Komaram Bheem Asifabad Latest News: కుమ్రం భీం ఆసిఫాబాద్ రైతుల భూ పరిహారం కోసం ఆర్డీవో కార్యాలయం ఆస్తుల జప్తు! కారణం ఏంటి?
Komaram Bheem Asifabad Latest News:కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆర్డీవో కార్యాలయం ఆస్తులను జప్తు చేయాలని జిల్లా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. భూసేకరణ కేసులో ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.

Komaram Bheem Asifabad District Court: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ ఆర్డీవో కార్యాలయం ఆస్తులను కోర్టు సిబ్బంది జప్తు చేశారు. ప్రత్యేక వాహనంలో కార్యాలయంలోని టేబుళ్లు, కంప్యూటర్లు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకొని సీనియర్ సివిల్ కోర్టుకు తరలించారు. వాంకిడి మండలం బంబార శివారుల గల పెవుట గ్రామంలో 2012లో చెరువు నిర్మాణానికి 13 మంది రైతుల నుంచి సుమారు 70 ఎకరాల భూమి సేకరించారు. ఈ పరిహారం వ్యవహారంలో జరిగిన లోటుపాట్ల కారణంగా ఇప్పుడు కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
చెరువు నిర్మాణానికి తీసుకున్న భూములకు ఎకరాకు రూ.62 వేల చొప్పున 2013లో పరిహారం చెల్లించారు. మార్కెట్ ధర ఎక్కువగా ఉందని ఇచ్చిన పరిహారం సరిపోదని రైతులు వాదించారు. అధికారుల చుట్టూ తిరిగారు. ప్రయోజనం లేకపోవడంతో ఈ వ్యవహారం ఆసిఫాబాద్ సీనియర్ సివిల్ కోర్టుకు చేరింది.
కోర్టులో వాదనల తర్వాత 2019 జులైలో కీలక తీర్పు వెలువడింది. ఎకరాకు రూ.3 లక్షలతోపాటు భూమి తీసుకున్న రోజు నుంచి వడ్డీతో చెల్లించాలని న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ఈ కోర్టు తీర్పును అధికారులు లైట్ తీసుకున్నారు. దీంతో మళ్లీ సదరు రైతులు కోర్టుకు మొరపెట్టుకున్నారు. డబ్బులు ఇవ్వలేదని పిటిషన్ వేశారు. రూ.2,24,58,137 పరిహారం కోసం పిటిషన్ వేశారు.

రైతులు సివిల్ కోర్టుకు వెళ్లడంతో అధికారులు సివిల్ కోర్టు తీర్పుపై 2022లో హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు స్టే విధిస్తూ ఎనిమిది వారాల్లో సగం డబ్బులు ఆసిఫాబాద్ కోర్టులో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. లేదంటే గడువు తర్వాత స్టే తొలగిపోతుందని పేర్కొంది. పరిహారం కోసం జిల్లా అధికారులు.. ప్రభుత్వానికి నివేదించినా నిధులు మంజూరు కాలేదు. దీంతో కోర్టుకు డబ్బులు చెల్లించలేదు.
హైకోర్టు తీర్పును ఉల్లంఘించడమే కాకుండా తరచూ వాయిదాలు కోరుతూ కేసులో జాప్యం చేయడం ప్రారంభించారు. దీన్ని గమనించిన ఆసిఫాబాద్ సీనియర్ సివిల్ జడ్జి కె. యువరాజా ఆస్తుల జప్తునకు ఆదేశించారు. కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు ఆర్డీవో కార్యాలయంలోని ఫర్నీచర్‌ను సీజ్ చేసి తీసుకెళ్లిపోయారు.





















