు పొందాలన్నా… థర్మకోల్ తెప్పలే వీరికి ఆధారం. ప్రజలు పడవలెక్కి కాదు… ప్రమాదకరమైన థర్మకోల్ తెప్పలపై ఊపిరిబిగబట్టి వాగు దాటుతున్నారు. ప్రజల ప్రాణాలు పణంగా పెట్టిన ఈ సమస్యను ప్రభుత్వం ఎప్పుడు పరిష్కరిస్తుంది..? వాగు మీద వంతెన ఎప్పుడొస్తుంది..? ప్రజల ఆత్మహృదయ కేకలు ఎవరికి వినబడతాయి..? అంటూ సోషల్ మీడియాలో వీరి కష్టాలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే గుండి పెద్దవాగు పై వంతెన నిర్మించాలని కోరుతున్నారు.






















