Asifabad News: రేషన్ బియ్యం రీసైక్లింగ్ కు ప్రధాన సూత్రధారి సిర్పూర్ ఎమ్మెల్యే: బీజేపీ ఆరోపణలు
రేషన్ బియ్యం రీసైక్లింగ్, వడ్ల కటింగ్ కుంభకోణాలకు ప్రధాన సూత్రధారి సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పనే అని నియోజకవర్గ బిజెపి నాయకులు డా. పాల్వాయి హరీష్ బాబు ఆరోపించారు.
Asifabad News: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో జరుగుతున్న రేషన్ బియ్యం రీసైక్లింగ్, వడ్ల కటింగ్ కుంభకోణాలకు ప్రధాన సూత్రధారి సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పనే అని నియోజకవర్గ బిజెపి నాయకులు డా. పాల్వాయి హరీష్ బాబు ఆరోపించారు. కాగజ్ నగర్ పట్టణంలోని తన నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిర్పూర్ నియోజక వర్గంలో జరుగుతున్న రేషన్ బియ్యం రీసైక్లింగ్, వడ్ల కటింగ్ కుంభకోణాలపై మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాలుగా సిర్పూర్ నియోజకవర్గంలో జరుగుతున్న రేషన్ బియ్యం రీసైక్లింగ్, వడ్ల కటింగ్ కుంభకోణాలు మొత్తం సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కనుసన్నల్లోనే జరుగుతున్నాయని విమర్శించారు. ఇటీవల వెలుగు చూసిన ఘటనలో కాగజ్ నగర్ పట్టణంలోని రైస్ మిల్లులో రేషన్ బియ్యాన్ని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకోవడం జరిగిందని తెలిపారు. స్థానిక రెవెన్యూ అధికారులు, సివిల్ సప్లైస్ అధికారులు పూర్తిగా ఈ కుంభకోణానికి సహకరిస్తున్నారని విమర్శించారు.
అందుకే హైదరాబాద్ నుంచి అధికారులు వస్తే గాని ఇక్కడి కుంభకోణాల మీద విచారణ జరిగే పరిస్థితి లేదని దుయ్యబట్టారు. ఒక్క సంవత్సరం సేకరించిన 40 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సిఎంఆర్ కోసం రైస్ మిల్లులకు పంపిస్తే దాదాపు 30 నుండి 40 కోట్ల అవినీతి జరుగుతుందని తెలిపారు. రేషన్ షాపుల నుండి బియ్యాన్ని కొని మళ్లీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కే అమ్మడం జరుగుతోందని, ఒక్కో కిలో రేషన్ బియ్యం మీద పది రూపాయల అవినీతి జరిగిందని అంచనా వేసినా దాదాపు రూ. 30 నుంచి 40 కోట్లు ప్రజా ధనం లూటీ అవుతుందని తెలిపారు.
ప్రతి సంవత్సరం 10 శాతం వడ్ల కటింగ్ వలన (క్వింటాల్కు 10 శాతం అంటే 10 కిలోల చొప్పున వడ్ల కటింగ్) రైతులను నట్టేట ముంచుతున్నారని విమర్శించారు. దానివలన దాదాపు రూ. 8 నుంచి 10 కోట్ల నష్టం రైతులకు జరుగుతుందని తెలిపారు. మొత్తంగా చూస్తే ప్రతి సంవత్సరం ఈ రెండు కుంభకోణాల్లో రూ. 50 కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందని, గత నాలుగు సంవత్సరాలుగా లెక్కవేస్తే రూ. 200 కోట్ల రూపాయల కుంభకోణం అని అన్నారు. ఈ కుంభకోణాల సూత్రధారిగా సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పనిచేస్తున్నారని, ఆయన సనుసన్నల్లోనే రైస్ మిల్లర్లు, అధికారులు కుమ్మక్కై అవినీతికి పాల్పడుతున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని తెలిపారు. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు.
ఇంకోవైపు సిర్పూర్ నియోజకవర్గ ప్రజలు, రైతాంగం ఈ అడ్డగోలు అవినీతికి పాల్పడుతున్న ఎమ్మెల్యే మరియు ఆయనకు వత్తాసు పలుకుతున్న రైస్ మిల్లర్లు మరియు అధికారుల అవినీతిని గుర్తించాలని కోరడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇటువంటి అవినీతిపరులకు ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఈర్ల విశ్వేశ్వరరావు, నియోజకవర్గ కన్వీనర్ వీరభద్రచారి, పట్టణ అధ్యక్షులు సిందం శ్రీనివాస్, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మాచర్ల శ్రీనివాస్, ఎస్సీ మోర్చా నాయకులు రాజేందర్ జాంజోడ్, కొండా తిరుపతి తదితరులు పాల్గొన్నారు.