Bandi Sanjay : అధికార పార్టీ నేతలతో కొందరు కలెక్టర్లు మందు పార్టీలు, కేటీఆర్ రియల్ ఎస్టేట్ మంత్రి - బండి సంజయ్
Bandi Sanjay : కామారెడ్డి నూతన మాస్టర్ ప్లాన్ పై ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు తెలిపారు బండి సంజయ్. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు.
Bandi Sanjay : కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై రైతుల పోరుబాట పట్టారు. మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. ఈ మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రాములు అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైతుల ఆందోళనకు ప్రతిపక్షపార్టీలు మద్దతు ప్రకటించాయి. తాజా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కామారెడ్డిలో పర్యటించారు. నూతన మాస్టర్ ప్లాన్ కు నిరసనగా ఆత్మహత్య చేసుకున్న రైతు రాములు కుటుంబాన్ని బండి సంజయ్ పరామర్శించారు. బాధిత రైతు కుటుంబీకులకు ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ మూర్ఖత్వపు ఆలోచనతోనే రైతు రాములు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. పంటపొలాలు తీసుకుంటే అడ్డుకుంటామని బండి సంజయ్ తెలిపారు.
కేటీఆర్ రియల్ ఎస్టేట్ మంత్రి
కామారెడ్డి లో మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తున్న రైతులకు మద్దతుగా నిలుస్తామని బండి సంజయ్ ప్రకటించారు. తమ భూమి ఇండస్ట్రీయల్ జోన్ లో పోతుందనే కలత చెంది ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి అండగా ఉంటామన్నారు. రైతు రాములుది ఆత్మహత్య కాదు సర్కారు హత్యనే అని ఆరోపించారు. ఇండస్ట్రీయల్ జోన్ కు తాము వ్యతిరేకం కాదని, పంటపొలాలు తీసుకుంటే అడ్డుకుంటామన్నారు. అధికారపార్టీ నేతలు, అధికారులు కుమ్మక్కై పేద రైతుల పొట్టగొడుతున్నారని విమర్శించారు. పేద రైతులపై సర్కారు దౌర్జన్యం పెరిగిపోయిందని మండిపడ్డారు. అధికార పార్టీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారుల మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందన్నారు. కొందరు కలెక్టర్లు అధికారపార్టీ నేతలతో మందు పార్టీలకు వెళ్తున్నారని ఆరోపించారు. రాజకీయాల్లోకి వచ్చేది ఉంటే బీఆర్ఎస్ కండువా కప్పుకోవాలన్నారు. కేసీఆర్ పాలనలో రైతులు నాశనం అవుతున్నారని ధ్వజమెత్తారు బండి. కేటీఆర్ పురపాలక మంత్రి కాదు ఒక రియల్ ఎస్టేట్ మంత్రి అని విమర్శించారు. పట్టణాలకు ఎన్ని నిధులు ఇచ్చారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అర్ధరాత్రి దొంగ జీవోలు జారీ చేస్తే గుంజి కొడతామన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు.
కామారెడ్డిలో బండి సంజయ్ అరెస్ట్
కామారెడ్డి కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తున్న బీజేపీ చీఫ్ బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులకు, బీజేపీ నాయకులకు వాగ్వాదం జరిగింది. కలెక్టర్ ను కలవనీయకుండా పోలీసులు అడ్డుకున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తు్న్నారు. బీజేపీ నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. బండి సంజయ్ ను పోలీసులు హైదరాబాద్ కు తరలిస్తున్నారు.
కొత్త మాస్టర్ ప్లాన్ పై ఆందోళనలు
కామారెడ్డి జిల్లా ఏర్పడిన తర్వాత కామారెడ్డి పట్టణం ప్రజల అవసరాల దృష్ట్యా అధికారులు కొత్త మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేశారు. కామారెడ్డి పట్టణ పరిధిలో మౌలిక వసతుల కల్పన వ్యాపార, వాణిజ్య సంబంధాలు మెరుగుపరచాలనే ఉద్దేశంతో పాత మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేశారు. అయితే కొన్ని విలీన గ్రామాలకు చెందిన వ్యవసాయ సాగు భూములు ఇండస్ట్రీయల్, గ్రీన్ జోన్లోకి మార్చడంపై రైతులు అభ్యంతరాలు వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు. మొదట్లో కొద్దిమంది రైతులు ఆందోళ నకు దిగారు. అధికారులు, అధికార పార్టీ నాయకుల నుంచి ఎటువంటి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఆందోళన బాట పట్టారు. రైతులకు బీజీపీ నాయకులు మద్దతుగా నిలిచారు. రైతులు నిత్యం వినూత్న రీతిలో ఆందోళనలు చేస్తున్నారు. కామారెడ్డి పట్టణ పరిధిలోని టేక్రియాల్, ఇచ్చిపూర్, అడ్లూర్, ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని అడ్లూర్, ఎల్లారెడ్డి గ్రామాల రైతులు ఆందోళన బాట పట్టారు. రెండు పంటలు సాగు చేసుకుంటున్న రైతుల భూములను ఇండస్ట్రీయల్, గ్రీన్ జోన్లుగా ఏర్పాటు చేయడంతో ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయ్. రాజకీయ నాయకుల స్వలాభం కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించారంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి పట్టణ పరిధిలోని అడ్లూర్, ఇచ్చిపూర్, టేక్రియాల్, అడ్లూర్, ఎల్లారెడ్డి గ్రామాలు ఉన్నాయి.