Komuram Bheem Asifabad News: దాగుడు మూతలు ఆడుతూ ప్రాణాలు కొల్పోయిన బాలుడు
Komuram Bheem Asifabad News: దాగుడు మూతలు ఆడుతూ ఇంట్లో నిల్వ చేసిన పత్తిలో దాక్కున్నాడో పదేళ్ల బాలుడు. పాపం అదే అతని పాలిట శాపంగా మారింది. ఊపిరాడక అక్కడికక్కడే బాలుడు మృతి చెందాడు.
Komuram Bheem Asifabad News: తమ్ముడు, చెల్లితో కలిసి సరదాగా దాగుడుమూతలు ఆడుతున్నాడు. అదే అతడి పాలిట శాపంగా మారింది. ఆటలో భాగంగా ఇంట్లో నిల్వ చేసిన పత్తిలో పదేళ్ల బాలుడు దాక్కున్నాడు. ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
అసలేం జరిగిందంటే..?
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం కన్నేపల్లిలోని చెన్నూరు కైలాస్, రమ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. పెద్ద కొడుకు అభిషేక్ కు పదేళ్ల వయస్సు. ప్రస్తుతం అతడు కౌటాలలోని ప్రైవేటు పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం సాయంత్రం బడికి వెళ్లి వచ్చిన అభిషేక్.. తమ్ముడు, చెల్లితో కలిసి దాగుడు మూతల ఆట మొదలు పెట్టాడు. ఆ సమయానికి తల్లిదండ్రులు చేనులో ఉన్నారు. తమ్ముడు, చెల్లికి దొరక్కుండా ఉండేందుకు ఇంట్లో నిల్వ చేసిన పత్తి కుప్పలోకి చిన్న రంధ్రం చేసి అందులోకి వెళ్లడానికి ప్రయత్నించాడు. తల లోపలకు వెళ్లగా కాళ్లు బయటనే ఉండిపోయాయి. కొద్దిసేపటికి చెల్లి, తమ్ముడు చూసి పెద్దపెట్టున అరిచారు. అప్పటికే ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు అభిషేక్ ను బయటకు లాగి స్థానిక హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. కానీ అప్పటికే అభిషేక్ చనిపోయాడని వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
పండుగపూటే విషాదం- చిన్నారి మృతి
పాపం పెళ్లైన 20 ఏళ్ల వరకు వారికి సంతానం కల్గలేదు. ఇందుకోసం మొక్కని దేవుడు, తొక్కని ఆస్పత్రి గడపా లేదు. ఏ దేవుడి కరుణో తెలియదు కానీ వారికి పది నెలల క్రితమే సంతానం కల్గింది. ఇక ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు తెలుసుకున్నప్పటి నుంచి ఆమెపై తీసుకున్న జాగ్రత్తలు అన్నీ ఇన్నీ కాదు. బిడ్డ పుట్టాక కూడా బిడ్డపై అమితమైన ప్రేమను చూపిస్తూ.. ఆనందంగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే నూతన సంవత్సర వేడుకలను కూడా ఈ ఏడు సంతోషంగా జరుపుకోవాలనుకున్నారు. కానీ వారి కోరిక ఎంతో సేపు నిలవలేదు. పండుగ పూటే ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఇరవై ఏళ్ల తర్వాత పుట్టిన ఏకైక సంతానం తమకు దక్కకుండా పోయింది.
కర్నూలు జిల్లా సి,బెళగల్ మండలం చింతమాను పల్లె గ్రామంలో కొత్త సంవత్సరం రోజున తీవ్ర విషాధం నెలకొంది. గ్రామానికి చెందిన నల్లమ్మ, సువర్ణ దంపతుల పది నెలల కుమారుడు ఉన్నాడు. ఆదివారం రోజు అతడు మెంతో ప్లస్ బామ్ డబ్బాతో ఆడుకుంటూ దాన్ని నోట్లో పెట్టుకున్నాడు. పొరపాటున మింగేయగా.. అది గొంతులో ఇరుక్కుపోయింది. విషయం గుర్తించిన తల్లిదండ్రులు డబ్బాను బయటకు తీసేందుకు చాలా ప్రయత్నించారు. అయినా లాభం లేకపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా.. బాలుడు మృతి చెందాడు. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు బాబు మృతితో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బాబు గొంతులో డబ్బా ఇరుక్కోవడంతో ఊపిరాడకనే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. ఎన్నో దేవుళ్లకు పూజలు చేయగా, మరెన్నో ఆస్పత్రుల చుట్టూ తిరగ్గా.. పెళ్లైన 20 ఏళ్లకు పుట్టిన బిడ్డ ఇలా నూతన సంవత్సరం రోజే చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. తల్లిదండ్రుల ఏడుస్తున్న తీరు చూసిన ప్రతీ ఒక్కరూ కన్నీరుపెడుతున్నారు.